Advertisement
భారత దేశ చరిత్రలో మరాఠా సైనికులను యోధులుగా చెప్పారు. ఎంతో మంది మరాఠా రాజులు బ్రిటిష్, మొగల్ చక్రవర్తులకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. వారిలో ఛత్రపతి శివాజీ కూడా ఉన్నాడు. అయితే ఎంత గొప్ప వారైనా సరే వారికి కూడా ఏదో ఒక మరక ఉంటుందన్న చందంగా.. మరాఠా సైన్యం విషయంలోనూ ఓ చీకటి కోణం ఉంది. మరాఠా సైన్యానికి చెందిన ఓ వర్గం వారు అప్పట్లో పశ్చిమ బెంగాల్‌పై కొన్నేళ్ల పాటు వరుసగా దాడులు చేశారు. అత్యం పాశవికంగా ప్రవర్తించారు. కానీ చరిత్రలో దీని గురించి ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం.
అప్పట్లో.. అంటే… 1740 నుంచి 1750 సంవత్సాల వరకు సుమారుగా 10 ఏళ్ల పాటు మరాఠా సైన్యానికి చెందిన బర్గిస్ అని పిలవబడే ఓ వర్గం వారు బెంగాల్‌పై ఏటా దాడి చేసే వారు. వారు మెరుపు దాడులు చేయడంలో, అకస్మాత్తుగా దెబ్బ కొట్టి పారిపోవడంలో సిద్ధహస్తులుగా ఉండేవారు. ఈ క్రమంలో వారు ఏటా బెంగాల్‌పై దాడి చేసి తమకు నచ్చింది తీసుకునిపోయేవారు. అలాగే వారు ఒరిస్సాపై కూడా దాడులు చేసేవారు. అప్పట్లో బర్గిస్ సైన్యాన్ని నాగ్‌పూర్‌కు చెందిన రాజా రఘోజీ రాజే భోంస్లే వృద్ది చేశారు. బర్గిస్ సైనికులకు ఆ రాజ్యం గుర్రాలను, ఆయుధాలను ఇచ్చేది. వాటితో ఆ సైనికులు ఒరిస్సా, బెంగాల్ లపై దాడులు చేసేవారు.
Advertisement
అయితే బర్గిస్ సైన్యం దాడుల వల్ల అప్పట్లో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ మొత్తం దాదాపుగా 4 లక్షల మంది వరకు చనిపోయారు. బర్గిస్ సైనికులు చేసిన అకృత్యాలకు అప్పట్లో అడ్డు అదుపు లేకుండా పోయింది. దీంతో ఎంతో మంది వ్యాపారులు, నేత కార్మికులు, రైతులు చంపబడ్డారు.
కానీ ఎట్టకేలకు బర్గిస్ సైన్యం దాడులకు ఓ రాజు ముగింపు పలికాడు. 1751లో బెంగాల్ నవాబ్ అలివర్ది ఖాన్ మరాఠా బర్గిస్ సైన్యంతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. దాని ప్రకారం బెంగాల్ నవాబ్ బర్గిస్ సైన్యానికి ఏటా రూ.12 లక్షలు చెల్లించాలి. అలాగే మరో రూ.32 లక్షలను అదనపు రుసుం కింద చెల్లించాలి. దీంతో నవాబ్ ఒప్పుకునే సరికి బర్గిస్ సైన్యం అప్పటి నుంచి బెంగాల్‌పై దాడులు చేయడం ఆపేసింది. అయినప్పటికీ వారు ఒరిస్సాపై యథావిధిగా దాడులు కొనసాగించారు. ఇలా మరాఠా చరిత్రలో బర్గిస్ సైన్యం పాల్పడిన అకృత్యాలు, చేసిన ఘోరాలు మాయని మచ్చల్లా మిగిలిపోయాయి. ఎంతో మంది మరాఠా రాజులు తమ జాతికి వన్నె తెచ్చారు. కానీ బర్గిస్ సైనికుల వల్ల మరాఠా రాజుల చరిత్రపై మచ్చ ఏర్పడింది.
Advertisements
Advertisements