Advertisement
త్రయంబకేశ్వర్ ఆలయం.. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉంది.. ఇది అత్యంత పురాతనమైన ఆలయం. నాసిక్ నుంచి సుమారుగా 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలో శివున్ని పూజిస్తారు. దేశంలోని మొత్తం 12 జ్యోతిర్లింగాల్లో ఇది కూడా ఒకటి. అయితే ఒకప్పుడు ఈ ఆలయంలో శివలింగానికి అత్యంత ఖరీదైన, అమూల్యమైన వజ్రం అమర్చబడి ఉండేది. దాన్ని శివుడి కన్నుగా కూడా భావించేవారు. కానీ ఇప్పుడా వజ్రం లెబనాన్‌లో ఉంది. ఇంతకీ అసలు ఆ వజ్రం ఇక్కడి నుంచి అక్కడి వరకు ఎలా వెళ్లింది ? అంటే..
నాసిక్ త్రయంబకేశ్వర ఆలయంలో ఒకప్పుడు ఉన్న వజ్రాన్ని నసక్ వజ్రం అని పిలిచేవారు. చాలా ఏళ్ల పాటు ఆ వజ్రం ఆ ఆలయంలో ఉండడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. 15వ శతాబ్దంలో తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో అమరగిరి గనుల్లో ఆ వజ్రాన్ని మొదటిసారిగా తవ్వి వెలికి తీశారు. అప్పట్లో అది 89 క్యారెట్ల పరిమాణంలో ఉండేది. అయితే ఆ వజ్రాన్ని 1725వ సంవత్సరంలో నానా పీష్వా త్రయంబకేశ్వర్ ఆలయానికి బహుమతిగా ఇచ్చాడు. తాను అక్కడి కోటపై దాడి చేసి గెలిస్తే వజ్రం ఇస్తానని చెప్పాడు. అతను అన్నట్లుగానే గెలిచాడు. అనంతరం అతను ఆ వజ్రాన్ని ఆలయానికి ఇచ్చేశాడు. అప్పటి నుంచి 92 ఏళ్ల పాటు ఆ వజ్రం త్రయంబకేశ్వర ఆలయంలోనే ఉంది. ఆ సమయంలోనే దానికి నసక్ అని పేరు వచ్చింది.
ఇక 1817వ సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి మరాఠా రాజులకు యుద్ధం మొదలైంది. దాన్ని 3వ ఆంగ్లో-మరాఠా యుద్ధం అని పిలుస్తారు. అప్పట్లో బ్రిటిష్ వారిదే యుద్ధంలో పైచేయి అయింది. 1818లో రెండో బాజీరావు పీష్వా బ్రిటిష్ వారితో యుద్ధంలో ఓడిపోయాడు. దీంతో అప్పటి వరకు తన ఆధీనంలో ఉన్న నసక్ వజ్రాన్ని అతను వారికి ఇచ్చేశాడు. యుద్ధంలో ఓడిపోయాడు కాబట్టి తన ప్రాణాలు తీయవద్దని కోరుతూ అతను ఆ వజ్రాన్ని బ్రిటిష్ వారికి ఇచ్చేశాడు. తరువాత ఆ వజ్రం అనేక మంది చేతులు మారింది.
