Advertisement
సాధారణంగా ఉదయం పూట త్వరగా నిద్ర లేవాలని అనుకునే వారు ప్రస్తుతం ఫోన్లలో అలారంలు పెట్టుకుని నిద్ర లేస్తున్నారు. గతంలో ప్రత్యేకంగా అలారం గడియారాలు ఉండేవి. అయితే క్రీస్తు పూర్వం కూడా ప్రజలు అలారం క్లాక్‌లను వాడేవారు. కాకపోతే అవి ఇప్పుడు మనం వాడేంత అధునాతనంగా ఉండేవి కావు. కానీ అవి అప్పట్లో జనాలకు బాగానే పనికొచ్చాయి. క్రీస్తు పూర్వం 428 నుంచి 348 మధ్య కాలంలో జీవించిన గ్రీకు తత్వవేత్త ప్లేటో.. నీటితో నడిచే ఓ వాటర్ అలారం క్లాక్‌ను అప్పట్లోనే తయారు చేశాడు.
ప్లేటో దగ్గర విద్యనభ్యసించే విద్యార్థి ఒకతను విపరీతంగా నిద్రపోయేవాడట. టైముకు నిద్ర లేచేవాడు కాదట. దీంతో ప్లేటో విసుగు చెంది అతని కోసమే ఆ వాటర్ అలారం క్లాక్‌ను తయారు చేశాడట. అందులో పలు రకాల పాత్రలు, ట్యూబులు ఉంటాయి. ట్యూబుల ద్వారా నీరు పాత్రల్లో నెమ్మదిగా పడుతుంటుంది. నిర్దిష్టమైన సమయం తరువాత పాత్ర నిండి దానికి ఉన్న రంధ్రాల ద్వారా ప్రత్యేకమైన సౌండ్ వస్తుంది. టీ కాచుకునే కెటిల్స్ విజిల్ వేస్తాయి కదా.. సరిగ్గా అలాంటి సౌండ్ వస్తుంది. దీంతో ఆ చప్పుడుకు మేల్కొనవచ్చు. ఈ క్రమంలో ప్లేటో తయారు చేసిన ఆ వాటర్ అలారం క్లాక్‌కు అప్పట్లో ప్రజాదరణ బాగానే లభించింది.
Advertisement
అయితే ప్లేటో తరువాత క్రీస్తు పూర్వం 285 నుంచి 222 సంవత్సరాల మధ్య కాలంలో జీవించిన ఈజిప్టులోని అలెగ్జాండ్రియాకు చెందిన స్టెసిబియస్ అనే గణిత శాస్త్రవేత్త కూడా ఓ అలారం క్లాక్‌ను తయారు చేశాడు. అందులోనూ అతను నీటినే ఉపయోగించాడు. కొంత నిర్దిష్టమైన సమయం తరువాత ఆ క్లాక్‌లో నీళ్లు జల్లు రూపంలో కిందకు పడతాయి. దాని వల్ల సౌండ్ వస్తుంది. అయితే మొదట్లో ఆ సౌండ్ అంత పెద్దగా వినిపించేది కాదు. దీంతో స్టెసిబియస్ దానికి మార్పులు చేసి పెద్ద సౌండ్ వచ్చే విధంగా మళ్లీ వాటర్ అలారం క్లాక్‌ను రూపొందించాడు. దీంతో ఆ క్లాక్‌ను కూడా జనాలు అప్పట్లో వాడారు.
Advertisements
Advertisements
ఇక పురాతన చైనీయులు ఒక డ్రాగన్ ఆకారంలో ఉన్న పరికరానికి దారాలను, అగర్‌బత్తీలను, గంటలను జత చేసేవారు. అగర్‌బత్తీలు నిర్దిష్టమైన సమయం పాటు మండేవి. అవి పూర్తిగా మండాక దారాలు తెగి వాటికి అమర్చబడిన గంటలు మోగేవి. దీంతో ఆ చప్పుడుకు నిద్ర లేచేవారు. ఇలా రకరకాలుగా పూర్వం అలారం క్లాక్‌లను తయారు చేసుకుని వాడేవారు. కానీ ఇప్పుడు మనకు అంత కష్ట పడాల్సిన అవసరం లేకుండానే అలారంలు పెట్టుకునే అవకాశం లభించింది. అయినా చాలా మంది ఉదయం అలారంలు పెట్టుకుని కూడా టైముకు నిద్ర లేవడం లేదు. మారుతున్న జీవనశైలి వల్లే ఇలా జరుగుతోంది. ఎంతైనా నియమాలను పాటించడంలో మన పూర్వీకులే బెటర్ కదా..!