Advertisement
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దు గుండా భారత్‌లోకి వచ్చిన పాక్‌కు చెందిన ఓ గూఢచారి పావురంపై ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. ఆ పావురం కాలికి ఓ రింగు ఉండడం, దాంట్లో ఓ కోడ్ మెసేజ్ ఉండడంతో భారత ఆర్మీ అలర్ట్ అయ్యింది. ప్రస్తుతం ఆ కోడ్‌ను డీకోడ్ చేసే పనిలో పడ్డారు. అయితే నిజానికి కేవలం పావురాల ద్వారానే కాదు, గతంలో పలు దేశాలు ఇతర జంతువులు, పక్షుల ద్వారా కూడా ఇతర దేశాలపై గూఢచర్యం చేశాయి. వాటిని వాహకాలుగా ఉపయోగించుకున్నాయి. ఆ వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే…
డాల్ఫిన్లు :
అగ్రరాజ్యం అమెరికా 1960 నుంచి సముద్ర గర్భాల్లో డాల్పిన్లను వాహకాలుగా ఉపయోగించి ఇతర దేశాలపై గూఢచర్య చేస్తోంది. అమెరికా నేవీ వారు వాటిని ఆ పనికి వాడుతున్నారు. అలాగే ఉక్రెయిన్‌పై గూఢచర్యం చేయడం కోసం రష్యా కూడా డాల్ఫిన్లను వాడుతోంది. ఇక 2015లో ఇజ్రాయెల్ కూడా డాల్ఫిన్లను గూఢచర్యం కోసం వాడుతున్నట్లు వార్తలు వచ్చాయి.
సీ లయన్స్ :
సీ లయన్స్ అని పిలవబడే సముద్ర జీవాలను అమెరికన్ నేవీ గూఢచర్యం కోసం ఉపయోగిస్తోంది. అందుకు గాను వారు వాటికి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తారు.
పావురాలు:
మొదటి ప్రపంచ యుద్ధంలో ఆయా దేశాలకు చెందిన బెటాలియన్లు సందేశాలను చేరవేసేందుకు పావురాలను వాడేవి. అలాగే 1960 నుంచి 1970 మధ్య కాలంలో అమెరికా ఆర్మీ పావురాలకు ట్రెయినింగ్ ఇచ్చి శత్రు దేశాల స్థావరాలపై గూఢచర్యం చేసింది. అయితే ప్రస్తుతం అమెరికా పావురాలతో గూఢచర్యం చేస్తున్నట్లు వార్తలు రావడం లేదు. కానీ తాజాగా పాకిస్థాన్ ఓ పావురాన్ని భారత్‌కు పంపడం కలకలం రేపుతోంది.
Advertisements
కాకులు:
అమెరికా ఆర్మీ గతంలో కాకులను కూడా గూఢచర్యం కోసం ఉపయోగించిందట. అలాగే వాటితో బరువు కలిగిన ప్యాకేజీలు, ఫైల్స్‌ను చేరవేసేవారట. ఆ విషయంలో అవి బాగా పనిచేసేవట. కానీ కాకులను ప్రస్తుతం గూఢచర్యం కోసం వినియోగిస్తున్నట్లు ఎక్కడా దాఖలాలు లేవు.
Advertisement
పిల్లులు:
అమెరికాకు చెందిన గూఢచారి సంస్థ సీఐఏ 1960లలో 10 మిలియన్ డాలర్ల వ్యయంతో పిల్లులకు ట్రెయినింగ్ ఇచ్చి వాటిని సోవియట్ యూనియన్‌పై గూఢచర్యానికి వినియోగించాలని యత్నించింది. కానీ ఆ ప్రాజెక్టు ఫెయిలైంది. ఇక దానికి సంబంధించిన రికార్డులను 1989లో ధ్వంసం చేశారు. అయితే ఈ ప్రాజెక్టులో భాగంగా పిల్లులకు సర్జరీ చేసి వాటిని మోడిఫై చేయాలనుకున్నారు. కానీ అది వర్కవుట్ కాలేదు.
షార్క్‌లు :
అమెరికాకు చెందిన రక్షణ శాఖ షార్క్‌ల మెదళ్లలో ఎలక్ట్రోడ్‌లను అమర్చి వాటిని రిమోట్‌గా కంట్రోల్ చేయాలని చూసిందని 2016లో న్యూ సైంటిస్ట్ అనే ఓ మ్యాగజైన్ కథనాన్ని ప్రచురించింది. అలా షార్క్‌లను మార్చడం ద్వారా వాటితో గూఢచర్యం చేయవచ్చనేది ఆ శాఖ ప్లాన్. కానీ ఆ తరువాత ఈ ప్రాజెక్టు గురించి వివరాలేవీ బయటకు రాలేదు.
Advertisements
ఉడతలు:
2007లో ఇరాన్ సరిహద్దులో ఆ దేశ ఇంటెలిజెన్స్ సిబ్బంది 14 గూఢచారి ఉడతలను పట్టుకున్నారు. అవి ఇజ్రాయెల్‌కు చెందినవని వారు ఆరోపించారు. వాటికి ఇజ్రాయెల్ ట్రెయినింగ్ ఇచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.
ఊసరవెల్లులు:
పాశ్చాత్య దేశాలు ఇరాన్‌లో ఊసరవెల్లులను వదిలాయని.. అవి ఇరాన్‌లో ఉన్న యురేనియం స్థావరాలను పసిగట్టగలవని.. 2018లో.. ఇరాన్‌కు చెందిన హసన్ ఫిరుజాబాదీ అనబడే సీనియర్ మిలిటరీ అధికారి ఆరోపించారు.
రాబందులు:
2011లో సౌదీ అరేబియాకు చెందిన హంటర్ ఓ రాబందును పట్టుకున్నాడు. దాని కాళ్లకు టెల్ అవివ్ యూనివర్సిటీ అనే ట్యాగ్ ఉంది. దీంతో ఆ రాబందు ఇజ్రాయెల్‌కు చెందినదేనని, అది సౌదీపై గూఢచర్యం చేస్తుందని అతను ఆరోపించాడు.
ఇతర పక్షులు:
2011లో సూడాన్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన పెలికాన్ పక్షులను కొందరు పట్టుకున్నారు. అలాగే అదే ఏడాది ఇజ్రాయెల్‌కు చెందిన గద్దను లెబనాన్‌లో, 2012లో ఇజ్రాయెల్‌కు చెందిన ఓ జాతి పక్షులను టర్కీలో పట్టుకున్నారు. దీంతో ఇజ్రాయెల్‌పై ఆయా దేశాలు గూఢచర్యం ఆరోపణలు చేశాయి.