Advertisements
Advertisement
రెండో బాజీరావు పీష్వా నుంచి నసక్ వజ్రాన్ని తీసుకున్న అప్పటి ఆంగ్ల కల్నల్ జె.బ్రిగ్స్ దాన్ని అప్పటి మొదటి మార్కస్ ఆఫ్ హేస్టింగ్స్ ఫ్రాన్సిల్ రాడోన్ కు ఇచ్చాడు. హేస్టింగ్స్ దాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చాడు. తరువాత అదే ఏడాది ఆ వజ్రాన్ని లండన్‌కు తరలించారు. అక్కడే దాన్ని డైమండ్ మార్కెట్‌లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు అమ్మేశారు. దాన్ని అప్పట్లో 3వేల పౌండ్లకు (ఇప్పుడు దాదాపుగా 1.98 లక్షల పౌండ్లు) రండెల్ అండ్ బ్రిడ్జి కొనుక్కున్నారు. వారు 13 ఏళ్ల తరువాత ఆ వజ్రాన్ని కట్ చేయించారు. 89.75 క్యారెట్ల పరిమాణం (17,950 ఎంజీ) ఉండేది 78.625 క్యారెట్లకు (15,725.0 ఎంజీ) చేరుకుంది. వజ్రం బరువులో 10 శాతం తగ్గింది. అనంతరం దాన్ని రండెల్ అండ్ బ్రిడ్జి 1831లో ఎమ్మాన్యుయెల్ సోదరులకు 7200 పౌండ్లకు (ఇప్పుడు 5.90 లక్షల పౌండ్లు) అమ్మారు. 1837లో ఎమ్మాన్యుయెల్ బ్రదర్స్ ఆ వజ్రాన్ని వెస్ట్ మినిస్టర్ మొదటి మార్కస్ రాబర్ట్ గ్రోస్‌వెనర్‌కు పబ్లిక్ సేల్‌లో అమ్మారు.
1886లో ఆ వజ్రం విలువ 30వేల నుంచి 40వేల పౌండ్ల (ఇప్పుడు 29.47 లక్షల పౌండ్ల నుంచి 39.30 లక్షల పౌండ్లు) మధ్య ఉండేది. మార్చి 1927లో దాన్ని వెస్ట్‌మినిస్టర్ డ్యుక్ అమెరికాకు చెందిన మేయర్స్, ఓస్టర్‌వాల్డ్ అండ్ ముహల్‌ఫెల్డ్ ఇంపోర్టర్ల ద్వారా పర్షియన్ జ్యువెల్లర్ జార్జ్ మౌబాస్సిన్‌కు అమ్మారు. 1929-30లలో నలుగురు దొంగల ముఠా ఈ వజ్రాన్ని కాజేయాలని రెండు సార్లు యత్నించి విఫలమయ్యారు. తరువాత 1970 ఏప్రిల్‌లో న్యూయార్క్‌లోని పార్కె-బెర్నెట్ గ్యాలరీలో ఆ వజ్రాన్ని ప్రదర్శనకు ఉంచారు.
1970 ఏప్రిల్ 16న నసక్ వజ్రాన్ని వేలంలో 5 లక్షల డాలర్లకు (ఇప్పుడు దాదాపుగా 3.08 మిలియన్ డాలర్లు) అమెరికాలోని కనెక్టికట్ అనే ప్రాంతంలో ఉన్న గ్రీన్ విచ్‌కు చెందిన ట్రక్ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఎడ్వార్డ్ జె.హ్యాండ్ కొన్నాడు. అనంతరం 1976 నవంబర్ నెలలో ఆ వజ్రాన్ని చారిటీ బెనిఫిట్ కింద ప్రదర్శనకు ఉంచారు. తరువాత నసక్ వజ్రం లెబనాన్‌కు చేరుకుంది. అక్కడి ఓ ప్రైవేటు మ్యూజియంలో ఆ వజ్రాన్ని భద్రపరిచారు. అలా ఆ వజ్రం ఇండియా నుంచి లెబనాన్‌కు చేరుకుంది. ఇక ఆ వజ్రం ఇప్పటికీ ఆరంభంలో ఎలా కాంతులు వెదజల్లేదో ఇప్పటికీ అలాగే ఉండడం విశేషం. అవును మరి.. అది ఎంతైనా వజ్రం కదా. అందుకని దాని ఆకర్షణ ఇప్పటికీ తగ్గలేదు. ఏది ఏమైనా అలాంటి పురాతనమైన, ఖరీదైన, విలువైన వజ్రాన్ని కోల్పోవడం నిజంగా మన దురదృష్టమేనని చెప్పవచ్చు.
Advertisements