Advertisement
నాకు తొమ్మిదో నెల.. నడుము నొప్పి స్టార్టయింది.. అర్దం అవుతోంది..నెలలు నిండే టైం కాబట్టి ఏ క్షణమైనా డెలివరీ అవ్వొచ్చు..ఒక్కసారి ఇంటిముందు నిలబడి సెకండ్ ఫ్లోర్ ఉండే మా ఫ్లాట్ వైపు తలెత్తి చూసా..అమ్మో అంతపైకి ఎక్కలేను.. పెయిన్ ఎక్కువవుతోంది..డెలివరీ అయినా అయిపోతుంది.. వారం ఆగి డెలివరీ అయితే నా బర్త్ డే, పాప బర్త్ డే ఒక్కరోజే వస్తుంది .. దేవుడా ఇప్పుడొద్దు అనుకుంటున్నా..వెంటనే మైండ్లోకి ఒక విషయం గుర్తొచ్చింది..
పూర్తిగా తొమ్మది నెలలు నిండితే ఆడపిల్ల పుడుతుంది..తొమ్మిది నెలల లోపు బాబు పుడతాడు ఇవన్ని ఏవో పిచ్చినమ్మకాలే కావొచ్చు కానీ ప్రెగ్నెన్సీ టైంలో ఎవరేం చెప్పినా నమ్మేయాలనిపిస్తుంటుంది.. అలాంటిదే ఇంకోటి పొట్ట పెద్దగా ఉంటే ఆడపిల్ల, చిన్నగా ఉంటే మగపిల్లాడు అని.. ఒక్కసారి పొట్టపై చేయి పెట్టి చూసుకున్నా చిన్నగా ఉంది..అబ్బాయే పుడతాడేమో..నాకేమో అమ్మాయంటే పిచ్చి.!
ఆంటీ , బాగా నడుము నొప్పి వస్తుంది .ఇప్పుడు రెండు ఫ్లోర్లు పైకి వెళ్లలేను కాసేపు ఇక్కడే పడుకుంటా అని..గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఓనర్ ఆంటిని అడిగి వాళ్లింట్లోనే పడుకున్నాను. నాలుగు గంటల నిద్ర తర్వాత మెలకువొచ్చింది….నొప్పి తగ్గినట్టనిపించింది.. మెల్లిగా మెట్లు ఎక్కి పైకి వెళ్లా.. కొంచెం అన్నం తిని మళ్లీ పడుకుని, సాయంత్రం బాత్రూంకి వెళ్దామని వెళ్లగానే బాత్రూంలోనే డెలివరీ అయిన ఇష్యూస్ కొన్ని గుర్తొచ్చి భయమేసి బయటికి వచ్చేసా..
సాయంత్రమైంది…. ఆఫీసులకి వెళ్లిన తమ్ముడు,చెల్లి,ఆయన ఇంటికొచ్చారు..పరిస్థితి చెప్పా.. బట్టలన్ని సర్దింది చెల్లి, వంట కాగానే తిని, వేడి వేడిగా పాలు తాగి హాస్పిటల్ కి బయల్దేరాము. హాస్పిటల్ కి చేరుకునే సరికి రాత్రి పది అయింది.
Advertisements
నొప్పి పెరిగిపోతుంది.. భరించలేకపోతున్నా..కానీ హాస్పిటల్లో డాక్టర్ నీకింకా డెలివరీకి టైం ఉందమ్మా..ఇప్పుడే ఎందుకొచ్చావ్..వారం రోజులుంది అంది.. యోని ప్రాంతంలో వేలు పెట్టి చూస్తారు..వే ఓపెన్ అయింది లేనిది.. టూ ఫింగర్ వే, వన్ ఫింగర్ వే అని ఉంటుంది..అలాగే చెక్ చేసి డాక్టర్స్ మాట్లాడుకుంటున్నారు..అప్పటికే ఆ విషయాలన్ని తెలుసుకుని ఉన్నా కాబట్టి వాళ్ల మాటలు అర్దం అయ్యాయి..ఇంకా సింగిల్ వే కూడా ఏర్పడలేదు..డెలివరి అని వచ్చేసింది..అంటూ చిరాగ్గా అని..ఇంటికి వెళ్లి రేపొద్దున రాపో అని అన్నారు..
