Advertisement
మీరు ఏదైనా చిన్నపాటి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా ? లేదా కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా ? అయితే ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) కింద మీరు రుణం తీసుకోవచ్చు. ఈ పథకంలో భాగంగా గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. అయితే అందుకు గాను వ్యక్తులు కార్పొరేట్ రంగానికి చెంది ఉండకూడదు. అలాగే చిన్న, మధ్య తరహా పరిశ్రమల వారు అయి ఉండకూడదు. కేవలం వ్యక్తులకే ఈ పథకం కింద రుణాలు ఇస్తారు.
ఇక ముద్ర రుణాలను దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులు, ఆర్ఆర్‌బీలు, సూక్ష్మ ఫైనాన్స్ బ్యాంకులు, కో ఆపరేటివ్ బ్యాంకులు, ఎంఎఫ్ఐలు, బ్యాంకేతర ఆర్థిక సంస్థలు అందజేస్తాయి. ఆయా బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చెందిన శాఖలకు వెళ్లి ముద్ర రుణాలకు అప్లై చేయవచ్చు. అలాగే Udyamimitra.in అనే వెబ్‌సైట్‌లోనూ ముద్ర రుణం కోసం దరఖాస్తు చేయవచ్చు. దీన్ని సిద్‌బి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇందులో పలు భిన్న రకాల ముద్ర లోన్లను అందజేస్తారు.
Udyamimitra.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి హోం పేజీలో కిందకు స్క్రోల్ చేశాక.. అక్కడ ముద్ర లోన్స్ అనే బాక్స్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. అనంతరం https://www.udyamimitra.in/MudraLoan అనే కొత్త వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ముద్ర లోన్లకు సంబంధిచిన వివరాలు ఉంటాయి. మొత్తం 3 విభాగాల్లో ముద్ర లోన్లను అందిస్తారు.
Advertisement
1. శిశు – ఇందులో భాగంగా గరిష్టంగా రూ.50వేల వరకు రుణం ఇస్తారు. వ్యాపారం చిన్నగా ప్రారంభించాలనుకునే వారు ఈ రుణం పొందవచ్చు. లేదా వ్యాపారానికి స్వల్ప మొత్తంలో ధనం అవసరం అవుతుంది అనుకునేవారు ఈ రుణం పొందవచ్చు.
Advertisements
2. కిశోర్ – ఈ విభాగంలో ముద్ర లోన్‌కు అప్లై చేస్తే గరిష్టంగా రూ. 5 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఒక మోస్తరు వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ రుణం చక్కగా పనికొస్తుంది.
3. తరుణ్ – ఇందులో భాగంగా గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. కొంచెం భారీ స్థాయిలో వ్యాపారం చేయాలనుకునే వారు ఈ రుణం తీసుకోవచ్చు.
https://www.udyamimitra.in/MudraLoan సైట్‌లో కిందకు స్క్రోల్ చేస్తే.. Click here to apply అనే లింక్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మరొక కొత్త వెబ్ పేజీ వస్తుంది. అందులో లోన్ ఎంత కావాలి, పేరు, వ్యాపారం వివరాలు, చిరునామా.. తదితర వివరాలను నమోదు చేసి లోన్‌కు దరఖాస్తు చేయాలి. అనంతరం మీ రుణ దరఖాస్తును రుణాలిచ్చే ఆర్థిక సంస్థలు పరిశీలించి రుణాన్ని మంజూరు చేస్తాయి. అయితే ఆప్షన్లలో మీకు ఏ ఆర్థిక సంస్థ లేదా బ్యాంకు నుంచి రుణం కావాలన్నది కూడా మీరు ఎంచుకోవచ్చు. ఇక పైన తెలిపిన వెబ్‌సైట్‌లోనే ముద్ర లోన్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
అయితే ముద్ర లోన్లకు దరఖాస్తు ఫాంలను నింపడం కష్టంగా ఉందనుకుంటే సదరు వెబ్‌సైట్‌లోనే సహాయం కోరవచ్చు. దాంతో ఏదైనా ఏజెన్సీకి చెందిన వ్యక్తులు మీకు సహాయం చేస్తారు. కానీ వారు స్వల్ప మొత్తంలో ఫీజు తీసుకుంటారు. ఇక వారి ద్వారా లోన్ పొందడం సులభతరం కూడా అవుతుంది. ఈ విధంగా ఎవరైనా సరే.. ముద్ర రుణాలను పొందవచ్చు.
Advertisements