Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

హైదరాబాద్‌ రాష్ట్రంలో అప్పట్లో ఉన్న 14 సంస్థానాలు…వాటి ఫోటోలు…వాటి విశిష్ట‌త‌లు క్లుప్తంగా.!

Advertisement

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బొబ్బిలి, పిఠాపురం, నూజివీడు, వెంకటగిరి, విజయనగరం తదితర సంస్థాలు ఉన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఇవి మద్రాస్‌ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. అయితే అదే సమయలో హైదరాబాద్‌ రాష్ట్రంగా ఉండేది. ఈ క్రమంలో హైదరాబాద్‌ పరిధిలోనూ అప్పట్లో మొత్తం 14 సంస్థానాలు ఉండేవి. అయితే వాటిలో 12 సంస్థానాలు తెలంగాణలో, మరో 2 కర్ణాటకలో ఉన్నాయి. ఇక ఆ సంస్థానాలు ఏమిటంటే…

1. గద్వాల్‌ సంస్థానం (గద్వాల్‌ జిల్లా): 


భారత ప్రభుత్వంలో విలీనం అయ్యేటప్పటికి గద్వాల్‌ హైదరాబాద్‌ రాష్ట్రంలోనే అతి పెద్ద సంస్థానంగా ఉండేది. 14వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో ఈ సంస్థానం కొనసాగింది. ముస్తిపల్లి కుటుంబానికి చెందిన పొలని రెడ్డి/బుద్ధారెడ్డి ఈ సంస్థానాన్ని స్థాపించారు. అప్పట్లో నాలా సోమనాద్రి (సోమన భూపాలనాడు), మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ (చివరిగా ఏలారు)లు ప్రముఖ సంస్థానాధీశులుగా ఉన్నారు. వీరు నిజాం పాలనలో తమ సొంత నాణేలను కూడా ముద్రించారు. అప్పట్లో కర్నూల్‌, అహోబిలం, నంద్యాల, ఆదోని, ఆత్మకూరులు కూడా ఇందులో భాగంగా ఉండేవి. 1948 వరకు 103 గ్రామాలు, 26 జాగీర్లు మొత్తం కలిపి 360 గ్రామాలు ఇందులో భాగంగా ఉండేవి.

2. వనపర్తి సంస్థానం (వనపర్తి జిల్లా): 

Advertisements


ఈ సంస్థానం 15వ శతాబ్దం కాలానికి చెందినది. దీన్ని జనుంపల్లి వీర కృష్ణారెడ్డి స్థాపించారు. జనుంపల్లి రామేశ్వర్‌రావు చివరిగా పాలించారు. ప్రముఖ బాలీవుడ్‌ నటీమణులు కిరణ్‌ రావు, అదితి రావు హైదరిలు ఈ సంస్థానానికి చెందిన వారసులుగా ఉన్నారు. ఇందులో 124 గ్రామాలు భాగంగా ఉండేవి. రామేశ్వర్‌ రావు ఓరియంట్‌ లాంగ్‌మన్‌ అనే బుక్‌ పబ్లిషింగ్‌ కంపెనీని స్థాపించారు. అదే ఇప్పుడు ఓరియంట్‌ బ్లాక్‌స్వాన్‌గా పిలవబడుతోంది. 1948లో ఆ కంపెనీని స్థాపించారు.

3. జ‌ట‌ప్రోలు సంస్థానం (నాగర్‌కర్నూల్‌ జిల్లా): 


ఇది కూడా 15వ శతాబ్దానికి చెందినది. మాధనాయుడు దీన్ని స్థాపించారు. మొదట్లో జ‌ట‌ప్రోలులో రాజధాని ఉండేది. తరువాత దాన్ని కొల్లాపూర్‌కు మార్చారు. దీన్నే కొల్హాపూర్‌ సంస్థానం అని పిలుస్తారు. దీన్ని సురభి కుటుంబం పాలించేది. వీరు బొబ్బిలి, పిఠాపురం, వెంకటగిరి సంస్థానాలతో సన్నిహితంగా ఉండేవారు. రాజా సురభి బాలాదిత్య లక్ష్మారావు దీన్ని చివరిగా పాలించారు.

