Advertisement
రెండేళ్ల క్రితం మాకు పెళ్లైంది. ప్రేమ వివాహం.! అందుకే రెండు ఫ్యామిలీస్ మమ్మల్ని కాదనుకున్నాయి. కానీ మేము మాత్రం ఒకరికి ఒకరు అనుకొనే మా జీవితాన్ని స్టార్ట్ చేశాము.! ఏడాది హ్యాపీగా గడిచిన మా జీవితంలో అనుకోని మలుపు…. నా భార్యకు జబ్బు చేయడం. ఏమీ తినలేదు, సరిగ్గా నీళ్లు కూడా తాగలేదు.. అప్పడప్పుడు శ్వాసకూడా చాలా కష్టంగా తీసుకునేది…..హాస్పిటల్ కు తీసుకెళ్తే బతకడం కష్టమన్నారు. రాత్రంతా ఆమెతో హాస్పిటల్ లోనే ఉండేవాడిని , పగలు ఫ్యాక్టరీలో పనిచేసేవాడిని.!
ఓ రోజు తను హాస్పటల్ లో ఉండలేను అంటూ తనంతట తానే నడుచుకుంటూ ఇంటికొచ్చేసింది. డాక్టర్స్ కు చెబితే అప్పుడప్పుడు ఇలాంటి మిరాకిల్స్ జరుగుతుంటాయి. నీ అదృష్టమని చెప్పారు.
Advertisement
ఇక ఆ రోజు నుండి నా దినచర్య మారింది. రోజూ ఉదయాన్నే లేవడం ఆమెతో కలిసి సరదాగా వాకింగ్ చేయడం… నా వంట మీద, నేను వంట చేసే స్టైల్ మీద ఆమె తెగ సెటైర్లు వేసేది ఇద్దరం నవ్వుకునే వాళ్లం.! ఆమెకు పీచు మిఠాయి అంటే ఇష్టం ప్రతి రోజూ తెచ్చేవాడిని తను తింటూ నాకు ప్రేమగా తినిపించేది.
ప్రతిరోజూ మాకు దగ్గర్లోని నదికి వెళ్లేవాళ్లం….పార్క్ లో గడిపేవాళ్లం. పడుకునే ముందు ఆమె చేతిని నా చేతిలో పట్టుకొనే పడుకొనేవాడిని…ఇలా రోజులు ఆనందంగా గడుస్తున్నాయి. ఎప్పటిలాగే ఆమె చేతిని పట్టుకొనే పడుకున్నాను …తెల్లారిలేచి చూసే సరికి ఆ చేతిలో చలనం లేదు…గట్టిగా లేపే ప్రయత్నం చేశాను…అయినా లేవలేదు. పిలిచాను, అరిచాను….చనిపోయిందని తెలిసి గుండలవిసేలా ఏడ్చాను.! తను ఇప్పటికీ ఓ చిన్న పిల్లలా..నా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది.!
Advertisements