Advertisement
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఇప్పటికీ హిందూ దేవాలయాలు ఎక్కడో ఒక చోట బయట పడుతూనే ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ ఆలయాలు ఒక్కొక్కటిగా అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి.. కాండి సుకుహ్.. అది శివాలయం. ఇండోనేషియాలోని జావా దీవుల్లో ఈ ఆలయం ఉంది. దీన్ని క్రీస్తు శకం 15వ శతాబ్దంలో నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయం సుమారుగా 910 మీటర్ల ఎత్తులో ఒక కొండ ప్రాంతంలో నిర్మాణమై ఉంది. మధ్య, తూర్పు జావా ప్రావిన్స్‌ల సరిహద్దు ప్రాంతంలోని మౌంట్ లావు అనే పర్వతంపై ఈ ఆలయాన్ని నిర్మించారు.
ఇండోనేషియాలో ఇస్లాం రాకముందే కాండి సుకుహ్ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ ఆలయంలో శివున్ని పూజిస్తారు. ఈ క్రమంలోనే మహాభారతానికి సంబంధించిన పలు ఘట్టాలను మనం ఆలయ గోడలపై చూడవచ్చు. ఇక ఆలయ నిర్మాణం మయన్ల నిర్మాణశైలిని తలపిస్తుంది. ఈ ఆలయాన్ని క్రీస్తుశకం 1437లో నిర్మించి ఉంటారని సమాచారం. క్రీస్తుశకం 1293 నుంచి 1500వ సంవత్సరాల నడుమ మజాపహిత్ రాజ్యంలో ఈ ఆలయం నిర్మాణమై ఉంటుందని తెలుస్తోంది.
1815-1816 సంవత్సరాల్లో జావా దీవులను పాలించిన సర్ థామస్ రాఫెల్స్ కాండి సుకుహ్ ఆలయాన్ని సందర్శించారు. అయితే అప్పట్లో ఆలయం బాగా శిథిలమై కనిపించింది. అనేక విగ్రహాలను నేలపై పడేశారు. ఆలయంలో చాలా భాగాలు ధ్వంసమయ్యాయి. ఓ భారీ శివ లింగం రెండు ముక్కలై కనిపించింది. దీంతో రాఫెల్స్ ఆ ముక్కలను గమ్‌తో అతికించారు.
Advertisements
Advertisement
ఇక ఆలయంలో గాజుతో తయారు చేయబడిన ఓ శివలింగం లభ్యమైంది. అది పైన గాజును, కింద ఇత్తడిని కలిగి ఉంటుంది. అయితే ఆలయాన్ని క్రీస్తుశకం 1437లో నిర్మించారని అనుకుంటున్నా.. అంతకు పూర్వమే.. అంటే క్రీస్తు శకం 1000వ సంవత్సరంలోనే ఆ లింగాన్ని తయారు చేశారని తెలుస్తోంది. ఆ లింగంలోని ఇత్తడి భాగంలో నిల్వ చేసిన నీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంది. ఎండిపోలేదు. ఇది అందరినీ షాక్‌కు గురి చేసింది. పురాతత్వశాస్త్రవేత్తలు ఆ నీటిని పరీక్షించారు. అది ఇప్పటికీ స్వచ్ఛంగా, తాగే విధంగా ఉందని తేల్చారు. ఇది మరింత ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే కొందరు ఆ నీటిని అమృతమని అంటున్నారు. మహాభారతానికి చెందిన ఆది పర్వంలో రాయబడిన అమృతం గురించిన వివరాలను కాండి సుకుహ్ ఆలయంలో గోడలపై కూడా మనం చదవవచ్చు. అయితే అదే అమృతాన్ని సదరు లింగంలోని ఇత్తడి భాగంలో దాచారని అంటున్నారు. ఇక ఆలయ తవ్వకాల్లో పురాతన ఆభరణాలు.. ముఖ్యంగా అప్పటి స్త్రీలు ధరించిన బంగారు గాజులు కూడా బయటపడ్డాయి. అలాగే పలు ఇతర వస్తువులను కూడా వెలికి తీశారు.
ఆలయ తవ్వకాల్లో బయట పడ్డ అనేక వస్తువులను మధ్య జావాలోని ప్రాంబనన్ ప్రాంతంలో ఉన్న క్లేటెన్‌లోని ఆర్కియలాజికల్ హెరిటేజ్ ప్రిజర్వేషన్ హాల్‌లో భద్రపరిచారు. మహాభారత కాలానికి చెందిన పలు దృశ్యాలను తలపించే విగ్రహాలు, ఆకృతులతోపాటు అర్జునుడు, గణేషుడు, భీముడు తదితరుల విగ్రహాలను కూడా ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు.
Advertisements