Advertisement
ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోకి వెళ్లినా సరే కచ్చితంగా పూజలు, అభిషేకాలు, హారతి తదితర కార్యక్రమాలు అన్నీ ముగిశాక భక్తులకు ప్రసాదం అందిస్తారు. ముందుగా దేవుడికి నైవేద్యం పెడతారు. అనంతరం పూజా కార్యక్రమాలు ముగిశాక ఆ దైవం ప్రసాదాన్ని భక్తులకు పంచి పెడతారు. ప్రసాదాలను తినడం వల్ల సాక్షాత్తూ ఆ దైవమే వచ్చి ఆశీర్వాదాలు అందిస్తుందని నమ్ముతారు. ఇక ఆలయాన్ని బట్టి, అందులో పూజించే దైవాన్ని బట్టి భిన్న రకాల ప్రసాదాలను భక్తులకు పంచి పెడతారు. ఈ క్రమంలోనే దేశంలోని పలు ఆలయాల్లో అందించే భిన్న రకాల ప్రసాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. అలగార్ కోవిల్, తమిళనాడు:
మదురై నుంచి ఈ ఆలయం సుమారుగా 21 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయానికి సమీపంలో ఉన్న అనేక మంది రైతులు ఇక్కడికి బియ్యం, తృణధాన్యాలు తీసుకువస్తారు. అనంతరం ఆ ధాన్యాలతో దోశలను తయారు చేస్తారు. తరువాత వాటిని దైవానికి నైవేద్యంగా పెడతారు. అనంతరం వాటిని భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు.
2. చైనీస్ కాళీ ఆలయం, కోల్‌కతా:
చైనా నుంచి కోల్‌కతాకు వచ్చినవారు ఈ ఆలయాన్ని నిర్మించారు. అందువల్ల ఈ ఆలయం ఉన్న ప్రాంతాన్ని చైనాటౌన్ ఆఫ్ కోల్‌కతా అని కూడా పిలుస్తారు. ఇందులో చైనీస్ ఫాస్ట్‌ఫుడ్ అయిన నూడుల్స్, చాప్సే, ఫ్రైడ్ రైస్‌లను ప్రసాదంగా పంచి పెడతారు.
Advertisements
3. ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయం, కర్ణాటక:
కర్ణాటకలోని నేత్రావతి నదీ తీరంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడ శివపార్వతులను చంద్రనాథ్, మంజునాథ, అమ్మనవారుగా భక్తులు పూజిస్తారు. ఈ ఆలయంలో అన్నాన్నే ప్రసాదంగా స్వీకరిస్తారు. నిత్యం 10వేల మందికి ఇక్కడ అన్నదానం చేస్తారు.
4. గోల్డెన్ టెంపుల్, అమృతసర్:
సిక్కులు ఈ టెంపుల్‌ను అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. ఇక్కడకి ఏటా కొన్ని లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దాదాపుగా అనేక మతాలకు చెందిన వారు ఈ టెంపుల్‌ను సందర్శిస్తారు. ఇక్కడ 100 క్వింటాళ్ల గోధుమ పిండిని ఉపయోగించి నిత్యం రొట్టెలను తయారు చేస్తారు. వాటినే ఇక్కడ ప్రసాదంగా పెడతారు. భక్తులు భారీ సంఖ్యలో ఒకరి పక్కన ఒక్కరు బంతిలో కూర్చుని రొట్టెలను ప్రసాదంగా స్వీకరిస్తారు. 25 క్వింటాళ్ల తృణధాన్యాలతో రొట్టెల్లోకి కూర చేస్తారు. మరో 10 క్వింటాళ్ల బియ్యంతో అన్నం వండి వడ్డిస్తారు. 5వేల లీటర్ల పాలు, 10 క్వింటాళ్ల చక్కెర, 5 క్వింటాళ్ల నెయ్యితో తీపి వంటకం చేసి పంచి పెడతారు. ఈ ఆహారం పూర్తిగా శాకాహారం. ఎక్కడా కనీసం ఉల్లిగడ్డలు, వెల్లుల్లిని కూడా వాడరు. చలికాలంలో సర్సోన్ కా సాగ్ అనే వంటకాన్ని వడ్డిస్తారు. డబ్బులు చెల్లించే వారికి పప్పు, అన్నం పెడతారు.
