Advertisement
ఎంతో డబ్బు పెట్టి కొన్న వాహనాలే కాదు.. సాధారణ ఖరీదు ఉండే వాహనాలకు కూడా న్యూమరాలజీ ప్రకారం.. తమకు నచ్చే, లక్కీ నంబర్లను రిజిస్ట్రేషన్ నంబర్లుగా పెట్టుకోవాలని చాలా మంది కలలు కంటుంటారు. ఇక స్థోమత ఉన్నవారు ఎంత డబ్బు అయినా సరే చెల్లించి తమకు నచ్చిన రిజిస్ట్రేషన్ నంబర్‌ను సొంతం చేసుకుంటారు. అయితే ఆ వ్యాపారవేత్త మాత్రం తనకు కావల్సిన కార్ రిజిస్ట్రేషన్ నంబర్ కోసం ఏకంగా రూ.67.95 కోట్లు చెల్లించాడు. అవును.. ఇది నిజమే.. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
దుబాయ్‌లోని ఆర్‌ఎస్‌జీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపక చైర్మన్ బల్వీందర్ సింగ్ సాన్హి (అబు సబా) భారతీయుడే. కానీ వ్యాపారం పేరిట అక్కడే స్థిరపడిపోయారు. ఆయనకు రోల్స్ రాయ్స్ కంపెనీకి చెందిన అనేక కార్లు ఉన్నాయి. ఇక ఇటీవలే మరో కొత్త రోల్స్ రాయ్స్ కారు కొన్నారు. దానికి నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్‌కు గాను ఆయన భారీ మొత్తంలో చెల్లించారు. D 5 అనే నంబర్ ప్లేట్ కోసం ఆయన ఏకంగా 33 మిలియన్ల దిర్హామ్‌లను వేలంలో చెల్లించారు. ఆ విలువ మన భారత కరెన్సీలో అక్షరాలా రూ.67.95 కోట్లు. అవును.. ఏంటీ షాక్ తిన్నారా.. అయితే ఇదే కాదు.. ఆయన గతంలో మరో రోల్స్ రాయ్స్ కారు కోసం O 9 నంబర్‌కు 25 మిలియన్ల దిర్హామ్‌లు (రూ.51.49 కోట్లు) చెల్లించారు. ఆయన ఇలా ఏ కారు కొన్నా సరే ఫ్యాన్సీ నంబర్ ఉండేలా చూసుకుంటారు. అందుకు గాను ఆ నంబర్లకు ఆయన ఎంతైనా వెచ్చిస్తారు.
Advertisement
Advertisements
దుబాయ్‌లో కొన్ని నెలలకు ఒకసారి వాహనాలకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్లకు గాను అక్కడి దుబాయ్ రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ వారు వేలం పాటలు నిర్వహిస్తారు. ప్రతి సారీ 80 స్పెషల్ రిజిస్ట్రేషన్ నంబర్లకు వేలం ఉంటుంది. ఆ వేలం పాటల్లో 300 మంది వరకు పాల్గొంటారు. 80 నంబర్లలో కనీసం ఏదైనా ఒక దాన్ని సొంతం చేసుకోవాలని చూస్తారు. కానీ కేవలం కొందరు మాత్రమే ఆ ప్రత్యేక నంబర్లను పొందగలుగుతారు. ఇక ఇటీవల నిర్వహించిన వేలంలో అబు సబా సదరు డి5 నంబర్ కోసం ఏకంగా రూ.67.95 కోట్లను చెల్లించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అవును.. మన దేశంలోనూ కొందరు అంతే.. తాము కొన్న వాహనాల కన్నా ఎక్కువ ఖరీదు పెట్టి ఆ ఫ్యాన్సీ నంబర్లను సొంతం చేసుకుంటుంటారు. ఏది ఏమైనా.. ఈ ఫ్యాన్సీ నంబర్లపై కేవలం మన దేశ వాసులకే కాదు.. ఇతర దేశాల వారికి కూడా ఆసక్తి ఎక్కువగానే ఉంటుందన్నమాట.
Advertisements