Advertisement
భారతదేశం భిన్నజాతుల సమ్మేళనం. భిన్న వర్గాలకు చెందిన ప్రజలు దేశంలో జీవిస్తున్నారు. ఒక్కొక్కరూ తమ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలకు అనుగుణంగా పండుగలను, ఉత్సవాలను జరుపుకుంటుంటారు. అయితే దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు మాత్రం కింద తెలిపిన 15 ముఖ్యమైన పండుగలను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
1. దీపావళి
దీన్నే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని పిలుస్తారు. ఆ రోజు ప్రజలు తమ ఇళ్ల ముందు దీపాలను వెలిగించి దివ్య జ్యోతులను తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు. చెడును తమ జీవితాల్లోంచి పారద్రోలాలని భగవంతున్ని కోరుకుంటారు. చిన్నా పెద్ద అందరూ ఉత్సాహంగా పూజల్లో పాల్గొంటారు. స్వీట్లను పంచుకుంటారు. సాయంత్రం పూట పెద్ద ఎత్తున ఆనందోత్సాహాల నడుమ బాణసంచా కాలుస్తారు. ఇక మన దేశంలో వారణాసి, జైపూర్, ఢిల్లీలలో దీపావళి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి.
2. హోలీ
Advertisements
వసంత రుతువు ఆరంభంలో ఈ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఉత్సాహంగా గడుపుతారు. తమ జీవితాల్లోనూ రంగులు వెదజల్లేలా చూడాలని కోరుకుంటారు. మన దేశలో గోవా, ఢిల్లీ, మధుర, రాజస్థాన్‌లలో హోలీ వేడుకలు వైభవంగా కొనసాగుతాయి.
3. క్రిస్మస్
ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను మన దేశంలోనూ ఘనంగా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని చర్చిల్లోనూ వేడుకలు జరుగుతాయి. క్రైస్తవులు తమ ఇండ్లలో క్రిస్మస్ ట్రీలను అలంకరిస్తారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. షిల్లాంగ్, ముంబై, పాండిచ్చేరి, గోవా, కేరళలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతాయి.
4. దసరా
దసరా పండుగ ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా కొనసాగుతాయి. దీన్నే విజయదశమి అని కూడా అంటారు. 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. దేవీ నవరాత్రుల పేరిట 9 రోజుల పాటు అమ్మవారిని ప్రత్యేక అవతారాల్లో అలంకరించి పూజలు చేస్తారు. విజయదశమి రోజున రావణ సంహారం చేస్తారు. కుల్లు, మైసూర్, కోల్‌కతా, వారణాసిలలో దసరా ఉత్సవాలు ఘనంగా కొనసాగుతాయి.
5. దుర్గ పూజ
బెంగాళీలు దేశంలో దుర్గ పూజ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా కోల్‌కతాలో ఈ వేడుకలు కన్నుల పండుగగా జరుగుతాయి. సర్వాంగ సుందరంగా మండపాలను ముస్తాబు చేసి అమ్మవారికి పూజలు చేస్తారు. కోల్‌కతాతోపాటు అస్సాం, బీహార్ వాసులు కూడా ఈ పూజలను నిర్వహిస్తారు.
6. శ్రీకృష్ణ జన్మాష్టమి
శ్రీకృష్ణుడి జన్మదినమైన కృష్ణాష్టమిని కూడా దేశవ్యాప్తంగా హిందువులు జరుపుకుంటారు. మధుర, బృందావనం, ద్వారకలలో ఈ వేడుకలు అద్భుతంగా జరుగుతాయి. కృష్ణుడు, గోపికల వేషధారణల్లో చిన్నారులు అలరిస్తారు. ఉట్టి కొట్టే సంబరాలు జరుగుతాయి. కృష్ణుడి పాదముద్రలను ఇండ్లలోకి వచ్చినట్లు మహిళలు వేస్తారు.
7. వినాయక చవితి
దేశవ్యాప్తంగా హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగల్లో వినాయకచవితి కూడా ఒకటి. వినాయక చవితి రోజు ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసి 9 రోజుల పాటు పూజలు చేస్తారు. నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తారు. అనంతరం గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. వినాయకుడికి 21 రకాల పత్రితో పూజలు చేస్తారు. ముంబై, పూణె, హైదరాబాద్‌లలో గణేష్ చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.