Advertisement
మెల్లిగా వార్డు నుండి బయటికి వచ్చి..నాకు నొప్పి వస్తుంది..నాకు తెలుస్తుంది..నేను ఇంటికి వెళ్లను ఇక్కడే ఉంటాను అని చెప్పి హాస్పిటల్ బయట వరండాలో బెడ్ షీట్ పరిచి పడుకున్నా.. పక్కనే మా వాళ్లున్నారు..నొప్పి భరించలేక మా ఆయన చేతులు గట్టిగా పట్టుకున్నా, ఏడుస్తున్నా..ఈ డాక్టర్ ఏంటి ఇలా అంటుంది అని బాధ ఒకవైపు.. ఆ నొప్పి ఎలా ఉంటుందంటే.. అసలు ఇంకోసారి పిల్లల్నే కనొద్దు అనిపిస్తుంటుంది.. నొప్పులు తీయకపోతే వార్డుల్లో ఉండే డాక్టర్ల చేతే కాదు, ఆయాలు, నర్సుల చేతుల్లో కూడా తిట్లు తినాలి..ఆ తిట్లు ఎలా ఉంటాయంటే.. పండుకున్నప్పుడు నొప్పి కాలేదా అంటూ.. శరీరంలో ఎముకలు విరిగే నొప్పి ముందు వాళ్ల తిట్లు గాయపర్చవ్…ఎందుకంటే మన స్టేట్ ఆఫ్ మైండ్ కూడా అలాగే ఉంటుంది.
టైం 12.30..అర్దరాత్రి.. మళ్లీ నొప్పులు స్టార్ట్ అయ్యాయి….అతికష్టంమీద వార్డు వైపు నడిచా..జూనియర్ డాక్టర్ చూసి బెడ్ వైపు చూపించింది పడుకోమని..వెళ్లి పడుకుని వాళ్ల చేత తిట్లు వినేకంటే నొప్పులు తీయడం సులభం అని..శరీరంలోని శక్తినంతా కూడదీసుకుని రెండేరెండు సార్లు బలంగా ముక్కా..ముక్కడం అంటే బలవంతంగా మోషన్ పోవడానికి ప్రయత్నించడం..డెలివరికి ముందు మోషన్ ఫ్రీగా ఉండేలా చూస్కోవాలి..అందుకే పీచుపదార్దాలు ఎక్కువగా తినాలి..నరాలు పట్టేసినట్టుంటే ధనియాల కషాయం తాగాలి.. డెలివరి టైంలో ఇవి రెండూ ఉపయోగపడతాయి..
రెండేరెండు సార్లు గట్టిగా ముక్కేసరికి బిడ్డ బయటకి వచ్చి బెడ్ పై పడింది..డాక్టర్ సర్జికల్ సిజర్ పట్టుకొచ్చి బొడ్డు తాడు కట్ చేసి,బిడ్డని నాకు చూపించి…ఇదిగో అమ్మా ఆడపిల్ల అన్నది… నాకు ఆడపిల్ల పుట్టింది అని నేను అరిచిన అరుపు ఇంకా హాస్పిటల్ గోడల్లో ధ్వనిస్తుందేమో అంత గట్టిగా అరిచా..
ఎందుకే తల్లి ఆడపిల్లలుగా పుట్టి మనం అనుభవించింది చాలదా..మళ్లీ ఆడబిడ్డెందుకు అని నా ఫ్రెండ్ అన్న మాటలు గుర్తొచ్చాయి.. నా బిడ్డకు నేను ఏం ఇచ్చినా ఇవ్వకపోయినా గుండె ధైర్యాన్ని ఇవ్వాలి అని నాకు నేనే చెప్పుకొన్నా..
Advertisements