Advertisement
దేశంలో ప్రస్తుతం విద్యార్థులకు అనేక ఇంజినీరింగ్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో అటానమస్ ఇంజినీరింగ్ కాలేజీలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. సాధారణంగా దేశంలో అనేక ఇంజినీరింగ్ కాలేజీలు ఏదో ఒక యూనివర్సిటీకి అనుబంధంగా పనిచేస్తాయి. కానీ అటానమస్ కాలేజీలు మాత్రం స్వతంత్రంగా పనిచేస్తాయి. అందుకనే వాటికి ప్రాముఖ్యత పెరుగుతోంది. కాలేజీల్లో అందుబాటులో ఉండే బోధనా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, పాలనా సౌకర్యం తదితర అనేక అంశాల ఆధారంగా కాలేజీలకు అటానమస్ స్టేటస్‌ను ఇస్తారు. అయితే విద్యార్థులకు ఈ కాలేజీల్లో చదవడం ద్వారా ఉద్యోగావశాకాలు చాలా త్వరగా లభించడమే కాదు, కెరీర్ పరంగా కూడా ఎంతో లాభం ఉంటుంది.
సాధారణంగా యూనివర్సిటీలకు అనుబంధంగా పనిచేసే కాలేజీలు యూనివర్సిటీ మీద ఆధారపడాల్సి ఉంటుంది. యూనివర్సిటీలు ఇచ్చే తేదీల ప్రకారం క్లాసులు, పరీక్షలు నిర్వహించాలి. కానీ అటానమస్ కాలేజీలు అలా కాదు. సొంతంగా సిలబస్‌ను, అకాడమిక్ క్యాలెండర్‌ను రూపొందించుకోవచ్చు. తమకు అనుగుణంగా సెమిస్టర్లను నిర్వహించవచ్చు. అలాగే ఇతర కాలేజీల కన్నా వేగంగా పరీక్షలను నిర్వహించవచ్చు. దీని వల్ల విద్యార్థులకు దీర్ఘకాలం పాటు పరీక్షలు, ఫలితాల కోసం వేచి చూడాల్సిన పనిలేదు.
ఇక అటానమస్ కాలేజీలు స్వతంత్రంగా పనిచేస్తాయి కాబట్టి పారిశ్రామిక, కార్పొరేట్ అవసరాలకు అనుగుణంగా, ఉపాధి, ఉద్యోగావకాశాలను బట్టి విద్యార్థుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త కోర్సులను అందించవచ్చు. దీని వల్ల విద్యార్థులు ఎప్పటికప్పుడు మార్కెట్ ట్రెండ్‌ను బట్టి ముందుకు సాగవచ్చు. కాలేజీలో విద్య ముగించుకున్న వెంటనే జాబ్ లభించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే పరిశ్రమలు, కంపెనీల డిమాండ్ మేరకు అటానమస్ కాలేజీలు నైపుణ్యం కలిగిన విద్యార్థులను తయారుచేయవచ్చు. దీంతో కంపెనీలకు తమకు కావల్సిన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు వెంటనే లభిస్తారు. మరోవైపు విద్యార్థులకు కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన వెంటనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వెంటనే ఉద్యోగం పొందవచ్చు.
అటానమస్ కాలేజీల్లో ఎప్పటికప్పుడు మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా విద్యాబోధన చేస్తారు. అందుకు అనుగుణంగా సిలబస్‌ను రూపొందిస్తారు. అకాడమిక్ ప్రోగ్రామ్స్‌ను అందుబాటులో ఉంచుతారు. పరీక్షలు నిర్వహిస్తారు. అధునాతన బోధనా పద్ధతుల్లో విద్యను అభ్యసించవచ్చు. అటానమస్ కాలేజీలు ఎక్కువగా ప్రాజెక్టులు, యాక్టివిటీలను, ఇంటర్న్‌షిప్‌లను నిర్వహిస్తాయి. దీని వల్ల విద్యార్థులకు కెరీర్ ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది. ఇది వారి ఉద్యోగావకాశాలను పెంచుతుంది. కెరీర్‌లో తక్కువ సమయంలోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు.
