Advertisement
నా కూతురు బతుకుతుందని ఎవరూ అనుకోలేదు. నాకు పెళ్లయిన 10 సంవత్సరాలకు సంతానం కలిగింది. నాకు నా కూతురు నెలలు నిండకుండానే జన్మించింది. 3 నెలలు ముందుగా నాకు డెలివరీ అయింది. దీంతో నా బిడ్డ బతకదని, ఆమెను విడిచిపెట్టాలని, ఆమెకు దూరంగా ఉండాలని నాకు గ్రామస్థులు సూచించారు. అయినా నేను వినలేదు. నా బిడ్డ నాతోనే ఉంటుందని వారికి చెప్పా. అయితే అలా ఉంటే బిడ్డ చనిపోతే నేను తీవ్రంగా కుంగిపోతానని కూడా గ్రామస్థులు అన్నారు. అయినా నేను వినలేదు. వారితో గట్టిగా వాదించా. నా బిడ్డ బతుకుతుందని చెప్పా. నా భర్త నాకు సహకరించాడు. దీంతో ఇద్దరం గ్రామం విడిచి దూరంగా వెళ్లిపోయాం.
నా బిడ్డను రక్షించుకునేందుకు నా భర్త ఏం చేయడానికైనా, ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధమేనని చెప్పాడు. అది నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. నా బిడ్డ నా నుంచి దూరం కాదని నా హృదయం చెబుతోంది. నా బిడ్డ నా కలల ప్రతి రూపం అని ఎవరికీ తెలియదు. ఆమె నాలో పురుడు పోసుకోకముందే నాతో ఎన్నో సంవత్సరాల నుంచి కలసి ఉంది. నా బిడ్డ నాకు కొత్త కాదు. నా బిడ్డ ముఖాన్ని నేను పుట్టకముందే చూశా. మేం ఓ సిటీకి వచ్చాం. 6 నెలల పాటు నాకు, నాభర్తకు నా బిడ్డ ఆరోగ్యం పట్ల ఆందోళన ఉండేది. మేం రోజూ నిద్ర కూడా సరిగ్గా పోయే వాళ్లం కాదు.
Advertisement
అలాంటి స్థితిలో ఒక రోజు నా బిడ్డకు ఒక రాత్రి శ్వాస తీసుకోవడం కష్టతరమైంది. ఆమెను నా ఒడిలోనే పడుకోబెట్టుకుని రాత్రంతా జాగ్రత్తగా చూసుకున్నా. నా బిడ్డ వైద్యం కోసం నా భర్త తనకున్న ఒక్క రిక్షాను అమ్మేశాడు. రాను రాను నా బిడ్డ ఆరోగ్యం క్షీణించసాగింది. ఊపిరి తీసుకోవడం కష్టమైంది. నన్ను విడిచివెళ్లవద్దని నా బిడ్డతో రోజూ అనేదాన్ని. నేను ఎంతకాలం నుంచి తన కోసం వేచి చూస్తున్నానో తనకు చెప్పేదాన్ని. నేను తనను ఎంత ప్రేమిస్తున్నానో తనకు వివరించేదాన్ని. నా భర్త నా మాటలను విని మౌనంగా ఉండిపోయేవాడు.
Advertisements
ఒక రోజు రాత్రి నా భర్త నా బిడ్డను జాబిల్లిలా ఉన్నావని అన్నాడు. చంద్రబింబం లాంటి ముఖం ఉందని చెప్పాడు. అందుకే ఆమెకు చాందినీ అని పేరు పెట్టాం. ఆశ్చర్యం.. నా బిడ్డ బతికింది. ఇప్పుడామెకు 5 సంవత్సరాలు. ఆ రోజు రాత్రి నేను ప్రార్థించిన దేవుడు నన్ను కనికరించాడు. అందువల్లే నా బిడ్డ ఇప్పుడు నా ఎదుట సజీవంగా ఉంది. ఆమె ముఖంలో ఉండే చిరునవ్వే నన్ను ఇప్పటికీ బతికిస్తోంది.
Advertisements