Advertisement
సాధారణంగా విమానయాన సంస్థలు ఏదైనా ఒక విమానాన్ని ప్రయాణానికి సిద్ధం చేసే ముందు అన్ని జాగ్రత్తలను తీసుకుంటాయి. విమానంలో ఏమైనా సాంకేతిక లోపాలు ఉన్నాయా, ఏ రూట్‌లో విమానం వెళ్తుంది, వాతావరణం ఎలా ఉంది.. తదితర అన్ని వివరాలను చెక్ చేసుకున్నాకే విమానాన్ని జర్నీ కోసం రెడీ చేస్తారు. అయితే అనుకోని సంఘటనలు జరిగితే అప్పుడు విమానంలో ఉండే సిబ్బంది ప్రయాణికులు భయపడకుండా ఉండేందుకు గాను వారికి తెలియని కోడ్ లాంగ్వేజ్‌లో మాట్లాడుకుంటారు. అత్యవసర సమయాల్లో వారు ఆ పదాలను ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలోనే పైలట్లు, ఇతర సిబ్బంది.. అత్యవసర, ప్రమాద సమయాల్లో వాడే పలు కోడ్ పదాలు ఏవో.. వాటి అర్థాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం.
1. సిన్ బిన్ (Sin Bin) :
విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవడానికి సిబ్బంది రన్‌వేను సిద్ధం చేయాలి. అయితే కొన్నిసార్లు విమానాల రద్దీ ఎక్కువగా ఉంటే రన్‌వేలను సిబ్బంది సిద్ధం చేయలేకపోతారు. దీంతో రన్‌వేలపై దిగాల్సిన విమానాలు గాల్లోనే కొంత సమయం పాటు చక్కర్లు కొడతాయి. ఈ క్రమంలో పైలట్లు, సిబ్బంది ఈ సమస్యపై సిన్ బిన్ అనే కోడ్‌ను ఉపయోగిస్తూ మాట్లాడుకుంటారు. అంటే.. విమానం దిగేందుకు రన్‌వే సిద్ధంగా లేదని, కొంత సేపు గాల్లోనే వేచి ఉండాలని.. ఈ కోడ్‌కు అర్థం వస్తుంది.
2. ఏరియా ఆఫ్ వెదర్ (Area Of Weather)
విమానం ల్యాండ్ అవ్వాల్సిన లేదా ప్రయాణించాల్సిన మార్గంలో వాతావరణం సరిగ్గా లేకపోతే ఈ కోడ్‌ను వాడుతారు. దీంతో విమానం దిశను మార్చుకోవడమో లేదా లిస్ట్‌లో లేని వేరే ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యేందుకు వెళ్లడమో జరుగుతుంది. ఇలాంటి సందర్బంలో ఈ కోడ్‌ను వాడుతారు.
Advertisements
3. కోడ్ బ్రావో (Code Bravo)
విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బందిని తోటి ప్రయాణికులు లేదా ఇతర వ్యక్తులు భయభ్రాంతులకు గురి చేస్తే.. ఈ కోడ్‌ను ఉపయోగిస్తారు. దీంతో సిబ్బంది అలర్ట్ అయ్యి, సదరు వ్యక్తుల కోసం విమానంలో గాలించి, వారిని గుర్తిస్తారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విమానంలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడేలా చేస్తారు. ఇందుకు ఈ కోడ్‌ను ఉపయోగిస్తారు.
4. కోడ్ ఆడం (Code Adam)
ఎయిర్‌పోర్టులు లేదా విమానాల్లో ఎవరైనా పిల్లలు తప్పిపోయినా, కిడ్నాప్‌కు గురైనా ఈ కోడ్‌ను వాడుతారు.
5. పీటర్ పాన్-పాన్ (Peter Pan-Pan)
విమాన సిబ్బంది ఎయిర్‌పోర్టు సిబ్బందిని ఎమర్జెనీ సమయాల్లో కాంటాక్ట్ అయ్యేందుకు ఈ కోడ్‌ను ఉపయోగిస్తారు. అంటే.. విమానంలో సిబ్బందికి ఏదైనా ఒక విషయంలో తప్పనిసరిగా ఎమర్జెన్సీ ఉంటే సహాయం కోసం ఎయిర్‌పోర్ట్ సిబ్బందిని కాంటాక్ట్ అవుతారు. అత్యవసర సమయాల్లో మాత్రమే ఈ కోడ్‌ను ఉపయోగిస్తారు. అయితే విమానం క్రాష్ అయ్యే సమయంలో మాత్రం ఈ కోడ్‌ను వాడరు.
6. ఫాస్టెన్ యువర్ సీట్‌బెల్ట్స్ (Fasten Your Seatbelts)
విమానం టేకాఫ్ అయ్యే సమయంలో, ల్యాండ్ అయ్యే సమయంలోనే కాక.. ప్రయాణం మధ్యలో పలు సాంకేతిక కారణాల వల్ల విమానం ఒడిదుడుకులకు లోనవుతుంది. దీంతో అలాంటి సందర్భాల్లో సీట్లలో ఉండే ప్రయాణికులు పడిపోకుండా ఉండేందుకు గాను.. ఈ కోడ్‌ను వాడుతారు. దీంతో ప్రయాణికులు తమ సీట్ బెల్టులను పెట్టుకుంటారు. ఇలా ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.
