Advertisement
9. జీవనభాష్యం
జీవనభాష్యం – డా. సి. నారాయణ రెడ్డి
కవిపరిచయం : సినారె రాజన్న సిరిసిల్లా జిల్లా హనుమాజీపేటలో జన్మించారు. నాగార్జున సాగరం, కర్పేర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, ప్రపంచ పదులు లాంటి 70కి పైగా కావ్యాలు రాశారు.
సినారె రాసిన విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ అవార్డ్ లభించింది. తెలంగాణ నుండి ఈ అవార్డ్ అందుకున్న ఏకైక కవి సినారెనే! ఈయన సాహిత్య సేవకు గాను భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. అధికారభాషా సంఘం అధ్యక్షుడిగా,ఆంధ్ర సారస్వత పరిషత్తు అథ్యకుడిగా, రాజ్యసభా సభ్యుడిగా సినారె తన సేవలందించారు.
పాఠం ఉద్దేశం : ఆటుపోట్లను అనుభవిస్తూ విజయాన్ని సాధించడంలోనే ఆనందం, సంతృప్తితో పాటు నిజమైన గుర్తింపు లభిస్తుందని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం.
గజల్ ప్రక్రియ : గజల్ కవితా ప్రక్రియ 10 వ శతాబ్దంలోఇరాన్ లో ప్రారంభమైంది. మొఘలుల కాలంలో ఇరాన్ నుండి ఇండియాకు వచ్చింది. గజల్ అనే పదం గజాల అనే టర్కీ పదం నుండి ఆవిర్భవించింది…దీనర్థం ‘జింక’, ‘జింక కనులు గల’ అని.! ఉర్దూ కవితాసాహిత్యంలో అత్యంత ప్రముఖ సాహితీ ప్రక్రియ గజల్.
గజల్‌లో పల్లవిని మత్లా అని, చివరి చరణాన్ని మక్తా అని, కవి నామముద్రను తఖల్లుస్ అని అంటారు. గజల్ చివర ఉన్న పదం, ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది. సరస భావన, చమత్కార ఖేలన, ఇంపూ, కుదింపూ – గజల్ జీవగుణాలు.
Advertisements
పాఠ్యాంశం- వివరణ:
మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది
మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది
(నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి. అవి నీటి రూపంలో దర్శనమిస్తాయి. అలాగే మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలు, దిగులుతో కూడిన మబ్బులు కమ్మితే కన్నీళ్లుగా బయటకు వస్తాయి)
వంకలు డొంకలు కలవనీ జడిపించకు నేస్తం
జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది
( ఓ నేస్తమా ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినప్పుడు వంకల డొంకల లాంటి ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది. కానీ ఆ మాటలకు జంకక, నిరుత్సాహపడకుండా ముందుకు అడుగులు వేస్తే విజయం లభిస్తుంది. ఆ స్ఫూర్తి నలుగురు నడిచే దారిగా మారుతుంది)
ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు
ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది
(ఎడారిలా బీడుపడి పనికిరాకుండా ఉన్న నేలలో ఏ పంటలూ పండవని, దున్నితే లాభం ఏమీ లేదనక, నిరాశపడక ఆ నేలను దున్నితే, విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పైరు అవుతుంది)
మనిషీ మృగమూ ఒకటనీ అనుకుంటే వ్యర్థం
మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది.
(మనుషులూ, మృగాలు ఒకటే అని అనుకోవడం వృథా. నలుగురు మనుషులు పరస్పరం కలిసి పరస్పర సహకారంతో జీవించాలి. సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని అలవరచుకోవాలి. అప్పుడే అందరూ కలిసి ఆనందంగా జీవించగలుగుతారు. అలాంటి మనుషులు కలిస్తే ఒక ఊరు ఏర్పడుతుంది)
ఎంతటి ఎత్తుల కెదిగినా ఉంటుంది పరీక్ష
హిమగిరి శిరసే మాడితే అది యేరవుతుంది
(ఎంత గొప్పగా ఎదిగినా, ఎంత సామర్థ్యం ఉన్నా; అధికారం, సంపదలు ఉన్నా, ఎన్నో విజయాలు సాధించినా విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో, సమస్యల పరీక్షలు పెడుతుందో ఎవరూ ఊహించలేరు. దాని శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే. ఉన్నతమైన హిమాలయ పర్వత శిఖరం కూడా ఎండ వేడికి కరిగిపోయి నదిగా ప్రవహించాల్సిందే. అది ఏరుగా మారాల్సిందే. అలాగే ఎంతటి మనిషికైనా గర్వం నీరులా కారిపోవాల్సిందే)
Advertisement
బిరుదులు పొందే వ్యాప్తికీ విలువేమి ”సినారే
చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది.
