Advertisement
హాస్పిటల్ లో ఉన్న నాన్న కోసం….మందులు తీసుకెళుతున్నాను. సడెన్ గా ఓ వ్యక్తి నా చేతిలో ఉన్న మందుల సంచితో పాటు నా పర్స్ ను కూడా లాక్కొని పారిపోయాడు.! ఆ రోజే నాకు జీతం వచ్చింది. జీతం డబ్బులు ఆ పర్స్ లోనే ఉన్నాయి. ఆ బాధతో అక్కడే కూర్చొని ఏడుస్తుంటే చాలా మంది పోగయ్యారు. కానీ ఎవ్వరూ నాకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు.
మందులు లేకుండా నా ముఖాన్ని నాన్నకు చూపించడం ఇష్టంలేక ఆ రాత్రి ఇంటికొచ్చేశాను. ఉత్త చేతులతో నాన్నను ఎలా కలవాలి? తెల్లవారే వరకు ఆ మందులను ఎలా సంపాదించాలని ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోలేదు. ఉదయం టాయిలెట్ కు వెళ్లి వచ్చాక చూస్తే….మా ఇంటి అరుగు మీద మందులు, పోయిన నా పర్స్ కనిపించాయి. ఆశ్చర్యానికి గురయ్యాను.! చుట్టు పక్కల వాళ్లను అడిగాను. అందరూ తమకు తెలియదన్నారు.
మరుసటి రోజు మా అరుగు మీద…. రకరకాల పండ్లు కనిపించాయి. ఆ తర్వాతి రోజు….. చీర ఇంకో రోజు….. వంట సామాను. ….. ఇలా 15 రోజుల పాటు రోజుకో కొత్త వస్తువు మా అరుగు మీద కనిపిస్తుండేది. ఎన్ని సార్లు ప్రయత్నించినా వాటిని మా అరుగు మీద ఎవరు పెడుతున్నారో కనుక్కోలేక పోయాను.
Advertisement
16 వ రోజు రాత్రంతా నిద్రపోకుండా మా ఇంటి ముందున్న చిన్న గోడ దగ్గర దాక్కొని ఉన్నాను. రాత్రి 2 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి మెల్లిగా మా ఇంటివైపు నడుచుకుంటూ రావడాన్ని గమనించాను. రోజూ లాగే ఈ సారి అతడు మా అరుగు మీద గాజులు పెట్టి వెనక్కి తిరిగాడు…అతని వెనుక ఉన్న నన్ను చూసి షాక్ అయ్యాడు.! ఎవరు నువ్వు, మాకెందుకు సహాయం చేస్తున్నావని నిలదీశాను.
Advertisements
మీ పర్స్ కొట్టేసిన దొంగను నేనే. ఎవరికి పుట్టానో తెలియదు..చిన్నప్పటి నుండి దొంగతనాలు చేస్తూనే పెరిగాను. కానీ మీ చేతిలో మందుల సంచిని, పర్స్ ను కొట్టేశాక..మీరు రోడ్డు మీద ఏడ్చిన ఏడ్పులు నన్ను కదిలించాయి. తండ్రి కోసం మీరు పడే అవేదన నన్ను ఆలోచింపజేశాయి. చిన్నప్పటి నుండి కుటుంబం గురించి తల్లిదండ్రుల గురించి తెలియకుండానే పెరిగాను. ఒక్కసారిగా మీ ఏడ్పు నాలో మార్పుని కలిగించింది. ఆ రోజు రాత్రి నుండే దొంగతనాలు మానేసి కష్టపడి పనిచేస్తున్నాను..అలా వచ్చిన డబ్బుతోనే ఇవన్నీ తెస్తున్నానని చెప్పాడు.
Advertisements
అతడి నిజాయితీ నాకు నచ్చేసింది. అక్కడే..అతని చేతలతో గాజులు తొడిగించుకొని అతనికి భార్యనయ్యాను. 5 ఏళ్లుగా మా బంధం కొనసాగుతుంది. వీధిబాలుడిగా చిన్నప్పటి నుండి నా అనే వారి ప్రేమకు దూరమైన అతడికి నా ప్రేమతో ఆ లోటు తీరుస్తున్నాను. ప్రేమ- మానవత్వం మనిషి మనస్సును ఎలా మారుస్తాయో అనడానికి ఉదాహరణే నా ఈ జీవితం.!