Advertisement
7. ట్రయాంగులర్ ట్రబుల్స్ (Triangular Troubles)
ఇది కోడ్ కాదు.. కానీ విమానంలో ఉండే కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా పనిచేయకపోతే పైలట్లు విమానాన్ని 120 డిగ్రీల కోణంలో షార్ప్ టర్న్‌లతో తిప్పుతారు. దీంతో గాలిలో త్రిభుజాకారం వచ్చేలా విమానంతో సిగ్నల్ ఇస్తారు. దీనికి ఎయిర్‌పోర్టు సిబ్బంది స్పందించి సహాయం అందిస్తారు. అయితే సాధారణంగా పైలట్లు ఇలాంటి కఠినమైన కోడ్‌ను ఎంచుకోరు. విమానాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ ఫెయిలైతే వారు ట్రాన్స్‌పోడర్ ఆధారంగా కమ్యూనికేట్ అవుతారు. మోర్స్ కోడ్ ద్వారా వారు ఎయిర్‌పోర్టు సిబ్బందిని కాంటాక్ట్ అవుతారు.
8. లాస్ట్ మినట్ పేపర్‌వర్క్ (Last Minute Paperwork)
విమానంలో పైలట్లు సిబ్బందికి వాకీ టాకీల ద్వారా ఈ కోడ్‌ను చెబితే.. విమానం బయల్దేరడానికి చాలా సమయం పడుతుందని, అది ఎంత సమయమో తెలియదని.. అర్థం చేసుకోవాలి. సాధారణంగా విమానంలో సాంకేతిక సమస్యలు ఏర్పడినా, పలు ఇతర కారణాల వల్ల అయినా.. అప్పుడప్పుడు విమానాలు బయల్దేరడం ఆలస్యమవుతుంది. అలాంటి సందర్భాల్లో పైలట్లు విమానం సిబ్బందికి ఈ విషయాన్ని తెలియజేసేందుకు ఈ కోడ్‌ను వాడుతారు. అంతేకానీ.. విమానంలో వారు చేసే పేపర్‌వర్క్ ఏమీ ఉండదు.
9. మేడే (Mayday)
విమానం 100 శాతం కూలిపోతుంది, ఇక గత్యంతరం లేదు, చేసేదేమీ లేదు.. అని అనుకున్నప్పుడు.. తప్పనిసరి పరిస్థితిలో.. చాలా అరుదైన ఎమర్జెన్సీ సమయాల్లో మాత్రమే పైలట్లు ఈ కోడ్‌ను వాడుతారు. మేడే.. మేడే.. మేడే అని మూడు సార్లు చదువుతారు. విమానం క్రాష్ అయ్యే సమయంలోనే పైలట్లు ఈ కోడ్‌ను ఉపయోగిస్తారు.
10. స్క్వాక్ 7500 (Squawk 7500)
విమానాలు హైజాక్ అయినప్పుడు పైలట్లు ఆ విషయాన్ని ఎయిర్‌పోర్టు సిబ్బందికి తెలియజేసేందుకు ఈ కోడ్‌ను ఉపయోగిస్తారు.
11. స్క్వాక్ 7600 (Squawk 7600)
విమానాల్లో ఉండే రేడియో వ్యవస్థ సిగ్నల్స్‌ను సరిగ్గా స్వీకరించలేకపోయినా, బ్యాటరీ డౌన్ అయినా, రేడియో ఫెయిల్ అయినా.. పైలట్లు ఈ కోడ్‌ను వాడుతారు.
12. స్క్వాక్ 7700 (Squawk 7700)
విమానంలో ఇంజిన్ ఫెయిల్ అయినా, పొగ వచ్చినా, ఇంధనం తక్కువగా ఉన్నా.. దగ్గర్లో ఉన్న ఎయిర్‌పోర్టుకు వెళ్తున్నామని చెబుతూ పైలట్లు ఈ కోడ్‌ను వాడుతారు. దీని సహాయంతో ఎయిర్‌పోర్టు సిబ్బందికి సమాచారం ఇస్తారు.
13. అలర్ట్ 4
ఎయిర్‌పోర్టులో ఆగి ఉన్న విమానంలో ఎమర్జెన్సీ ఉంటే ఈ కోడ్‌ను వాడుతారు. దీంతో విమానంలో ఉన్నవారందరూ బయటకు వెళ్లిపోవాలి.
14. అలర్ట్ 3
సమీపంలో ఉన్న ఏదైనా ఎయిర్‌పోర్టులో లేదా దగ్గరలో ఏదైనా విమానం క్రాష్ అయితే ఈ కోడ్ ఉపయోగిస్తారు. దీని వల్ల మిగిలిన విమానాలు వేరే గమ్యస్థానాలకు వెళ్లడమో, లేదా ప్రయాణానికి ఆలస్యం అవుతుందనో.. అర్థం చేసుకోవాలి.
Advertisements
15. అలర్ట్ 2
విమానంలో ఏదైనా సాంకేతిక లోపం ఏర్పడినప్పుడు ఈ కోడ్‌ను ఉపయోగిస్తారు.
16. అలర్ట్ 1
విమానంలో విద్యుత్ లేదా మెకానికల్ పరంగా ఏదైనా చిన్నపాటి సమస్య వస్తే ఈ కోడ్ ఉపయోగిస్తారు. దీంతో విమానంలో, ఎయిర్‌పోర్టులో సిబ్బంది అలర్ట్ అవుతారు.
17. సోల్స్ అబోర్డ్ (Souls Aboard)
విమానాల్లో ప్రయాణించేందుకు విమానాశ్రయాలకు ప్రయాణికులు పెద్ద ఎత్తున చేరుకుంటే అందుకు ఈ కోడ్‌ను ఉపయోగిస్తారు.