Advertisement
సోషల్ మీడియాలో ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఫేక్ వార్తలకు అడ్డు,అదుపూ లేకుండా పోయింది. అందులో ప్రచారమవుతున్న అనేక వార్తల్లో నకిలీవే ఉంటున్నాయి. దీంతో అసలు ఏది నిజమో, ఏది అబద్దమో జనాలకు తెలియకుండా పోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ వార్త నిజమే అనిపించేలా ప్రచారమైంది. కానీ వెరిఫై చేశాక అది అవాస్తవమని తేలింది.
బురఖా ధరించిన ఓ యువతి చెయిర్‌లో కూర్చుని ఉండగా.. ఆమె చుట్టూ పోలీస్ ఉన్నతాధికారులు నిలుచుని ఉన్నారు. ఈ క్రమంలో ఈ ఫొటోకు కొందరు తప్పుడు వార్తను జతచేసి ప్రచారం చేశారు. ఉర్దూ మీడియంకు చెందిన మొదటి ముస్లిం మహిళా ఐపీఎస్ ఆఫీసర్ అయిన ఆమె తొలి రోజు డ్యూటీలో చేరిందని, కానీ పోలీస్ డ్రెస్‌కు బదులుగా బురఖా ధరించి నిబంధనలను ఉల్లంఘించిందని.. ఓ వార్తను ఆ ఫొటోకు జత చేసి చాలా మంది ప్రచారం చేశారు. అయితే వెరిఫై చేశాక ఈ వార్త ఫేక్ అని వెల్లడైంది.
Advertisement
చిత్రంలో ఉన్నది మహారాష్ట్రలోని బుల్ధానాకు చెందిన 14 ఏళ్ల సహ్‌రిష్ కన్వాల్ అనే బాలిక. మార్చి 8న జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ ప్రాంతంలో ఉన్న పలు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న ప్రతిభావంతులైన బాలికలకు అలా ఒక్క రోజు పాలన విభాగంలో ముఖ్య అధికారులుగా ఉండి బాధ్యతలు నిర్వర్తించేలా అవకాశం కల్పించారు. అందులో భాగంగానే బుల్ధానా జిల్లాలోని మల్కాపూర్ తాలూకాలో ఉన్న జిల్లా పరిషత్ ఉర్దూ హైస్కూల్‌లో చదువుతున్న సహ్‌రిష్ కన్వాల్‌కు ఒక్క రోజు ఆ జిల్లా ఎస్పీగా ఉండే అవకాశం కల్పించారు. దీంతో ఆమె ఎస్పీ కార్యాలయంలో ఆ సీట్‌లో కూర్చుంది. అప్పుడు తీసిందే ఆ ఫొటో.
మహిళా సాధికారత కోసం, బాలికలను చదివించాలని, రక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు ఆ రోజు అలా వినూత్న కార్యక్రమం చేపట్టారు. కానీ కొందరు దానికి వేరే విధంగా ఫేక్ వార్తను జోడించి ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఆ ఫొటోను పరిశీలించి వెరిఫై చేశాక అదంతా వట్టిదే అని.. ఫేక్ వార్త అని వెల్లడైంది. అవును.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు విపరీతంగా ప్రచారమవుతున్నాయి. కనుక ఇలాంటి వార్తలను నమ్మే ముందు ఒక్కసారి వెరిఫై చేసుకోవడం ఉత్తమం.
Advertisements
Watch Video:
Advertisements