4. దొమకొండ సంస్థానం (కామారెడ్డి జిల్లా):

 


ప్రముఖ టాలీవుడ్‌ నటుడు రామచరణ్, ఉపాసనల వివాహం జరిగినప్పుడు ఈ సంస్థానం పేరు ఒక్కసారిగా బయటకు వచ్చింది. ఇది 17వ శతాబ్దానికి చెందినది. కుతుబ్‌షాహీలు ఈ ప్రాంతాన్ని కామారెడ్డికి అప్పగించారు. అందువల్లే దీనికి కామారెడ్డి అని పేరు వచ్చింది. దీన్నే బిక్కనవోలు సంస్థానం అని కూడా పిలుస్తారు. రాజా రాజేశ్వర్‌ రావు ఈ సంస్థానాన్ని పాలించిన ప్రముఖుల్లో ఒకరు. 1948 వరకు ఇందులో 40 గ్రామాలు భాగంగా ఉండేవి. కామినేని వంశస్థులు దీన్ని పాలించేవారు. భిన్న సంస్థానాధీశులు దీన్ని పాలించిప్పుడు రాజధానిని పలు ప్రాంతాలకు తరలించారు. మొదట్లో బిక్కనవోలు, తరువాత కామారెడ్డి, తరువాత దొమకొండకు రాజధాని మారింది.

5. అమరచింత (ఆత్మకూరు) సంస్థానం (వనపర్తి జిల్లా): 

Advertisement


13వ శతాబ్దంలో వర్ధమానపురం పాలకుడు గోన బుద్ధారెడ్డి తిరుపతిని సందర్శించినప్పుడు చంద్రగిరికి చెందిన ముక్కెర గోపాల్‌ రెడ్డిని ఆహ్వానించారు. దీంతో గోపాల్‌ రెడ్డి ఈ సంస్థానాన్ని స్థాపించారు. ఇందులో 69 గ్రామాలు భాగంగా ఉండేవి. సవాయి రాజా రామభూపాల రావు బహదూర్‌ తరువాత రాణీ భాగ్య లక్ష్మమ్మ దీన్ని పాలించారు. తరువాత ఈ సంస్థానం భారత ప్రభుత్వంలో విలీనమైంది.

6. పాపన్నపేట సంస్థానం (మెదక్‌ జిల్లా)


14వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో సైన్యాధిపతిగా ఉన్న అనంత రెడ్డి ఈ సంస్థానాన్ని స్థాపించారు. రాజా సదాశివ రెడ్డి, రాయ్‌ బగన్‌ మహారాణి శంకరమ్మలు ప్రముఖ పాలకులు. మహారాణి శంకరమ్మను అప్పట్లో ఆమె చూపే ధైర్య సాహసాలకు ఆమెను రాణీ రుద్రమదేవితో పోల్చేవారు. సంగారెడ్డి జిల్లాకు ఆమె తండ్రి పేరిట నామకరణం చేశారు. మెదక్‌ జిల్లా పటాన్‌చెరు, కొండాపూర్‌ తదితర ప్రాంతాలు ఇందులో ఉండేవి. ఆందోల్‌ – జోగిపేట రాజధానిగా ఉండేది. రాజా రామచంద్రారెడ్డి బహదూర్‌ హయాంలో ఈ సంస్థానం భారత ప్రభుత్వంలో విలీనం అయింది.

7. రాజాపేట (నారాయణపురం) సంస్థానం (యాదాద్రి భువనగిరి జిల్లా): 


నిజాం పాలనలో ఈ సంస్థానాధీశులకు పెద్దగా హక్కులు ఉండేవి కావు. వీరు ఎప్పుడూ అధికారం కోసమే ఎదురు చూశారు. కోర్టు గొడవల్లో మునిగి తేలారు. అప్పట్లో ఈ సంస్థానాన్ని మంచల్‌ రెడ్డి స్థాపించారు. తరువాత దీన్ని 18వ శతాబ్దంలో రాజా వదిరె వెంకట నారాయణ రావు విస్తృతం చేశారు. 1914లో రాజా రామేశ్వర్‌ రావు హయాంలో అధికారం కోసం పలువురు గొడవలు పడి కోర్టుల చుట్టూ తిరిగారు. ఈ సంస్థానాన్ని చివరిగా పాలించింది జహీరున్నీసా బేగం.. కాగా ఆమె తండ్రి ఇస్లాంను తీసుకున్నాడు. అందుకనే ఆమె ముస్లిం సంస్థానాధీశురాలిగా నిలిచిపోయింది.

