Advertisement
పుట్టగొడుగుల్లో అనేక రకాల విటమిన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి పోషణను, బలాన్ని ఇస్తాయి. అందుకనే ప్రస్తుత తరుణంలో చాలా మంది పుట్టగొడుగులను తింటున్నారు. ఇక వీటిని పెంచుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. కేవలం చిన్న రూం ఉంటే చాలు.. అందులో పుట్టగొడుగులను పెంచుతూ నెలకు రూ.వేలకు వేలు సంపాదిస్తున్నారు.
మైసూరుకు చెందిన క్లింట్ డేవిస్ అనే 24 ఏళ్ల యువకుడు అక్కడి జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో బీఎస్సీ చదివాడు. అనంతరం ఎమ్మెస్సీ పూర్తి చేశాడు. అతను 2015లో తన బంధువు ఒకరు పెట్టిన అగ్రికల్చరల్ స్టార్టప్‌ను చూశాడు. అక్కడ అధునాతన సాంకేతిక పద్ధతుల్లో వ్యవసాయం చేసే మెళకువలను అతను తెలుసుకున్నాడు. దీంతో అతను 2017లో బీఎస్సీ 3వ సంవత్సరం చదువుతుండగా.. తాను కూడా సొంతంగా ఓ స్టార్టప్‌ను ఏర్పాటు చేసి అలా వ్యవసాయం చేయాలనుకున్నాడు. అయితే అప్పట్లో మైసూర్‌లో అన్నీ కృత్రిమ ఎరువులు వేసి పండించే పుట్టగొడుగులే లభించేవి. దీంతో తాను సేంద్రీయ పద్ధతిలో భిన్న జాతులకు చెందిన పుట్టగొడుగులను పండించి అమ్మాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఫుంగో మష్‌రూమ్స్ అనే స్టార్టప్‌ను ఏర్పాటు చేశాడు. దానికి అతని ఇద్దరు స్నేహితులు అజయ్ జోసె, రాజ్ కిరణ్‌లు సహాయం అందించారు.
Advertisement
Advertisements
అలా క్లింట్ డేవిస్‌తోపాటు అజయ్, రాజ్ కిరణ్‌లు ముగ్గురూ తమ స్టార్టప్‌కు రూ.5 లక్షల వరకు నిధులను సమకూర్చి ఎట్టకేలకు మైసూర్‌లో మొదటి సారిగా 250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఓ రూంను అద్దెకు తీసుకుని అందులో 300 బ్యాగుల్లో పుట్టగొడుగుల విత్తనాలను నాటి పంట వేశారు. 25 రోజుల్లోనే అవి చేతికొచ్చాయి. మొదటిసారే అలా వారు 10కేజీల పుట్టగొడుగులను పండించారు. దీంతో వారు వెనుదిరిగి చూడలేదు. ఆ తరువాత పుట్ట గొడుగుల పెంపకంలో మరిన్ని అధునాతన విధానాలు, మెళకువలను వారు నేర్చుకుని భిన్న రకాల పుట్టగొడుగులను పండించడం మొదలు పెట్టారు.
Advertisements
ప్రస్తుతం వారు ప్రతి 3 నెలలకు సుమారుగా 1000 కిలోల వరకు పుట్టగొడుగులను పండిస్తున్నారు. కిలో పుట్టగొడుగులను వారు రూ.350కి విక్రయిస్తున్నారు. అందులో రూ.230 వరకు లాభం ఉంటోంది. ఈ క్రమంలో వారు నెలకు రూ.76వేల వరకు పుట్టగొడుగుల పెంపకం ద్వారా ఆర్జిస్తున్నారు. త్వరలో మరింత విస్తీర్ణంలో వారు పుట్టగొడుగులను పెంచనున్నారు. అయితే ఈ వ్యాపారం చేయాలనుకునే వారికి వారిస్తున్న సలహా ఏమిటంటే.. పుట్టగొడుగుల పెంపకం చాలా సులభమే కానీ.. దాని గురించి అన్నీ తెలుసుకుని చేయాలి. అలాగే బాగా ఓపిక ఉండాలి. జాగ్రత్తగా వాటిని పండించాలని.. అంటున్నారు. అవును.. అలా చేస్తేనే అద్భుతమైన లాభాలు వస్తాయి.