Advertisement
నా పెళ్ళై 3 సంవత్సరాలు. నా కుటుంబ పరిస్థితులు నా భార్యకు తెలుసు కాబట్టి మా పెళ్లైనప్పటి నుండి ఇప్పటి వరకు తను నన్నేదీ కోరలేదు. ప్రతి పైసా చాలా జాగ్రత్తగా ఖర్చుపెడుతుంది.! ఇంటి కిరాయి మొదలుకొని, కిరాణా సామాను, కూరగాయలు, ఇతర అవసరాలన్నింటినీ..నాకొచ్చే కూలీ డబ్బులతో భలే బ్యాలెన్స్ చేస్తుంది.! ఎంత ఆలోచించినా ఆ తర్కమేంటో నాకైతే అర్థమయ్యేది కాదు. ఇంటిని నడిపే ప్రతి ఆడోళ్ల చేతిలో ఏదో మ్యాజిక్ మాత్రం ఉండే ఉంటుంది.!!
Advertisement
వేసవి కాలం కావడం… పైగా నా భార్య గర్భవతి కావడంతో తన ఒళ్లంతా వేడిగా ఉండేది. ఒక్కోసారి వేడిని తట్టుకోలేక బకెట్ లో ముఖాన్ని ముంచేది. కొన్ని కొన్ని సార్లు వేడికి నిద్రపోయేది కూడా కాదు. అలా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది. అయినా ఆమె ముఖంలో ఏనాడు బాధ, కోపం కనపడేవి కావు. పని నుండి ఇంటికి రాగానే నవ్వుతూ పలకరించే ఆ ముఖాన్నే చూస్తున్న… గత 3 ఏళ్ల నుండి.
మరో రెండు రోజుల్లో మా పెళ్లి రోజు…ఈ సందర్భంగా ఆమెకో కానుక ఇవ్వాలనుకుంటున్నాను. అందుకోసం కొంత ఎక్కువ సేపు పనిచేసి ఆ గిఫ్ట్ కు కావాల్సిన డబ్బులు సమకూర్చుకున్నాను.! ఇంతకీ ఆ కానుకేంటో చెప్పలేదు కదా.! ఫ్యాన్…అవును ఫ్యాన్… నా భార్యకు నిద్రలేని రాత్రులు లేకుండా చేయడం కోసం…బకెట్ లో తలను అమాంతం ముంచే అవసరం రాకుండా ఉండడం కోసం….. నేను ఫ్యాన్ ను కొని తీరాల్సిందే.! కొంటాను అంతే.! ఎందుకంటే ఆమెకు మంచి జీవితాన్నివ్వడమే నా కర్తవ్యం !
Advertisements