Advertisement
భారత్‌లో మహిళా రూపంలోని శక్తిని దేవతగా కొలుస్తారు. అలాగే భారతదేశాన్ని భారత మాతగా అభివర్ణిస్తూ కీర్తిస్తారు. భరతమాత ముద్దు బిడ్డలం అని భారతీయులందరూ చెప్పుకుని గర్వపడతారు. భారత్ మాతా కీ జై అంటే.. అది యుద్ధ నినాదం.. మన తల్లికి, ఆ రూపంలోని దేశానికి గౌరవం ఇచ్చినట్లు. అయితే ఈ నినాదం ముందుగా వచ్చింది 1905లో. అప్పట్లో బెంగాల్‌లో బ్రిటిష్ వారు హిందు, ముస్లింలను విడగొట్టి (డివైడ్ అండ్ రూల్) పాలించాలని అనుకున్నారు. దీంతో భారత్ మాతాకీ జై అనే నినాదం పుట్టుకొచ్చింది. అందుకు బెంగాల్‌కు చెందిన ప్రముఖ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ మేనల్లుడు అబనీంద్రనాథ్ ఠాగూర్ వేసిన భరత మాత పెయింటింగే కారణం. దాని ఆవిర్బావం వెనుక అద్భుతమైన కథ దాగి ఉంది.
1905లో బెంగాల్‌లో అప్పటి భారత వైశ్రాయ్ లార్డ్ కర్జన్ హిందు, ముస్లింలను మతపరంగా విడగొట్టి రెండు వేర్వేరు ప్రాంతాల్లో వారిని ఉంచి పరిపాలించాలని అనుకున్నాడు. కానీ దీని వెనుక ఉన్న కుట్ర.. డివైడ్ అండ్ రూల్‌ను ప్రజలు పసిగట్టారు. దీంతో భారత స్వాతంత్ర్య ఉద్యమం ఆ ప్రాంతంలో ఉవ్వెత్తున ఎగిసింది. 1875 లో బంకిం చంద్ర ఛటర్జీ రాసిన వందే మాతరంను ప్రేరణగా తీసుకుని దేశాన్ని భరతమాతగా అభివర్ణిస్తూ అబనీంద్ర ఠాగూర్ ఆ దేవతకు ఒక రూపం ఇచ్చారు. దీంతో భరత మాత పెయింటింగ్ ఆవిష్కృతమైంది. అందులో ఆ దేవత కాషాయ వస్త్రాలను ధరించి నాలుగు చేతులను కలిగి ఉంటుంది. చేతుల్లో పుస్తకం, వరి కంకులు, మాల, తెల్లని వస్త్రాన్ని పట్టుకుని ఉంటుంది.
Advertisement
అయితే ఆ పెయింటింగ్‌ను చూసిన స్వామి వివేకానంద శిష్యురాలు నివేదిత అందులో ఏదో శక్తి దాగుందని గ్రహించింది. దీంతో ఆమె ఆ పెయింటింగ్‌లో ఉన్న భరతమాత బొమ్మతో పోస్టర్లను ప్రింట్ చేయించి బెంగాల్ అంతటా వాటిని ప్రచారం చేయించింది. గోడలపై వాటిని అతికింపజేసింది. బ్యానర్లను కట్టించింది. ఈ క్రమంలో 1909 వరకు భరత మాత చిత్రానికి దేశమంతటా ప్రాచుర్యం లభించింది. అందులో భాగంగానే ఉత్తరప్రదేశ్‌లో భరతమాత చిత్రాలతో భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేస్తూ స్వాతంత్ర్యం కోసం ఆందోళనలు చేపట్టారు. అలాగే మద్రాస్‌లో నివేదిత శిష్యులు ఆ బొమ్మను విస్తృతంగా ప్రచారం చేశారు. అటు బాంబే, పంజాబ్‌లలోనూ లోక్‌మాన్య తిలక్, లాలా లజపతి రాయ్‌లు భరతమాత చిత్రంతో ఆందోళనలు చేపట్టారు. అలా భరతమాత చిత్రం, భారత్ మాతా కీ జై అనే నినాదం.. దేశవ్యాప్తమయ్యాయి.
Advertisements
Advertisements
ఇక 1918లో బనారస్‌లో భరతమాత మందిరాన్ని నిర్మించగా.. దాన్ని మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, అబ్దుల్ గఫర్ ఖాన్‌లు ప్రారంభించారు. కాగా కాలక్రమేణా మనకు స్వాతంత్ర్యాన్ని సాధించిపెట్టిన గాంధీ, నెహ్రూ, భగత్‌సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులతోపాటు భరతమాత్ర చిత్రపటాన్ని కూడా పూజించడం మొదలు పెట్టారు. అయితే కోల్‌కతాలో రవీంద్ర భారతి సొసైటీకి చెందిన సేకరణలో అబనీంద్ర ఠాగూర్ అప్పట్లో గీసిన భరత మాత ఒరిజినల్ పెయింటింగ్‌ను మనం ఇప్పటికీ చూడవచ్చు. అలా భరత మాతను అప్పటి నుంచి మనం గుర్తు చేసుకుంటూనే ఉన్నాం.. ఆమె మనలో ఒక భాగం..!