Advertisement
పుదుచ్చేరిలోని కరైకల్ జిల్లా. 2019లో భూగర్భ జలాలు 200 నుంచి 300 అడుగుల లోతుకు పడిపోయాయి. దీంతో అక్కడ తీవ్రమైన కరువు సంభవించింది. ఈ క్రమంలో ఆ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించారు. అయితే అదే సమయంలో అక్కడ కలెక్టర్‌గా ఉన్న విక్రాంత్ రాజాకు జిల్లాను కరువు నుంచి బయట పడేయడం సవాల్‌గా మారింది. అందుకు అక్కడి చెరువులను, నీటి కుంటలను పునరుద్ధరించడం ఒక్కటే మార్గమని ఆయన అనుకున్నారు. వెంటనే ఆ దిశగా పని మొదలు పెట్టారు.
క్రీస్తు శకం 9వ శతాబ్దంలో చోళ రాజులు అనుసరించిన విధానాలతో భూగర్భ జలాలను పెంచేందుకు, జిల్లాను కరువు నుంచి బయట పడేసేందుకు కలెక్టర్ విక్రాంత్ రాజా నామ్ నీర్ (Our Water) పేరిట ఓ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలో అక్కడి 450 చెరువులు, కుంటలను పునరుద్ధరించే పని చేపట్టారు. కేవలం 3 నెలల్లోనే ఏకంగా 178 చెరువులు, కుంటలకు జీవం పోశారు. వాటికి పూర్వ వైభవం తెచ్చారు.
Advertisement
ఇక ఈ ప్రాజెక్టులో స్థానిక సంస్థలు, విద్యాసంస్థలు, ఆలయాల కమిటీలు, కార్పొరేట్లు, ప్రభుత్వ అధికారులను భాగం చేశారు. అందువల్లే అంత తక్కువ వ్యవధిలో అన్ని చెరువులు, కుంటలను పునరుద్ధరించగలిగారు. చోళుల కాలంలో నిజానికి కరైకల్ ప్రాంతంలో మొత్తం 400 వరకు నీటి రిజర్వాయర్లు ఉండేవి. వాటిల్లో చెరువులు, కుంటలు కూడా ఉన్నాయి. అయితే వరదలు వచ్చినప్పుడు కావేరి నది నుంచి నీరు భారీగా వచ్చి ఈ జిల్లాను ముంచెత్తేది. దీంతో చోళులు అప్పట్లో తమ రాజ్యంలో ఉండే నీటి పారుదల నిపుణులతో అద్భుతమైన నెట్‌వర్క్ నిర్మించారు. ఈ క్రమంలో అదనపు నీరు ఎక్కడికక్కడ నిల్వ ఉండేలా కుంటలు, చెరువులను ఏర్పాటు చేశారు. నీటి ప్రవాహానికి కాలువలను నిర్మించారు. ఈ క్రమంలో అక్కడ నీళ్లకు ఎప్పుడూ కొరత రాలేదు. వరదలు వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండేది.
Advertisements
Advertisements
అయితే సరిగ్గా చోళులు అనుసరించిన విధానాన్నే విక్రాంత్ రాజ్ పాటించారు. అందువల్లే మళ్లీ ఆ జిల్లాకు నీటి కళ వచ్చింది. ఎక్కడ చూసినా చిన్న చిన్న నీటి కుంటలు, చెరువులు నీటితో దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాజెకటులో భాగంగా కార్మికులకు ఉపాధి హామీ పథకం కింద ఉపాధి లభించింది. అదే సమయంలో నీటి కుంటలు, చెరువులను పునరుద్ధరించారు. భూగర్భ జలాలు పెరిగాయి. ప్రజలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే ఇదంతా సాధ్యమైందని విక్రాంత్ రాజ్ తెలిపారు. అయితే ప్రభుత్వాలకు తోడుగా కార్పొరేట్ సంస్థలు కూడా సామాజిక బాధ్యత కింద కొన్ని చెరువులను పునరుద్ధరించేందుకు ఆర్థిక సహాయం చేశాయి. దీంతో ఆ జిల్లాలో కరువు సమస్య తీరింది. జలకళ ఉట్టిపడుతోంది. ఇకపై మరిన్ని చెరువులు, కుంటలను అక్కడ పునరుద్ధరించే పనిలో పడ్డారు. దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలను అవలంబిస్తే అప్పుడు ప్రజలకు నీటి సమస్య అనేది ఉండదు కదా..! ఇలా చెరువులను , కుంటలను పునరుద్దరించడం వల్ల…. వరద నుండి కూడా మనల్ని మనం కాపాడుకోవొచ్చు.! లేకపోతే నీరు వెళ్లే దారిలేక ఆ వరదంతా ఇంట్లోకి, రోడ్ల మీదకు వచ్చి చేరుతుంది. ఈ టెక్నాలజీతో ఇండ్లలోకి, రోడ్ల మీదకు వరద రాకుండా నివారించవొచ్చు!