Advertisement
భక్తులెవరైనా సరే.. సాధారణంగా తమ ఇష్ట దైవాలకు ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తుంటారు. కొందరు ఇండ్లలోనే తరచూ పూజలు చేస్తుంటారు. ఇక సహజంగా ఏ దేవుడికైనా.. దేవతకైనా.. ఆలయంలో చేసే ప్రదక్షిణలు ఒకే రకంగా ఉంటాయి. గర్భగుడి చుట్టూ చాలా మంది తిరుగుతారు. కనీసం 3 సార్లు అయినా ప్రదక్షిణలు చేస్తారు. కానీ శివుని ఆలయంలో మాత్రం ప్రదక్షిణలు చేసే విధానం వేరుగా ఉంటుంది. అది ఎలాగంటే…
చిత్రంలో చూశారు కదా.. గర్భగుడిలో శివలింగానికి ఎదురుగా నంది ఉంది. శివలింగంపై జలాన్ని అభిషేకిస్తే ఆ జలం కిందకు వెళ్తుంది. లింగం చుట్టూ ఉన్న ప్రదేశంలో పడ్డ నీరు కింది వైపుకు ఉన్న లింగం ఆకారం ద్వారా కిందకు ప్రవహిస్తుంది. దాన్నే చండీశ్వరుడి స్థానం అంటారు. అయితే శివాలయంలోకి వెళ్లగానే శివుడి గర్భగుడి చుట్టూ పూర్తి ప్రదక్షిణలు చేయరాదు. ముందుగా నంది వద్ద ప్రదక్షిణ ప్రారంభించాలి. అక్కడి నుంచి చండీశ్వరుడి స్థానం వద్దకు వెళ్లి ఆయన్ను దర్శించుకుని వెనక్కి రావాలి. అనంతరం చిత్రంలో చూపినట్లుగా బాణం గుర్తుల ప్రకారం ప్రదక్షిణ చేయాలి. ఒకసారి చండీశ్వరుడి స్థానం వద్దకు వెళ్లి వెనక్కి వచ్చి నందీశ్వరుడి వద్ద ఆగి అటు నుంచి గర్భగుడి మీదుగా లింగాన్ని అభిషేకించే జలం వద్దకు చేరుకోవాలి. అక్కడి నుంచి మళ్లీ వెనక్కి తిరగాలి. తిరిగి నంది వద్దకు వచ్చి ప్రదక్షిణ పూర్తి చేయాలి. మళ్లీ అక్కడే వెనక్కి తిరిగి అంతకు ముందు చెప్పినట్లే గర్భగుడిగా మీదుగా వెళ్లి చండీశ్వరుడి స్థానం చేరుకుని అటు నుంచి తిరిగి మళ్లీ వెనక్కి రావాలి. ఇలా 3 సార్లు ప్రదక్షిణం చేయాలి. దీంతో 10వేల సార్లు ప్రదక్షిణ చేసిన పుణ్య ఫలితం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
ఇక శివున్ని అభిషేకించిన జలం వెళ్లే దారి వద్ద (చండీశ్వరుడి స్థానం వద్ద) ప్రమథ గణాలు కొలువై ఉంటారని చెబుతారు. అందువల్ల ఆ స్థానం మీదుగా ప్రదక్షిణ పూర్తి చేయరాదు. అక్కడికి దాకా వెళ్లి వెనక్కి తిరిగి మళ్లీ వచ్చి నంది దాటి అదే స్థానానికి చేరుకుని అక్కడి నుంచి మళ్లీ వెనక్కి ప్రదక్షిణం చేయాలి. ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని అంటారు.
Advertisement
Advertisements
Advertisements
ఇక శివున్ని పూజించేందుకు కూడా ప్రత్యేకమైన సమయం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. సూర్యాస్తమయం జరిగే సమయానికి ముందు 48 నిమిషాలు, తరువాత 48 నిమిషాలు.. మొత్తం కలిపి 96 నిమిషాల సమయం పాటు శివపూజకు అనువుగా ఉంటుందట. ఆ సమయంలో శివున్ని పూజిస్తే మిక్కిలి ఫలితం పొందవచ్చని చెబుతారు. ఆ సమయాన్నే ప్రదోష కాలం అంటారు. ప్రదోషం అంటే పాపాలను తొలగించడం అన్నమాట. అంటే.. ఆ సమయంలో శివపూజ చేస్తే పాపాలు తొలగిపోతాయని అర్థం.
అలాగే ప్రతి నెలా ద్వాదశి ముగిసి త్రయోదశి ఆరంభం అయ్యే సమయం కూడా శివపూజకు అనువుగా ఉంటుంది. దీన్నే ప్రదోష వ్రత కాలం అంటారు. ఈ సమయంలో శివాలయానికి వెళ్లి పూజ చేస్తే చాలా ఫలితం ఉంటుందంటారు. ఇక ఉపవాసం ఉంటే ఎంతో మంచిదని చెబుతారు. సాధారణంగా త్రయోదశి రోజునే మాస శివరాత్రి వస్తుంది. ఇక మహాశివరాత్రి ముందు వచ్చే సమయాన్ని మహా ప్రదోష సమయం అని చెబుతారు. ఆ సమయం శివపూజకు అన్ని విధాలా మంచిదని చెబుతారు. ఇతర ప్రదోషాల కన్నా మహాప్రదోష సమయం చాలా ముఖ్యమైందని అంటారు. అందువల్ల ఆ సమయంలో పూజలు చేస్తే శివుడు మిక్కిలి సంతృప్తి చెందుతాడంటారు.
కాగా ప్రదోష సమయాల్లో శివుడికి అభిషేకం చేస్తే మంచిది. అందులోనూ పంచగవ్యం, పంచామృతాలతో శివున్ని అభిషేకిస్తే మంచిదని అంటారు. నెయ్యితో అభిషేకిస్తే మోక్షం కలుగుతుంది. పాలు అయితే దీర్ఘాయువు లభిస్తుంది. పెరుగు వల్ల సంతానం కలుగుతారు. తేనె వల్ల తియ్యని కంఠ స్వరం లభిస్తుంది. బియ్యప్పిండి వల్ల రుణ విముక్తులవుతారు. చెరుకు రసం వల్ల ఆరోగ్యం కలుగుతుంది. శత్రువుల బెడద ఉండదు. నిమ్మరసం వల్ల మరణ భయం పోతుంది. కొబ్బరినీళ్ల వల్ల జీవితం సుఖసంతోషాలమయమవుతుంది. అన్నం వల్ల కీర్తి పొందుతారు. చందనం అభిషేకం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. చక్కెరతో పూజ చేస్తే శత్రువులు నశిస్తారు. పంచామృతం వల్ల ధనం లబిస్తుంది. పంచగవ్యం వల్ల అన్ని పాపాలు హరించుకుపోతాయి.