Advertisement
1Q) సామల సదాశివ గురించి రాయండి.
A: సామల సదాశివ కుంరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగావ్ మండలం తెనుగుపల్లెలో జన్మించారు. ఉర్దూ సాహిత్య చరిత్ర, అమ్జద్ రుబాయూలు, మలయమారుతాలు, యాది , సంగీత శిఖరాలు ఈయన రచనలు. ఈయన రచించిన స్వరలయలు అనే రచనకు 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఈయన రచనల్లోని భాష సహజ సుందరంగా, సరళంగా ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకుపోయేలా ఉంటుంది.
2Q) మనుమరాలి మాటలు విని తాతయ్య ఎందుకు అబ్బురపడ్డాడు?
A:సదాశివ గారి మనుమరాలు లావణ్య “తాతా ఇగపటు నీ పాను, జర్దా డబ్బీ” అంది. ‘ఇగపటు’ అనే పదం వినగానే తాతయ్యకు ఆనందం కలిగింది. ఈ ఇగపటు అనే పదం తమ ప్రాంతపు వ్యావహారిక పదం. హైద్రాబాద్ లో ఉండే తన మనవరాలు తమ ప్రాంతపు వ్యవహారిక పదాన్ని ఉపయోగించడం తాత ఆనందానికి కారణమైంది. ఏ ప్రాంతం వాళ్లకు ఆ ప్రాంతపు తెలుగు పట్ల మక్కువ ఎక్కువ….తాత గారైన సదాశివ గారికి కూడా తమ వ్యావహారిక భాష అంటే చాలా ఇష్టం. ఇప్పుడు తన మనమరాలికి కూడా వ్యావహారిక భాషపై ఇష్టం ఏర్పడుతున్నందుకు ఆయన ఎంతగానో అబ్బురపడ్డారు.
Advertisements
3Q) కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారిని రచయిత గురుస్థానీయులుగ ఎందుకు భావించారు?
A:కప్పగంతుల లక్ష్మణశాస్త్రి సంస్కృత, ఆంధ్ర భాషలలో పండితులు.సామల సదాశివ గారు లక్ష్మణశాస్త్రి రచించిన కావ్యాలనే కాక …ఆ కావ్యాలపై పెద్ద పెద్ద పండితులు రాసిన అభిప్రాయాలను కూడా చదివేవారు. వారి రచనల ద్వారా ఎన్నో సాహిత్య విషయాలను తెలుసుకునేవారు.
సదాశివ గారు లక్ష్మణశాస్త్రి దగ్గర కూర్చొని ఆయన చెబుతుంటే పండితుల ఉత్తరాలకు జవాబులు రాసేవారు. ఇలా మరెన్నో కొత్త కొత్త విషయాలను లక్ష్మణశాస్త్రి నుండి నేర్చుకునేవారు…అందకే సదాశివ గారు లక్ష్మణ శాస్త్రి గారిని గురుస్థానీయులుగా భావించారు.
5Q) అందరు యూనివర్సిటీ ఆచార్యులుండగా ఒక రిటైర్డ్ రెవిన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడమేమిటి అని రచయిత అనుకోవడంలో ఉద్దేశమేమై ఉంటుంది?
A: పెద్ద కాళోజీ వర్థంతి సందర్భంగా వరంగల్ లో ఏర్పాటు చేసిన సాహిత్య సభకు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షత వహించారు. అక్కడ అందరూ తెలుగు విద్వాంసులు, ఆచార్యులు ఉండగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కు చెందిన వ్యక్తి ఆ సాహితీ సభకు అధ్యక్షుడిగా ఉండడం సదాశివను కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది. యూనివర్సిటీ ఆచార్యులకు తెలుగు భాషపై పట్టు ఎక్కువగా ఉంటుంది. తెలుగు మీద వారు అనేక పరిశోధనలు చేసి ఉంటారు. భాష పుట్టుక, వికాసంపై పూర్తి అవగాహన ఉంటుంది. వాళ్ల ఉద్యోగం కూడా అదే.! కాబట్టి వారంతా ఉన్న ఈ సభకు రెవిన్యూ ఉద్యోగి అధ్యక్షత వహించడం ఆశ్చర్యానికి గురిచేసినప్పటికీ… వారికి ఆ అర్హత లేదనేది రచయిత ఉద్దేశం కాదు. పైగా ఆ సభలో అధ్యక్షుడు చేసిన ప్రసంగాన్ని సదాశివగారు ఎంతగానో మెచ్చుకున్నారు.
