Advertisement
బిర్యానీ, హలీం వంటి ఎన్నో నోరూరించే వంటకాలకు హైదరాబాద్ మహానగరం ప్రసిద్ధిగాంచింది. ఇక్కడి ఎన్నో హోటల్స్, రెస్టారెంట్లలో ప్రత్యేకమైన హైదరాబాద్ రుచులను భోజన ప్రియులకు వడ్డిస్తుంటారు. అయితే ఆయా వంటకాల్లో మొహర్రం సందర్భంగా తయారు చేసే దమ్-కె-రోట్ కూడా ఎంతగానో ప్రాముఖ్యతను సంతరించుకుంది. మిగిలిన వంటకాలు ఏడాది మొత్తం మీద లభిస్తాయి. కానీ దమ్-కె-రోట్ మాత్రం కేవలం మొహర్రం సీజన్‌లోనే లభిస్తాయి.
దమ్-కె-రోట్‌లు నిజానికి ఓ రకమైన బిస్కెట్లని చెప్పవచ్చు. వీటిని కుకీస్ అని కూడా అంటారు. గోధుమ పిండి, సూజి, వెజిటబుల్ ఆయిల్స్, చక్కెర, తేనె, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేసి వీటిని బేక్ చేస్తారు. హైదరాబాద్ నగరంలోని అనేక ప్రముఖ బేకరీలలో దమ్-కె-రోట్‌లు లభిస్తున్నాయి. ఇక కరోనా నేపథ్యంలో రంజాన్ మాసంలో హలీంను రెస్టారెంట్లు విక్రయించలేదు. కానీ ప్రస్తుతం ఆంక్షలను సడలిస్తుండడం, మరోవైపు జనాలు బేకరీ ఐటమ్‌లను ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తుండడంతో దమ్-కె-రోట్‌లను బేకరీలు విక్రయిస్తున్నాయి.
Advertisement
అయితే ప్రతి ఏటా హలీం లాగే దమ్-కె-రోట్‌లను కూడా అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలకు హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తారు. కానీ ఈసారి కరోనా వల్ల దమ్-కె-రోట్‌లను ఎగుమతి చేయడం లేదు. దీంతో విక్రేతలు ఈసారి 30 నుంచి 40 శాతం వ్యాపారం తగ్గిందని అంటున్నారు. ఇక దమ్-కె-రోట్‌లకు 70 ఏళ్ల చరిత్ర ఉంది. ఒకప్పుడు హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన మనవడు ముకర్రం జాహ్ బహదూర్ ఆరోగ్యం కోసం దమ్-కె-రోట్‌లను తయారు చేసి మొహర్రం సందర్బంగా ఆలం సమర్పించాడట. దీంతో అప్పటి నుంచి జనాలు దమ్-కె-రోట్‌లను ఆలం కింద సమర్పిస్తూ వస్తున్నారు. అలా ఆ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.
కాగా నగరంలో పిస్తా హౌస్ వంటి పలు బేకరీలు దమ్-కె-రోట్‌లలో కుంకుమ పువ్వు, మరిన్ని డ్రై ఫ్రూట్స్, ప్యూర్ నెయ్యి, ఖోయా, రవ్వ తదితర పదార్థాలను వేసి దమ్-కె-రోట్‌లను రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారంగా తయారు చేయడం మొదలు పెట్టాయి. దీంతో దమ్-కె-రోట్‌లకు భిన్నమైన రుచి కూడా వచ్చింది. ఈ క్రమంలోనే నగరంలోని అనేక బేకరీల్లో జనాలు ప్రస్తుతం భిన్న రకాల రుచులతో కూడిన దమ్-కె-రోట్‌లను ఆస్వాదిస్తున్నారు.
Advertisements
Advertisements