Advertisement
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ అనేక దేశాల్లో పురాతన స్థలాల తవ్వకాల్లో హిందూ ఆలయాలకు సంబంధించిన ఆనవాళ్లు బయట పడుతూనే ఉన్నాయి. వియత్నాంలోని మై సన్ శాంక్చువరీలో ఉన్న చామ్ టెంపుల్ కాంప్లెక్స్‌లో అక్కడి అధికారులతో కలిసి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సైంటిస్టులు తవ్వకాలు జరిపారు. అందులో 1100 ఏళ్ల కిందటి శివలింగం బయట పడింది. అది 9వ శతాబ్దం కాలం నాటికి చెందినదని సైంటిస్టులు తెలిపారు.
మధ్య వియత్నాంలోని కువాంగ్ నామ్ ప్రావిన్స్‌లో ఉన్న మై సన్ శాంక్చువరీలో క్రీస్తు శకం 4వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం మధ్య పాలించిన చంపా సామ్రాజ్యానికి చెందిన రాజులు పలు హిందూ ఆలయాలను నిర్మించారు. ఆ ఆలయాల ప్రాంగణంలో తవ్వకాలు జరపగా ఆ శివలింగం బయట పడింది. అది ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం విశేషం.
Advertisement
కాగా భారత్ ఇప్పటికే ఆసియాలోని పలు దేశాల్లో ఆయా దేశాల పురాతత్వ శాఖలతో కలిసి పలు చోట్ల తవ్వకాలు జరుపుతూ.. పురాతన, చారిత్రక కట్టడాలను పరిరక్షించే పనిలో పడింది. అందులో భాగంగానే వియత్నాంలో అక్కడ తవ్వకాలు జరపగా ఆ శివలింగం బయట పడింది. కాగా 2018లోనే భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మై సన్ శాంక్చువరీని సందర్శించారు. అక్కడి పురాతన హిందూ ఆలయాల స్థలాన్ని పరిరక్షించేందుకు సహకారం అందిస్తామని తెలిపారు.
ఇక మై సన్ శాంక్చువరీని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద స్థలంగా గుర్తించింది. అప్పట్లో ఇంద్రవర్మన్ 2 అనే రాజు ఆ ఆలయాలను నిర్మించాడని చరిత్ర చెబుతోంది. ఇక అదే ఆలయ కాంప్లెక్స్‌లో మరో 6 శివలింగాలు కూడా తవ్వకాల్లో బయట పడ్డాయి.
Advertisements
Advertisements