(ప్రపంచానికి పేరు తెలిసేలా ఖ్యాతి పొందామని, ప్రతిష్ఠాత్మక బిరుదులు, సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైన విలువ, గుర్తింపులేదు. ఎన్నటికి చెరిగిపోని త్యాగం చేస్తే గొప్ప పేరు శాశ్వతంగా నిలిచి పోతుంది)
పదాల వివరణ:
- మనసుకు మబ్బు ముసరడం: మనసనే ఆకాశాన్ని మబ్బులనే సమస్యలు చుట్టుముట్టడం
- మనిషి-మృగం ఒకటేనా?: మనిషిని మృగం నుండి వేరు చేసేది విచక్షణా జ్ఞానం.
- చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది: గొప్ప త్యాగాలను చేసినప్పుడు మన పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది.
జీవన భాష్యం : భాష్యం అంటే నిర్వచనం…ఆదర్శ, అభ్యుదయ జీవితం ఎలా ఉండాలో ఈ పాఠంలో మనం తెల్సుకోవొచ్చు.
పర్యాయ పదాలు :
- మబ్బు : మేఘము, అంబుదము, మొయిలు
- గుండె : హృదయము, డెందము
- శిరసు : తల, మస్తకము, మూర్ధము
సొంత వాక్యాలు :
- వ్యాప్తి : కొరోనా వైరస్ ప్రపంచమంతా వ్యాప్తి చెందింది
- జంకని అడుగులు : డాక్టర్ల జంకని అడుగులే కొరోనా నుండి మనల్ని రక్షిస్తున్నాయి
- ఎడారిదిబ్బలు : సౌదీ ఆరేబియాలో ఎటుచూసినా ఎడారిదిబ్బలే దర్శనమిస్తాయి
- చెరగని త్యాగం : ఎందరో వీరుల చెరగని త్యాగం కారణంగానే ఇండియాకు స్వతంత్రం వచ్చింది.
సంధి :
- నీరు + అవుతుంది = నీరవుతుంది ( ఉత్వసంధి)
- ఎత్తులకు + ఎదిగిన = ఎత్తులకెదిగిన ( ఉత్వసంధి)
- పేరు+ అవుతుంది = పేరవుతుంది ( ఉత్వసంధి )
ఉత్వసంధి: ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యం.
నీరు (ఉ) + (అ) అవుతుంది = నీరవుతుంది.
సమాసాలు:
- ఎడారి దిబ్బలు : ఎడారి(లో) దిబ్బలు….. షష్ఠి తత్పురుష ( కి, కు,యొక్క, లో, లోపల)
- ఇసుక గుండెలు.…ఇసుక యొక్క గుండెలు…షష్ఠి తత్పురుష ( కి, కు,యొక్క, లో, లోపల)
అలంకారాలు :
1) నీకు వంద వందనాలు – ఛేకానుప్రాస అలంకారం.
ఛేకానుప్రాస అలంకారం : హల్లుల జంట అర్థబేధంతో వెంటవెంటనే రావడం.
ఇక్కడ వంద=100, వందనాలు లో అంటే నమస్కారాలు….. రెండు వందలు పక్కనే పక్కనే వచ్చాయి…వేరే వేరే అర్థాన్ని తెచ్చాయి. కాబట్టి ఛేకానుప్రాస అలంకారం.
2) తెలుగు జాతికి అభ్యుదయం, నవ భారతికే నవోదయం – అంత్యానుప్రాసాలంకారం
అంత్యానుప్రాసాలంకారం: పాదం చివర్లో ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు….
అభ్యుదయం లో దయం, నవోదయం లో దయం……ఒకే ఉచ్చారణతో ముగుస్తున్నాయి.
3) రాజు రివాజులు బూజు పట్టగన్ – వృత్త్యనుప్రాసాలంకారం
వృత్త్యనుప్రాసాలంకారం: ఏదైనా ఒక అక్షరం మళ్లీ మళ్లీ ఆవృత్తి చెందితే దాన్ని వృత్త్యనుప్రాసాలంకారం అంటారు. పై వాక్యంలో జు అనే అక్షరం( హల్లు ) పునరావృత్తమైంది.
Advertisements
4) అజ్ఞానందకారం తొలిగితే మంచిది – రూపకాలంకారం
రూపకాలంకారం :ఉపమాన ఉపమేయాలను బేధం లేనట్లు చెప్పడం…పై వాక్యంలో అజ్ఞానం అనేది ఉపమేయం అంధకారం అనేది ఉపమానం….ఈ రెండికి బేధం లేనట్లు చెప్పబడింది.