8. ఈద్-ఉల్-ఫితర్
Advertisement
దేశంలో ఢిల్లీ, హైదరాబాద్, లక్నో, ముంబైలలో రంజాన్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకుంటారు. మతసామరస్యానికి ఈ పండుగ నిదర్శనంగా నిలుస్తుంది. ముస్లింలు తమ హిందూ స్నేహితులకు ఆ రోజు విందు భోజనం పెడతారు. అలాగే వారు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. నెల రోజుల పాటు ఉపవాసాలు ఉండే ముస్లింలు ఆ రోజు ఉపవాసం విడిచి పండుగ జరుపుకుంటారు.
9. ఓనమ్
కేరళ ప్రజలు ఓనమ్ పండుగను జరుపుకుంటారు. కేరళలో ఈ పండుగ వేడుకలు ఏటా ఘనంగా కొనసాగుతాయి. ప్రజలు తమ ఇళ్లను రంగు రంగుల పువ్వులతో అలంకరిస్తారు. రంగవల్లికలు వేస్తారు. సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. కథకళి నృత్యాలు చేస్తారు. తమదైన శైలిలో వంటకాలను చేసుకుని ఆరగిస్తారు.
10. రక్షా బంధన్
కులమతాలకు అతీతంగా.. మత సామరస్యంతో జరిగే పండుల్లో ఇది కూడా ఒకటి. సోదర, సోదరిలు అందరూ కలిసి జరుపుకునే పండుగ ఇది. తనకు రక్షణగా నిలవాలంటూ సోదరి తన సోదరుడికి ఆ రోజు రాఖీ కడుతుంది. ఉత్తరాఖండ్, ఒడిశా, మహారాష్ట్రలలో రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతాయి.
11. సంక్రాంతి
దక్షిణ భారతీయులు ఈ పండుగను ఎక్కువగా జరుపుకుంటారు. తమిళనాడులో దీన్ని పొంగల్ అని పిలుస్తారు. ఏపీలోని అనేక ప్రాంతాలతోపాటు తమిళనాడులోని మధురై, తంజావూర్‌లలో ఈ పండుగ వేడుకలు ఘనంగా కొనసాగుతాయి. రకరకాల పిండి వంటలు చేసుకుని తింటారు. భోగి మంటలు వేస్తారు. పండుగ రోజు ఇళ్ల ఎదుట రంగ రంగుల రంగవల్లికలను తీర్చిదిద్దుతారు. రైతులకు పంట చేతికందే సమయం కనుక పండుగ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.
12. గురు పురబ్
సిఖ్ గురువు గురుపురబ్ జయంతిని ఈ పండుగలా జరుపుకుంటారు. గురుద్వారాలను అందంగా ముస్తాబు చేస్తారు. స్వీట్లను, సంప్రదాయ వంటకాలను చేసుకుని తింటారు. గురుద్వారాల్లో పేదలకు భారీ ఎత్తున అన్నదానం చేస్తారు. అమృతసర్‌లో ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి.
13. మహాశివరాత్రి
దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి కూడా ఒకటి. శివుడు లింగం రూపంలో ఆవిర్భవించిన రోజు కావడంతో భక్తులు ఆలయాల్లో శివలింగాలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. శివున్ని దర్శించుకుంటారు. రోజంతా ఉపవాసం ఉంటారు. రాత్రి జాగారం చేస్తారు. మరుసటి శివున్ని దర్శించుకుని ఉపవాసం విడుస్తారు. వారణాసి, గౌహతి, హరిద్వార్, రిషికేష్, శ్రీశైలంలలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతాయి.
14. హెమిస్
లడఖ్‌లో ఈ పండుగను 2 రోజుల పాటు జరుపుకుంటారు. పద్మసంభవ జయంతి సందర్భంగా ఈ వేడుకలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా సాంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది పర్యాటకులు ఈ ఉత్సవాలను చూసేందుకు వస్తుంటారు.
15. లోధి
రైతులకు పంట చేతికందే చలికాలంలో (జనవరిలో) ఈ పండుగను పంజాబ్ వాసులు జరుపుకుంటారు. రాత్రి పూట మంటలు వేసుకుని అందరూ ఒక్కచోట చేరి ఉత్సవాలు జరుపుకుంటారు. చిరుతిండ్లను తింటూ ఉత్సవాల్లో పాల్గొంటారు. పంజాబ్‌లోని అమృతసర్, జలంధర్, లూధియానాతోపాటు చండీగఢ్, ఢిల్లీలోనూ ఈ వేడుకలను జరుపుకుంటారు.
Advertisements