6Q) మీ చిన్నప్పటి జ్ఞాపకాలను వ్యాసంగా రాయండి.
A: నా చిన్నతనం అనగానే నాకు మా ఇంటిలోని జామచెట్టే గుర్తుకువస్తుంది. స్కూల్ కి సెలవొస్తే చాలు మా గ్రూప్ అంతా ఆ చెట్టు మీదే ఉండేవాళ్లం. ఒక్కొక్కరం ఒక్కో కొమ్మ మీద కూర్చొని, కబుర్లు చెప్పుకుంటూ, కథలు చెప్పుకుంటూ కాలం గడిపేవాళ్ళం.అన్నం కూడా దాని మీదే తినేవాళ్లం. ఈ చెట్టుకు కాసే చిన్న చిన్న పిందెలనే కాదు…ఆఖరికి ఆ జామచెట్టు ఆకులలో ఉప్పు, చింతపండు పెట్టుకొని పాన్ ..పాన్ అంటూ తినేవాళ్ళం! మా ఇళ్లు కట్టేటప్పుడు దాన్ని కొట్టి వేశారు.అప్పుడు నేను చాలా బాధపడ్డాను.
అప్పడప్పుడే మా ఊర్లోని దుకాణాల్లోకి లేస్ చిప్స్ ప్యాకెట్స్ వచ్చాయి. టివిల్లో విపరీతంగా చూపించేవారు. ఎలాగైనా దాన్ని కొనుక్కోవాలని …. మా నాన్న చొక్కా జేబులోంచి పదిరూపాయల నోటును తీశాను. అలా డబ్బులు తీయడాన్ని అక్క చూసింది. ఈ విషయం నాన్నకు చెప్పకుండా ఉండడం కోసం అక్కకు కూడా ఒక లేస్ ప్యాకెట్ కొనిచ్చాను. నేను చెరువు కట్ట వద్దకు వెళ్లి లేస్ ను ఆస్వాదిస్తూ తిన్నాను. అక్క మాత్రం రెండు చిప్స్ తిని మిగితా ప్యాకెట్ ను తన స్కూల్ బ్యాగ్ లో దాచుకుంది. ఆ విషయాన్ని గమనించి మిగితా చిప్స్ ను నేనే ఖతం చేశాను. అక్కకు కోపమొచ్చి నాన్నకు చెప్పింది. నా దొంగతనం తెలిసి నాన్న చేతి దెబ్బ నీ వీపుమీద పడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు నాన్నకు చెప్పకుండా ఏ పనీ చెయ్యలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మధుర జ్ఞాపకాలు…మరెన్నో సంఘటనలు కళ్లముందు మెదులుతుంటాయి.
7Q) ఏదైనా సంఘటనను వాడుకభాషలో సంభాషణగా రాయండి.
Advertisement
A: నేను బస్ లో యాదగిరి గుట్టుకు వెళుతున్న సమయంలో ఒక ప్రయాణికుడికి, బస్ కండక్టర్ కు మద్య జరిగిన సంభాషణ…..
- ప్రయాణికుడు : గీ బస్ యాడికి బోద్ది?
- బస్ కండక్టర్ : నువ్వు యాడికి బోవాలి?
- ప్రయాణికుడు : యాదగిరి గుట్టకు బోవాలి.
- బస్ కండక్టర్ : బోతది గానీ, సౌ రూపియే అయితయ్…టికెట్ దీసుకో…
- ప్రయాణికుడు : మరీ అంత పిరమా? జర తగ్గియరాదు
- బస్ కండక్టర్ : తగ్గిచ్చుడు, పెంచుడు ఉండద్…గిదంతా సర్కార్ రేట్
- ప్రయాణికుడు : ఎంత టైమ్ బడ్తది?
- బస్ కండక్టర్ : దేడ్ ఘంట బడ్తది
- ప్రయాణికుడు : జర జల్దీ దీసుక పో…..యాదగిరి నర్సన్న కాడ మొక్కున్నది.
- బస్ కండక్టర్ : నుబో…ను బొయ్యి… బస్ తోలు….
- ప్రయాణికుడు : నాకు రాదులే గానీ… గా డ్రైవర్ సాబ్ నే తోలనియ్యి!
సొంత వాక్యాలు
- యాదిచేసుకొను : మా అమ్మమ్మను యాదిచేసుకున్నప్పుడల్లా ఏడుపొస్తుంది.
- పసందు : మా అమ్మ చేతి సకినాలు భలే పసందుగా ఉంటాయి
- రమ్యం : మా ఊరి చెరువు రమ్యంగా ఉంటుంది.