5. గణపతిపూలె ఆలయం, మహారాష్ట్ర:
Advertisement
ఇక్కడ వినాయకున్ని భక్తులు పూజిస్తారు. కిచ్‌డీ, పచ్చళ్లు, బూందీ ఇక్కడ ప్రసాదంగా పెడతారు. సాయంత్రం వేళల్లో మసాలా రైస్, పచ్చళ్లు పెడతారు.
6. మాతా వైష్ణోదేవి, కాట్రా, జమ్మూ అండ్ కాశ్మీర్:
ఈ ఆలయానికి ఏటా వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక్కడ ప్రసాదాన్ని ప్లాస్టిక్ ప్యాకెట్లలో పెట్టి ఇస్తారు. అందులో కొబ్బరి, చక్కెర ఉండలు, డ్రై యాపిల్స్ ఉంటాయి. వాటిని భక్తులు ప్రసాదాలుగా స్వీకరిస్తారు.
7. పూరీ జగన్నాథ్ ఆలయం:
ఈ ఆలయంలో ప్రసాదాన్ని మహాప్రసాదంగా భావిస్తారు. రోజుకు మొత్తం 6 సార్లు ప్రసాదం పంచి పెడతారు. కేవలం మట్టికుండల్లో మంటపై మాత్రమే ప్రసాదాన్ని వండుతారు. ముందుగా దేవుడికి నైవేద్యం పెట్టాకే ప్రసాదాన్ని పంచి పెడతారు. అరటి ఆకులపై ప్రసాదాన్ని భక్తులకు అందజేస్తారు. అందులో 56 రకాల పదార్థాలు ఉంటాయి. అందుకనే దాన్ని మహాప్రసాదం అని పిలుస్తారు.
8. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం:
కేరళలో ఉన్న ఈ ఆలయం ఎంతగానో పేరుగాంచింది. ఏటా సంక్రాంతి సమయంలో ఈ ఆలయానికి భక్తులు లక్షల సంఖ్యలో వచ్చి మాలను తీసేస్తారు. ఇక్కడ అప్పం, అరవణ పాయసం అనబడే ప్రసాదాలను పంచి పెడతారు.
9. శ్రీకృష్ణ ఆలయం, అంబ్లపుర, కేరళ:
ఈ ఆలయంలో బియ్యంతో వండిన వంటకాన్ని ప్రసాదంగా అందిస్తారు. దాన్ని పాల్పాయసంగా పిలుస్తారు. ఇది చాలా భిన్నమైన రుచిని కలిగి ఉంటుంది. ఇందులో ఏమేం పదార్థాలను ఉపయోగిస్తారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కేవలం ఆలయ సంరక్షకులకు మాత్రమే ప్రసాద రెసిపి తెలుసు.
10. శ్రీ వెంకటేశ్వర ఆలయం, తిరుపతి:
తిరుపతిలో లడ్డూను ప్రసాదంగా అందిస్తారని తెలుగు వారందరికీ తెలుసు. ఈ లడ్డూకు జియోగ్రాఫికల్ కాపీ రైట్స్ కూడా లభించాయి. మొత్తం 2 రకాల సైజుల్లో లడ్డూలను అందిస్తారు. ఒక టన్ను శనగపిండి, 10 టన్నుల చక్కెర, 700 కిలోల జీడిపప్పు, 150 కిలోల యాలకులు, 300 నుంచి 500 లీటర్ల నెయ్యి, 500 కేజీల చక్కెర పాకం, 540 కేజీల కిస్మిస్‌లు వేసి నిత్యం లడ్డూలను తయారు చేస్తారు. శ్రీవారి లడ్డూకు 300 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. లడ్డూ ప్రసాదాన్ని భక్తులు పరమపవిత్రమైనదిగా భావిస్తారు. లడ్డూను స్వీకరిస్తే శ్రీవారు స్వయంగా వచ్చి ఆశీర్విదించినట్లు అవుతుందని భక్తులు విశ్వసిస్తారు.
Advertisements