Advertisements
Advertisement
ఇక అటానమస్ కాలేజీలు అక్రిడిటేషన్‌ను కలిగి ఉండి అత్యున్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్యాబోధన అందిస్తాయి కనుక ఆ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఇతర యూనివర్సిటీలు ప్రాధాన్యతను ఇస్తాయి. అలాగే కంపెనీలు కూడా వారికి మొదటి ప్రాధాన్యతను ఇస్తాయి.
అటానమస్ కాలేజీల్లో విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకుని చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్‌ను ఫాలో కావచ్చు. తమ స్కిల్స్ ను మెరుగుపరుచుకోవచ్చు.
మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కంపెనీల అవసరాల మేరకు అటానమస్ కాలేజీలు ఎప్పటికప్పుడు సిలబస్‌లకు, అకాడమిక్ కోర్సులకు మార్పులు, చేర్పులు చేస్తుంటాయి. దీని వల్ల విద్యార్థులు చదువు ముగియగానే వెంటనే జాబ్ పొందేందుకు అవకాశం ఉంటుంది. క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తే వెంటనే జాబ్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
అటానమస్ కాలేజీల్లో ప్రముఖ ప్రొఫెసర్లచే కోర్సులను ఏర్పాటు చేస్తారు. మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సులు అందుబాటులో ఉంటాయి. వీటిని విద్యార్థులు ఎప్పటికప్పుడు పూర్తి చేసి తమ నైపుణ్యాలకు మరింత పదునుపెట్టుకోవచ్చు.
అటానమస్ కాలేజీల్లో అందించే ఫుల్ టైం ఇంటర్న్‌షిప్‌లు విద్యార్థులకు మేలు చేస్తాయి. కార్పొరేట్ కంపెనీలతో వారికి టై అప్స్ ఉంటాయి కనుక విద్యార్థులు ఇతర కాలేజీల విద్యార్థుల కన్నా ముందుగానే ఇంటర్న్‌షిప్‌లు చేసి జాబ్‌లకు సిద్ధం కావచ్చు.
ఇతర కాలేజీల్లో పరీక్షలు నిర్వహించడం, ఫలితాలను ప్రకటించడం ఆలస్యం అవుతుంది. కానీ అటానమస్ కాలేజీలలో ఈ ప్రక్రియలు చాలా వేగంగా జరుగుతాయి. దీని వల్ల విద్యార్థులకు ఎంతో సమయం ఆదా అవుతుంది. అలాగే పాఠ్యాంశాల్లో వెనుకబడే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ సెమిస్టర్లు నిర్వహిస్తారు. దీని వల్ల చదువుల్లో వెనుకబడిన విద్యార్థులకు మేలు కలుగుతుంది.
అటానమస్ కాలేజీల్లో ఇంటర్నేషనల్ క్రెడిట్ ట్రాన్స్‌ఫర్ వ్యవస్థ ఉంటుంది. అంటే అటానమస్ కాలేజీల్లో చదివే విద్యార్థులు ఏదైనా అంతర్జాతీయ కాలేజీ లేదా యూనివర్సిటీకి మారితే ఇక్కడ కాలేజీలో ఆ విద్యార్థికి ఉండే క్రెడిట్స్‌ను అక్కడి కాలేజీ లేదా యూనివర్సిటీకి సులభంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
ఇక ఏదైనా కాలేజీకి అటానమస్ స్టేటస్ ఇచ్చే అధికారం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కి ఉంటుంది. ఒక కాలేజీ 10 ఏళ్ల నుంచి సేవలు అందిస్తుండాలి. దానికి నాక్ (ఎన్‌ఏఏసీ) అక్రిడిటేషన్ కనీసం ఎ గ్రేడ్ ఉండాలి. లేదా ఎన్‌బీఏ అక్రిడిటేషన్ స్కోరు కనీసం 675 ఆపైన ఉండాలి. కనీసం 3 అకాడమిక్ ప్రోగ్రామ్‌లలో ఆ స్కోరు ఉండాలి. దీంతో ఆ కాలేజీకి అటానమస్ స్టేటస్ ఇస్తారు.
Advertisements