Advertisement
నన్ను నవమాసాలు మోసింది అమ్మే కానీ, అమ్మను,అమ్మ కడపులోని నన్ను ఆ 9 నెలలు కంటికి రెప్పలా కాపాడింది మాత్రం నువ్వే కదా నాన్న. నడక నేర్చుకునే క్రమంలో నా అడుగులు తడబడుతుంటే, ఎక్కడ కిందపడిపోతానో అని నీ కళ్లలో కలిగిన భయం నాకింకా గుర్తుంది నాన్న.
నే నడక నేర్చుకుంది, నీ గుండెలపైన… నే రాజుగా ఊరేగా నీ భుజాలపైన. పండగకు కొత్త బట్టలు లేవని నే అలిగినప్పుడు, అమ్మ మెడలోని తులం బంగారాన్ని రాం లాల్ సేట్ కొట్టులో తాకట్టు పెట్టిన గతాన్ని నేనలా మరవగలను నాన్న.
నా కాన్వెంట్ సీటు నుండి ఇంజనీరింగ్ వరకు , నా చదువు కోసం… ఉన్న అయిదు ఎకరాలు అప్పిచ్చిన రెడ్డిగారి వశం అయినా, నువ్వు నాకు ఓ మాటైనా చెప్పలేదేంది నాన్న, విదేశాల్లో MS చేస్తానని చెప్పగానే అన్ని ఏర్పాట్లు చేసి నా చేతిలో విమానం టిక్కెట్లు పెట్టావ్. నా విదేశీ చదువు కోసం మన ఊరి దగ్గర్లోని టౌన్ హాస్పిటల్ లో నీ కిడ్ని అమ్మబడిందని లేటు గా తెలుసుకున్నాను నాన్న.
Advertisement
త్యాగాలు నేర్పావ్, పోరాట స్పూర్తి నింపావ్, బాధలను, బంధాలను రెండింటిని బాలెన్స్ చేస్తూ నడిచావు, నడిపించావ్, నా దారి పూల బాట కావాలని, నువ్వే ముందు నడిచి ఆ బాట లోని ముళ్లను, రాళ్లను ఏరి పారేసావ్… ఎందుకు నాన్న నేనంటే అంత ప్రేమ అంటే, మా నాన్నవురా నువ్వు అని నుదుటి పై ఓ వెచ్చని ముద్దిచ్చావ్. నే తడిమినప్పుడల్లా ఆ ముద్దు తాలుకూ తడి… ఇంకా తగులుతూనే ఉంది నాన్న.
Advertisements
నాన్న ఇప్పుడు నా చేతిలో అయిదంకెల జీతం ఉంది, నాలుగు చక్రాల కార్లో నిన్ను ఊరు మొత్తం తిప్పాలని ఉంది. కానీ ఊరి చివరి స్మశానం నన్ను వెక్కిరిస్తోంది. అందులో అప్పుడే సున్నం వేసిన నీ సమాధి నన్ను ఆశీర్వదిస్తోంది. నువ్వు ఇంకా ఎత్తుకు ఎదుగు బాబూ అని….
ఎత్తుకు ఎదిగి ఏం లాభం నాన్న, జీతం పెరుగుతుందేమో, నువ్వు లేని నా జీవితపు లోటు పూడ్చుతుందా? నాన్న ఇప్పుడు నాదొకే ఒక కోరిక నా కడుపున కొడుకుగా పుట్టు …. నా గుండెలపై ఆడుకోడానికి, మా నాన్నను గుండెల్లో పెట్టి చూసుకునే అవకాశం ఇవ్వడానికి.
- BY : Azzu Azharuddin
Advertisements