Advertisement
గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్, యాపిల్.. ప్రపంచంలో అత్యంత పేరుగాంచిన టెక్ దిగ్గజ సంస్థలు. ఒకటి సెర్చ్ ఇంజిన్‌లో ఫేమస్ అయితే.. మరొకటి ఈ-కామర్స్ రంగంలో గుర్తింపు పొందింది. ఇంకొకటి సోషల్ మీడియా సంస్థ. మరొకటి అధునాతన టెక్నాలజీ, డివైస్‌లను డెవలప్ చేస్తుంది. అయితే ఈ కంపెనీలన్నీ వినియోగదారులకు అద్భుతమైన సేవలను అందిస్తున్న విషయం నిజమే అయినా.. టెక్నాలజీ రంగంలో కొత్తగా వస్తున్న అనేక కంపెనీలను తొక్కేస్తున్నాయని, వారిని భయపెట్టి ఆ కంపెనీలను కొనుగోలు చేస్తున్నాయని.. వినియోగదారుల డేటాను తమ సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నాయని.. ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇవే విషయాలపై సదరు కంపెనీలకు చెందిన సీఈవోలు తాజాగా అమెరికా కాంగ్రెస్ జ్యుడీషియరీ కమిటీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో వారికి సెనేటర్లు పలు ప్రశ్నలు వేసి వారిని ఉక్కిరిబిక్కిరి చేశారు. సదరు కంపెనీల సీఈవోలు ఆ ప్రశ్నలకు కొన్ని సార్లు సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలారు.
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ను సెనేటర్లు డేటా యూసేజ్‌పై పలు ప్రశ్నలు అడిగారు. ఇంటర్నెట్ ప్రపంచంలో గూగుల్ ఒక్కటే కంపెనీ డామినేట్ చేయడాన్ని వారు ఆక్షేపించారు. ఇదే విషయమై అడిగిన ప్రశ్నలకు పిచాయ్ సమాధానం చెప్పలేక తడబడ్డారు. గూగుల్ కేవలం కొన్ని వెబ్‌సైట్లు, పబ్లిషర్లకు మాత్రమే మేలు చేసేలా వార్తలను, ఇతర కంటెంట్‌ను అందించడాన్ని సెనేటర్లు తప్పుబట్టారు. యూజర్ల డేటాను గూగుల్ తన ఇష్టానికి వినియోగించుకుంటుందా..? అని అడిగారు. అయితే జీమెయిల్‌లో యాడ్స్ కనిపించేందుకు గాను అందులో ఉండే యూజర్ల డేటాను స్వీకరించకుండా మార్పులు, చేర్పులు చేశామని పిచాయ్ తెలిపారు.
Advertisement
ఇక ఇతర చిన్న చిన్న సంస్థలు డెవలప్ చేసే సాఫ్ట్‌వేర్ టూల్స్‌ను ఫేస్‌బుక్ కాపీ కొడుతుందా..? అని సెనేటర్లు ఆ సంస్థ సీఈవో జుకర్‌బర్గ్‌ను ప్రశ్నించారు. ఇందుకు జుకర్‌బర్గ్ తడబడుతూ సమాధానం చెప్పారు. తాము తమ యూజర్లకు అవసరమైన ఫీచర్లను అందిస్తామని, ఇతరుల ఐడియాలను కాపీ కొట్టబోమని అన్నారు. అలాగే అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్‌ను కూడా సెనేటర్లు ప్రశ్నలతో ఇబ్బందులు పెట్టారు. అమెజాన్‌లో ఇతర సంస్థలకు చెందిన వస్తువులు కాకుండా అమెజాన్‌కు చెందిన వస్తువులను ఎక్కువగా ప్రమోట్ చేయడంపై బెజోస్‌కు ప్రశ్నలు సంధించారు. ఇందుకు బెజోస్ మొదట తటపటాయించినా తరువాత ఆ విషయాన్ని ఖండించారు. తాము ఎలా చేయబోమని, వినియోగదారులు తమకు ఇష్టం ఉన్న వస్తువులను అమెజాన్‌లో కొనుగోలు చేస్తారన్నారు. ఇక నకిలీ వస్తువులు ఎక్కువగా అమెజాన్‌లో చెలామణీలో ఉండడంపై ప్రశ్నలు అడగ్గా.. అందుకు బెజోస్ స్పందిస్తూ.. అలాంటి వస్తువులు అమ్మే వారిపై ఆయా దేశాల్లో ఉన్న చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
చివరిగా యాపిల్ సీఈవో టిమ్ కుక్‌ను యాపిల్ యాప్ స్టోర్‌లో ఉన్న కమిషన్ విధానంపై ప్రశ్నలు అడిగారు. యాపిల్ సంస్థ ఐఓఎస్ యాప్స్ డెవలపర్ల నుంచి భారీ మొత్తంలో కమిషన్ వసూలు చేస్తుందా ? అని ప్రశ్నించగా.. అందుకు టిమ్ కుక్ స్పందిస్తూ.. తమ యాప్ స్టోర్‌లో ఆరంభం నుంచి ఉన్న మాదిరిగానే డెవలపర్ల నుంచి 30 శాతం కమిషన్ తీసుకుంటున్నామని, దాన్ని ఎప్పుడూ పెంచలేదని తెలిపారు. భారీ మొత్తంలో కమిషన్‌ను తీసుకుంటే యాప్ స్టోర్‌కే దెబ్బ పడుతుందని, డెవలపర్లు యాప్‌లను డెవలప్ చేసేందుకు ముందుకు రారని కుక్ అన్నారు.
Advertisements
అయితే చైనా టెక్ కంపెనీలు, యాప్ డెవలపర్లు అమెరికా వాసుల డేటాను చోరీ చేస్తున్నాయా..? అనే ప్రశ్నను అందరు సీఈవోలను కామన్‌గా అడిగారు. అందుకు పిచాయ్ స్పందిస్తూ.. తమ యూజర్ల డేటాను చైనా ఎప్పుడూ చోరీ చేయలేదని స్పష్టంగా చెప్పారు. ఇక జుకర్‌బర్గ్ స్పందిస్తూ.. చైనా కచ్చితంగా యూజర్ల డేటాను చోరీ చేస్తుందని, ఈ విషయమై తమకు నివేదికలు కూడా అందాయన్నారు. అలాగే బెజోస్ మాట్లాడుతూ.. అమెరికా వాసుల డేటాను చైనా చోరీ చేస్తుందని వార్తలు వచ్చాయని, కానీ అవి నిజమో, కాదో తనకు తెలియదన్నారు. టిమ్ కుక్ ఈ విషయంపై మాట్లాడుతూ యాపిల్ యూజర్ల డేటాను ఇప్పటి వరకు చైనా కాదు కదా, ఎవరూ చోరీ చేయలేదని తెలిపారు. కాగా ఆ నలుగురు సీఈవోలు సదరు కమిటీ ఎదుట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరై ఆయా ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇక ఈ విషయం ప్రస్తుతం అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది.
Advertisements