 

8. సిర్నపల్లి సంస్థానం (నిజామాబాద్‌ జిల్లా)


ఈ సంస్థానం కాకతీయుల కాలం నాటికి చెందినది. దీన్ని చెన్నమ్మ రెడ్డి స్థాపించారు. ఇందులో 149 గ్రామాలు భాగంగా ఉండేవి. 1859 నుంచి 1920 వరకు దీన్ని రాజా ప్రతాప్‌ రెడ్డి భార్య రాణీ శీలం జానకీ బాయి పాలించారు. ఆమె తన హయాంలో ఈ సంస్థానాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. అప్పట్లో హైదరాబాద్‌ – మన్మాడ్‌కు రైలు మార్గాన్ని తెప్పించారు. అందుకనే జానకంపేట జంక్షన్‌కు ఆమె పేరు పెట్టారు.

9. పాల్వంచ సంస్థానం (భద్రాద్రి కొత్తగూడం జిల్లా)
ఈ సంస్థానం చాలా పెద్దది. పాతది. దీన్నే శంకరగిరి అని పిలుస్తారు. 14వ శతాబ్దంలో దీన్ని ప్రతాప రుద్రుడి అశ్వదళాధిపతి అప్పన్నకు ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన వంశస్థులు దీన్ని పాలించారు. దీనికి పాల్వంచ, భద్రాచలం, అశ్వారావుపేటలు భిన్న కాలాల్లో రాజధానులుగా ఉండేవి. ఈ సంస్థానం మొత్తం విస్తీర్ణం 800 చదరపు మైళ్లు. 1932 వరకు దీన్ని రాజా పార్థసారధి అప్పారావు సవాయి అశ్వారావు బహదూర్‌ పాలించారు. ఆయన శ్రీకృష్ణదేవారాయాంధ్ర భాషా నిలయంను స్థాపించారు. రాజా విజయ అప్పారావు హయాంలో ఈ సంస్థానం భారత ప్రభుత్వంలో విలీనం అయింది.

10. దుబ్బాక (జిల్లెల) సంస్థానం (సిద్దిపేట జిల్లా)

మెదక్‌ జిల్లాలోనే ఇది అత్యంత పెద్దదైన సంస్థానం. ఇందులో 40 గ్రామాలు భాగంగా ఉండేవి. 20వ శతాబ్దంలో దీన్ని రాజా ఉమ్మా రెడ్డి పాలించారు.

11. గోపాల్‌పేట సంస్థానం (వనపర్తి జిల్లా)


వనపర్తి పాలకులకు ఈ సంస్థానంతో సంబంధాలు ఉండేవి. రాజా వెంకట రెడ్డి ఈ సంస్థాన్ని తన తండ్రి రాజా గోపాల్‌ రావు పేరిట స్థాపించారు. నుగురు సిక్కా పేరిట అప్పట్లో నాణేలను కూడా ముద్రించారు.

12. నారాయణపేట/నారాయణపురం సంస్థానం (నారాయణపేట జిల్లా)


దీన్ని లోకాయపల్లి సంస్థానం అని కూడా పిలుస్తారు. ఈ సంస్థానం గురించిన వివరాలు పెద్దగా అందుబాటులో లేవు కానీ.. దీన్ని మరాఠీలు పాలించినట్లు చెబుతారు. మహారాణీ లక్ష్మీదేవి దీన్ని చివరిగా పాలించారు. నారాయణపేట చీరలకు ఈ సంస్థానం ప్రసిద్ధి చెందింది.

ఆనంగుడి, గురుగుంట అని పిలవబడే మరో రెండు సంస్థానాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపి మొత్తం 14 సంస్థానాలు అప్పట్లో హైదరాబాద్‌ రాష్ట్రంలో భాగంగా ఉండేవి. ఇవే కాకుండా మునగాల, దొంతి, బండ లింగాపూర్‌, ఆలంపూర్‌, వేల్పూర్‌, నస్‌పూర్‌, నర్సాపూర్‌ తదితర చిన్న చిన్న సంస్థానాలు కూడా అప్పట్లో ఉండేవి.

Advertisements