Advertisement
మిమ్మల్ని ఎవరైనా అవమానిస్తే.. మీరు ఏం చేస్తారు..? పగ, ప్రతీకార జ్వాలలతో రగిలిపోతారు. వారి అంతు చూడాలని భావిస్తారు. అంతే కదా.. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే.. అలా ఎవరి మీదైనా ప్రతీకారం తీర్చుకోవాలంటే.. మనం వారి కళ్లెదుటే సక్సెస్ అయి చూపించాలి. అదే మనం వారి పట్ల తీర్చుకునే బెస్ట్ రివేంజ్ అవుతుంది. అవును.. అందుకు భారత మాజీ రాష్ట్రపతి, దివంగత కేఆర్ నారాయణన్ జీవితమే ఉదాహరణ.
కేఆర్ నారాయణన్‌ది నిరుపేద కుటుంబం. ఆయన చిన్నతనంలో వారి కుటుంబానికి తినేందుకు తిండి కూడా ఉండేది కాదు. దీంతో ఆయన చదువు కూడా అంతంత మాత్రంగానే సాగేది. అయినప్పటికీ విద్యాభ్యాసాన్ని ఆయన విడిచిపెట్టలేదు. ఎన్నో సార్లు ఫీజు కట్టలేక ఆయన తరగతి గది బయటే ఉండిపోవాల్సి వచ్చింది. ఇక పుస్తకాల కోసం ఆయన సోదరుడు కష్టపడేవారు. ఇతరుల పుస్తకాలను అడిగి తీసుకువచ్చి నారాయణన్ కోసం నోట్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేవారు. నిత్యం నారాయణన్ స్కూల్‌కు వెళ్లేందుకు 15 కిలోమీటర్ల దూరం నడిచేవారు. అలా నారాయణన్ చిన్నతనంలో విద్యాభ్యాసం ముగిసింది.
Advertisement
అలా ఎన్నో కష్టాల నడుమ నారాయణన్ 1943లో యూనివర్సిటీ ఆఫ్ ట్రావెన్‌కోర్ నుంచి బీఏ (లిటరేచర్) హానర్స్ పూర్తి చేశారు. యూనివర్సిటీ స్థాయిలో ఆయన ఆ కోర్సులో మొదటి ర్యాంక్ సాధించారు. ఆయన ప్రతిభకు అప్పట్లోనే చక్కని ఉద్యోగం లభించేది. కానీ ఆయన మహారాజ కాలేజీలో లెక్చరర్ అవ్వాలనుకున్నారు. అందుకు దరఖాస్తు చేస్తే కాలేజీ వారు ఆయన్ను అవమానిస్తూ క్లర్క్ పోస్టు ఇచ్చారు. దీంతో నొచ్చుకున్న నారాయణన్ తాను ఎస్సీ అయినందువల్లే తనను ఇలా అవమాన పరిచారని తెలుసుకుని ఎన్నో సార్లు మహారాజను కలిసేందుకు వెళ్లారు. కానీ ఒక్కసారి కూడా నారాయణన్‌ను వారు లోపలికి అనుమతించలేదు. దీంతో నారాయణన్ ఆ యూనివర్సిటీ ఇచ్చే పట్టాను వద్దనుకున్నారు.
Advertisements
Advertisements
ఆ తరువాత ఆయన పార్ట్ టైం టీచర్‌గా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉన్నారు. ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి ప్రముఖ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. జేఆర్డీ టాటా అందజేసిన సహాయంతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. తరువాత ఎన్నో ఏళ్లకు ఆయన భారత రాష్ట్రపతి అయ్యారు. ఈ క్రమంలో తాను మహారాజ కాలేజీని వదిలాక 50 ఏళ్ల అనంతరం రాష్ట్రపతి హోదాలో తిరిగి తాను చదివిన యూనివర్సిటీకే వెళ్లారు. అక్కడ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కట్ చేస్తే.. ఒకప్పుడు ఏ కాలేజీ అయితే తనకు క్లర్క్ పోస్టు ఇచ్చి అవమానించిందో.. తాను ఏ యూనివర్సిటీ పట్టాను అయితే వద్దనుకున్నాడో.. తిరిగి అదే యూనివర్సిటీ ఆయన డిగ్రీని అందజేసేందుకు ముందు వచ్చింది. ఆ పట్టాను తీసుకోవాల్సిందిగా నారాయణన్‌ను యూనివర్సిటీ యాజమాన్యం కోరింది. అదీ.. బెస్ట్ రివేంజ్ అంటే.. తనను ఛీ కొట్టిన వారితోనే ఆయన సత్కారం పొందారు. బెస్ట్ రివేంజ్‌కు సక్సెస్ అయి చూపించడమే సరైన మార్గం అని ఇప్పటికైనా ఒప్పుకుంటారా..!