Advertisement
భారతదేశంలో ఒకప్పుడు అనేక రాజ్యాలను అనేక మంది మహావీరులైన రాజులు పరిపాలించారు. అత్యంత శౌర్య పరాక్రమాలు కలిగిన రాజులు రాజ్యాలను ఏలారు. అయితే కేవలం మహారాజులే కాదు.. కొందరు మహారాణులు కూడా అప్పట్లో గొప్ప యోధుల్లా రాజ్యాలను పరిపాలించారు. యుద్ధాలు చేసి శత్రువులను చీల్చి చెండాడారు. అలాంటి గొప్ప మహారాణుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. రాణి దుర్గావతి, గొండ్వానా:
రాజ్‌పూత్ చక్రవర్తి కీరత్ రాయ్ కుటుంబంలో రాణి దుర్గావతి మారవి జన్మించింది. ఈమెకు, గోండు వంశానికి చెందిన సంగ్రామ్ షా పెద్ద కుమారుడు దల్‌పత్ షాకు 1542వ సంవత్సరంలో వివాహం అయింది. 1550లో భర్త చనిపోయాక ఈమె రాజ్యపాలన బాధ్యతలు తీసుకుంది. అయితే మొగల్ సైన్యాధిపతి ఖ్వాజా అబ్దుల్ మాజిద్ అసఫ్ ఖాన్‌కు, ఈమెకు మధ్య జరిగిన యుద్ధంలో ఈమె ఘన విజయం సాధించింది. వారికి భారీ సైన్యం, మందు గుండు సామగ్రి ఉన్నా రాణి దుర్గావతి సైన్యాన్ని ఏమీ చేయలేకపోయారు. రాణి దుర్గావతి సైనికుల పరాక్రమం ముందు మొగల్ సైనికులు నిలబడలేకపోయారు. ఫలితంగా రాణి దుర్గావతి ఆ యుద్ధంలో అపూర్వ విజయం సాధించింది.
2. రాణీ రుద్రమదేవి, కాకతీయ సామ్రాజ్యం:
Advertisements
తెలుగు వారందరికీ రాణీ రుద్రమదేవి గురించి తెలుసు. కాకతీయ సామ్రాజ్య చక్రవర్తి గణపతి దేవుడికి ఈమె జన్మించింది. ఈమె ఆడపిల్ల అయినా మొదట్లో మగవేషం వేసి పెంచారు. దీంతో ఆమె ఇతర రాజుల్లాగే అన్ని విద్యలు నేర్చుకుని యోధురాలిలా మారింది. ఈమెకు 14 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు తండ్రి చనిపోగా.. ఈమె రాజ్య పాలన బాధ్యతలు చేపట్టింది. ఎంతో మంది రాజులను ఓడించింది. చాలా మందికి నిద్రలేకుండా చేసింది. మగవారే రాజ్యాలను ఏలిన సమయంలో రుద్రమదేవి యోధురాలిలా కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించింది.
3. మహారాణి తారాబాయి:
Advertisement
ఛత్రపతి శివాజీ కుమారుడు రాజారాం భార్యే మహారాణి తారాబాయి. 1700వ సంవత్సరంలో తన భర్త చనిపోయాక తానే రాజ్య పాలన భారం వహించింది. తన కుమారుడికి శివాజీ 2 అని నామకరణం చేసి అతని ద్వారా తాను రాజ్యాన్ని పాలించింది. మొగల్ చక్రవర్తులకు అప్పట్లో ఈమె ఎదురొడ్డి పోరాడింది. మరాఠా రాజ్యాలను రక్షించింది. తన భర్త చనిపోయాడని ఈమె దుఃఖించకుండా రాజ్యపాలన బాధ్యతలు వహించింది. మరాఠా రాజులందరినీ ఏకతాటిపైకి తెచ్చి వారందరితో కలిసి ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాడింది. ఈ క్రమంలో ఔరంగజేబు మొదట మరాఠా కోటలను స్వాధీనం చేసుకున్నా.. మరాఠా రాజులందరి శక్తి ముందు నిలబడలేకపోయాడు. తిరిగి ఆ కోటలను మరాఠా రాజులు సొంతం చేసుకున్నారు. దీంతో వారి శక్తి ముందు నిలబడలేకపోతున్నానని చెప్పి ఔరంగ జేబు 1705వ సంవత్సరంలో యుద్ధం మానుకుని తన సైన్యంతో వెనుదిరిగాడు. ఈ ఘనత అంతా రాణి తారాబాయికే దక్కుతుంది. దీన్నే గ్రేట్ మరాఠా వార్ అని కూడా అంటారు.
4. రాణీ లక్ష్మీబాయి:
1857లో భారతదేశంలో బ్రిటిష్ వారిపై సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు బ్రిటిష్ వారికి ఎదురుగా ముందు వరుసలో పోరాడింది లక్ష్మీబాయి. మన దేశంలో ఎంతో మంది మహిళలకు ఈమె ఇప్పటికీ ప్రేరణగా నిలుస్తోంది. ఝాన్సీ రాణీ లక్ష్మీబాయి తనకు 23 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే యుద్ధంలో పోరాడి వీరమరణం పొందింది. బ్రిటిష్ వారితో చేసిన యుద్ధాల్లో ఈమె ఎనలేని ధైర్య సాహసాలను ప్రదర్శించింది. పసికందుగా ఉన్న తన కుమారున్ని వీపుకు కట్టుకుని యుద్ధం చేసిన వీరవనితగా పేరుగాంచింది. నిజానికి ప్రపంచ చరిత్రలోనే బహుశా ఏ రాణీ ఈమెలా యుద్ధం చేసి ఉండదు. చిన్నతనంలో పిల్లలకు ఈమె ధైర్య సాహసాల గురించి చెబుతూ ప్రేరణ కలిగిస్తుంటారు. ఈమె ఓ గొప్ప యోధురాలు.
5. మహారాణి అహిల్యాబాయి హొల్కర్:
వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించిన ఘనత ఈమెకే దక్కుతుంది. ధైర్య సాహసాలను ప్రదర్శించడంలోనూ ఈమె పెట్టింది పేరు. అనేక దశాబ్దాల పాటు ఈమె ఇండోర్ సామ్రాజ్యాన్ని పరిపాలించింది. ఇండోర్ చరిత్రలోనే ఆమె పరిపాలనా కాలాన్ని స్వర్ణ యుగంగా చెబుతారు. 1754లో తన భర్త ఖాందేరావు హొల్కర్, 1766లో మామ మల్హారావు హొల్కర్‌లు చనిపోయారు. దీంతో 1767లో ఆమె రాజ్య పాలన బాధ్యతలు చేపట్టింది. ఆమె పాలనలో ఆ రాజ్యం ఎంతో అభివృద్ధి చెందింది. దీంతో ఇతర రాజ్యాలకు చెందిన రాజులకు అసూయ పుట్టింది. అయినప్పటికీ వారు ఆమె పరాక్రమాల ముందు నిలబడలేకపోయారు. సాక్షాత్తూ మరాఠా సామ్రాజ్యానికి చెందిన పీష్వా రఘోబా ఆమెతో యుద్ధం చేయలేక రణరంగానికి వచ్చి మరీ యుద్ధం మానుకుని నెల రోజుల పాటు ఆమె ఆతిథ్యం స్వీకరించి తరువాత సొంత రాజ్యానికి వెళ్లిపోయాడు. ఇలా అనేక మంది రాజులకు ఈమె వెన్నులో వణుకు పుట్టించింది.
Advertisements