- క్షేత్రం : తెలంగాణ సర్కార్ యాదాద్రి క్షేత్రాన్ని తీర్చిదిద్దుతుంది.
నానార్థాలు
- కవి : పండితుడు, శుక్రుడు, వాల్మీకి, కవిత్వం చెప్పేవాడు.
- క్షేత్రం : శరీరం, పంటపొలం, పుణ్యభూమి, చోటు
పర్యాయ పదాలు
- ఆలయం = ఇల్లు, గృహం
- ప్రశంస = పొగడ్త, స్తోత్రం
ప్రకృతి – వికృతి
- భాష – బాస
- కవిత – కైత
- కథ- కత
- స్త్రీ – ఇంతి
వ్యుత్పత్త్యర్థాలు
- గురువు : అజ్ఞానమనెడి అంధకారాన్ని తొలగించువాడు
- భాష : భాషింపబడునది.
కింది వాక్యాలను సామాన్య వాక్యాలుగా మార్చండి.
- Q)తిరుమల రామచంద్రగారు సంస్కృత,ఆంధ్ర భాషలలో పండితుడు.
- A) తిరుమల రామచంద్రగారు సంస్కృత భాషలో పండితుడు, తిరుమల రామచంద్ర గారు ఆంధ్ర భాషలో పండితుడు
- Q)నేనొక్కప్పుడు పుస్తకాలు, వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని
- A)నేనొక్కప్పుడు పుస్తకాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని .నేనొక్కప్పుడు వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని
- Q) ఇంట్లో మాట్లాడే భాష, బడిలో చదివే భాష వేరువేరు.
- A) ఇంట్లో మాట్లాడే భాష వేరు. బడిలో చదివే భాష వేరు
కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి.
- Q) తెలుగు వాళ్ళ పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి. వాటిని మనం భద్రపరుచుకోవడం లేదు.
- A) తెలుగు వాళ్ళ పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి కానీ వాటిని మనం భద్రపరుచుకోవడం లేదు.
- Q)నల్గొండ జిల్లాలో ఎందరో కవులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో కథకులూ ఉన్నారు. నల్గొండ జిల్లాలో పత్రికా విలేకరులు ఉన్నారు.
- A) నల్గొండ జిల్లాలో ఎందరో కవులు,కథకులూ,పత్రికా విలేకరులు ఉన్నారు.
- Q) నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు. నమాజు చదివి ఎందరో పోతుంటారు.
- A) నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు, చదివి పోతుంటారు.
ఈ వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చండి.
- Q) అంబటి వెంకటరత్నం కావ్యం రాశాడు. అంబటి వెంకటరత్నం అచ్చు వేయించాడు.
- A) అంబటి వెంకటరత్నం కావ్యం రాసి, అచ్చు వేయించాడు.
- Q)గడియారం రామకృష్ణ మంచి పాండిత్యం సంపాదించాడు. గడియారం రామకృష్ణ అనేక సన్మానాలు పొందాడు
- A) గడియారం రామకృష్ణ మంచి పాండిత్యం సంపాదించి,అనేక సన్మానాలు పొందాడు
- Q) కప్పగంతుల లక్ష్మణశాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించాడు. కర్ణ సుందరి నాటకాన్ని ప్రచురించాడు.
- A) కప్పగంతుల లక్ష్మణశాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించి, ప్రచురించాడు.
రుగాగమ సంధి
కర్మధారయమందు పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే రుగాగమమౌతుంది.
పూర్వ పదం విశేషణం, ఉత్తరపదం విశేష్యం ( నామవాచకం) ఇలా విశేషణ విశేష్యాలతో కూడిన పదాన్ని కర్మధారయమంటారు.
- పేదరాలు = పేద + ఆలు
- బీదరాలు = బీద + ఆలు
- బాలింతరాలు = బాలింత + ఆలు
- ముద్దరాలు = ముద్ద + ఆలు
- జవరాలు = జవ + ఆలు
- మనుమరాలు = మనుమ+ ఆలు
- కొమరాలు = కొమ+ ఆలు
Advertisements
కర్మధారయమందు తత్సమ శబ్దములకు ఆలు శబ్దం పరమైనప్పుడు పూర్వపదం చివరున్న అకారానికి ఉకారము వచ్చి రుగాగమం అవుతుంది.
- గుణవంతురాలు = గుణవంత+ఆలు
- బుద్దివంతురాలు = బుద్దివంత + ఆలు
- శ్రీమంతురాలు = శ్రీమంత +ఆలు