Advertisement
అన్ని రంగాల్లోనూ ప్రస్తుతం టెక్నాలజీ తనదైన ప్రభావం చూపిస్తోంది. టెక్నాలజీలో వస్తున్న మార్పుల వల్ల మనిషి జీవితం అత్యంత సౌకర్యవంతంగా మారింది. ఇక క్రికెట్‌లోనూ ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా వికెట్లు, బెయిల్స్‌లో వాడిన టెక్నాలజీ అద్భుతమని చెప్పవచ్చు. దాని వల్ల బంతి వాటికి తాకినప్పుడు వాటిల్లో ఉండే ఎల్ఈడీ లైట్లు వెలుగుతాయి. అయితే సాధారణ వికెట్లు, బెయిల్స్ కన్నా ఎల్ఈడీ లైట్లు ఉన్నవాటి ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది.
మన దేశంలో ఐపీఎల్ సహా, జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో వాడే ఎల్ఈడీ వికెట్లు, బెయిల్స్ ఖరీదు దాదాపుగా రూ.30 లక్షల వరకు ఉంటుంది. ఇక ఆస్ట్రేలియాలో బిగ్ బ్యాష్ లీగ్‌లో వాడే ఆ తరహా వికెట్లు, బెయిల్స్ ఖరీదు 45వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (దాదాపుగా రూ.23.59 లక్షలు) ఉంటుంది. అలాగే పాకిస్థాన్‌లో అక్కడి పీఎస్ఎల్‌లో 47.5 లక్షల పాకిస్థాన్ రూపాయల విలువ ఉంటుంది. ఇంగ్లండ్ టీ20 బ్లాస్ట్‌లో 23,472 పౌండ్లు (దాదాపుగా రూ.22.54 లక్షలు), బంగ్లాదేశ్ బీపీఎల్‌లో 24,50,674 టాకాల విలువ కలిగిన ఎల్ఈడీ వికెట్లు, బెయిల్స్ ను వాడుతారు.
Advertisement
Advertisements
ఇక వికెట్లు, బెయిల్స్‌లో ఎల్ఈడీ లైట్లు పెట్టే టెక్నాలజీని ఆస్ట్రేలియాకు చెందిన మెకానికల్ ఇండస్ట్రియలిస్ట్ బ్రాంటె ఎక్‌కెర్మన్ అభివృద్ధి చేశాడు. ఈ టెక్నాలజీని మొదటగా ఆస్ట్రేలియా బిగ్ బ్యాష్ లీగ్‌లో 2012 సీజన్‌లో ఉపయోగించారు. తరువాత 2013లో ఐసీసీ దీనికి ఆమోదం తెలపగా, 2016 టీ20 కప్ నుంచి ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అప్పటి నుంచి అన్నిదేశాల క్రికెట్ బోర్డులు జాతీయ, అంతర్జాతీయ, లీగ్ మ్యాచ్‌లలో వికెట్లు, బెయిల్స్‌లో ఎల్ఈడీ లైట్లను అమర్చి వాడడం మొదలు పెట్టాయి. దీని వల్ల బంతి వికెట్లకు తాకిందా, లేదా, ఏ క్షణంలో తాకింది.. వంటి వివరాలు తెలుస్తాయి. అంపైర్లు మరింత కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే అన్ని దేశాల కన్నా మన దేశంలోనే ఎల్ఈడీ వికెట్లు, బెయిల్స్ ఖరీదు ఎక్కువగా ఉండడం విశేషం.
Advertisements