Advertisement
మన దేశంలోని సుప్రసిద్ధ, చారిత్రాత్మకమైన ఆలయాల్లో ఏపీలో ఉన్న లేపాక్షి ఆలయం కూడా ఒకటి. అనంతపురం నుంచి సుమారుగా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేపాక్షి గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడి ఆలయంలో స్వామి వారిని వీరభద్ర స్వామిగా కొలుస్తారు. దీన్ని విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజులు క్రీస్తుశకం 16వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయంలో ఉన్న మండపాల్లో అద్భుతమైన శిల్పకళానైపుణ్యం మనకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
ఆలయ ప్రాంగణంలో భారీ రాతితో చెక్కబడిన నంది విగ్రహం ఉంటుంది. ఇది ఆలయానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
ఆలయంలో 70 స్తంభాలు ఉంటాయి. కానీ ఒక్క స్తంభం మాత్రం నేలకు పూర్తిగా ఆనుకోకుండా ఉంటుంది. స్తంభం అడుగు భాగంలో మనం ఖాళీ ప్రదేశాన్ని గమనించవచ్చు. అయితే ఈ స్తంభం కిందకు ఆనకుండా అలా గాల్లోనే ఎందుకు ఉందో ఇప్పటికీ సైంటిస్టులకు అంతుబట్టని మిస్టరీగానే మారింది. దీన్ని బ్రిటిష్ వారి హయాంలో కదిలించడానికి యత్నించారట. కానీ అది కొద్దిగా స్థానభ్రంశం చెందిందే తప్ప అక్కడి నుంచి అస్సలు కదలలేదు. దీంతో ఈ ఆలయంలో ఈ స్తంభం అతి పెద్ద మిస్టరీగానే ఉండిపోయింది.
Advertisements
Advertisement
లేపాక్షి ఆలయంలో ఉండే ఈ వేలాడే స్తంభాన్ని చూసేందుకే చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. దాని కింద వస్త్రాలను, ఇతర వస్తువులను ఉంచి అటు, ఇటు దొర్లిస్తూ సంతోషిస్తుంటారు.
Advertisements
అయితే ఆ స్తంభం ఒక్కటే అలా వేలాడుతూ ఎందుకు ఉందనే విషయంపై పలువురు వివరణ ఇచ్చారు. భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆలయంలోని ఇతర స్తంభాలు కదిలితే వాటిని ఆపేందుకు ఈ ఒక్క స్తంభం ఉపయోగపడుతుందట. అందుకనే దాని కింద అలా ఖాళీ వదిలారట.
ఇక సీతాదేవిని రావణాసురుడు ఆకాశమార్గంలో తీసుకువెళ్తుంటే ఆమెను కాపాడబోయిన జటాయువు అనే పక్షి ఇక్కడే పడిందట. అదే సమయంలో శ్రీరాముడు పక్షిని లేవాలని పిలిచాడట. లే.. పక్షీ.. అన్నాడట. దీంతో ఈ ప్రాంతానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతారు.