Advertisement
శ్రీమహావిష్ణువుకు చెందిన అవతారాల్లో కృష్ణావతారం కూడా ఒకటి. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం శ్రీకృష్ణుడు క్రీస్తు పూర్వం 3229 సంవత్సరం జూన్ 17-18 అర్థరాత్రి జన్మించాడు. వైదిక పంచాంగం ప్రకారం శ్రీకృష్ణుడు శ్రావణ కృష్ణ అష్టమి నాడు జన్మించాడు. ద్వాపరయుగంలో మొత్తం ఆయన 126 ఏళ్ల 8 నెలల పాటు జీవించాడు. శ్రీకృష్ణుడు దేవకి, వసుదేవులకు జన్మించాడు. కృష్ణుడు పుట్టగానే ఆయన్ను దైవాంశ సంభూతుడని వారు గ్రహించారు. ఈ క్రమంలో అర్థరాత్రి భారీగా వర్షం పడుతుండగా వసుదేవుడు కృష్ణున్ని బుట్టలో పెట్టుకుని యమునా నది దాటాడు. ఆ సమయంలో అనంత నాగమనే సర్పం ఆ ఇద్దరినీ వర్షం నుంచి రక్షించింది.
ఇక శ్రీకృష్ణుడు తన జీవితాన్ని మొత్తం 3 భిన్నమైన ప్రదేశాల్లో గడిపాడు.
1. వ్రజ లీల – చిన్న పిల్లాడిగా బృందావనంలో 11 ఏళ్ల 6 నెలల పాటు ఉన్నాడు.
2. మథుర లీల – మేనమామ కంసున్ని చంపాక 10 ఏళ్ల 6 నెలల పాటు అక్కడ ఉన్నాడు.
3. ద్వారక లీల – ద్వారకలో రాజ్యం స్థాపించాక అక్కడ 105 ఏళ్ల 3 నెలల పాటు జీవించాడు.
వ్రజ లీల సమయంలో కృష్ణుడు అనేక మంది రాక్షసులను సంహరించాడు. వృక్ష రూపంలో ఉన్న నలకుబర, మనిగ్రీవలకు స్వేచ్ఛను ప్రసాదించాడు. గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికెన వేలిపై ఎత్తి భారీ వర్షాలు, వరదల నుంచి ప్రజలు, పశుపక్ష్యాదులను కాపాడాడు. ఆ సమయంలో కృష్ణుడి వయస్సు 7 ఏళ్ల 2 నెలల 10 రోజులు కాగా క్రీస్తు పూర్వం 3222వ సంవత్సరం ఆగస్టు 28వ తేదీన ఆ సంఘటన జరిగింది.
వ్రజ లీల అనంతరం కృష్ణుడు మథురలో తన మేనమామ కంసున్ని సంహరించి అక్కడే ఉన్నాడు. క్రీస్తుపూర్వం 3218వ సంవత్సరం డిసెంబర్ 14న ఆ సంఘటన జరిగింది. అప్పుడు కృష్ణుడి వయస్సు 11 ఏళ్ల 6 నెలలు. ఇక క్రీస్తుపూర్వం 3154వ సంవత్సరం సెప్టెంబర్ 17న భీముడు కృష్ణుడి ఆదేశాల మేరకు జరాసంధున్ని సంహరించేందుకు యుద్ధం ప్రారంభించాడు. ఆ ఇద్దరికీ 14 రోజుల పాటు భీకరంగా ద్వంద్వ యుద్ధం జరిగింది. అందులో భీముడు జరాసంధున్ని చంపేశాడు. తరువాత క్రీస్తు పూర్వం 3153 సంవత్సరం ఫిబ్రవరి 11న 75 ఏళ్ల 8 నెలల వయస్సులో చైత్ర పూర్ణిమ నాడు కృష్ణుడు శిశుపాలున్ని అంతమొందించాడు.
Advertisements
Advertisement
క్రీస్తుపూర్వం 3153వ సంవత్సరం మే 2వ తేదీన పాండవులు పాచికలాటలో కౌరవులకు తమ రాజ్యాన్ని, సర్వస్వాన్ని కోల్పోయారు. కృష్ణుడు పాండవులను రాజ్యం నుంచి వెళ్లిపోయే ముందు కలుసుకున్నాడు. వారిలో ధర్మరాజు, భీముడి నుంచి కృష్ణుడు ఆశీర్వాదం తీసుకున్నాడు. అర్జునున్ని కౌగిలించుకున్నాడు. నకుల సహదేవులకు కృష్ణుడు ఆశీర్వాదం ఇచ్చాడు. దీన్నిబట్టి చూస్తే కృష్ణుడి కన్నా ధర్మరాజు, భీముడు ఇద్దరు వయస్సులో పెద్దవారని, అర్జునుడు, కృష్ణుడు ఇద్దరూ ఒకే వయస్సు కలవారని, నకుల సహదేవులు కృష్ణుడి కన్నా చిన్నవయస్సు కలవారని అర్థమవుతుంది.
క్రీస్తు పూర్వం 3140వ సంవత్సరం మే 7న పాండవులు తమ 12 ఏళ్ల అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం ముగించుకున్నారు. వారు అప్పుడు విరాటరాజు కొలువులో ఉన్నారు. అర్జునుడు తన నిజ స్వరూపాన్ని ఉత్తర కుమారుడికి చూపిస్తాడు. క్రీస్తుపూర్వం 3140, మే 15న ఆషాఢ పౌర్ణమి నాడు పాండవులు విరాట రాజు కొలువులో అందరికీ దర్శనమిస్తారు.
6 నెలల అనంతరం క్రీస్తు పూర్వం 3140 నవంబర్‌లో కృష్ణుడు యుద్ధాన్ని ఆపేందుకు అన్ని విధాలా యత్నిస్తాడు. కానీ పాండవులు, కౌరవులకు మధ్య కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవుతుంది. అప్పుడు కృష్ణుడికి 89 ఏళ్ల వయస్సు కాగా.. అర్జునుడికి 88 ఏళ్ల వయస్సు. యుద్ధం 10 రోజులపాటు జరిగాక భీష్ముడు అర్జునుడు ఏర్పాటు చేసిన అంపశయ్యపై పడుకుంటాడు. తరువాత 3 రోజులకు అర్జునుడి కుమారుడు అభిమన్యుడు ద్రోణాచార్యుడు పన్నిన పద్మవ్యూహంలో వీరమరణం పొందుతాడు. కురుక్షేత్ర యుద్ధం మొత్తం 18 రోజుల పాటు జరుగుతుంది. చివరకు దుర్యోధనుడు చనిపోతాడు.
క్రీస్తు పూర్వం 3140వ సంవత్సరం డిసెంబర్ 5న మాఘ శుక్ల ఏకాదశి నాడు భీష్ముడు విష్ణు సహస్ర నామాలను ధర్మరాజుకు చెప్పి తనువు చాలిస్తాడు. 2 నెలల అనంతరం 3139వ సంవత్సరం ఫిబ్రవరి 5న చైత్ర పూర్ణిమ నాడు ధర్మరాజు అశ్వమేథ యాగం తలపెడతాడు. 37 ఏళ్ల అనంతరం 3102వ సంవత్సరం జనవరి 23 నాడు గురువారం సాయంత్రం ఓ వేటగాడు జింక కన్నులు అనుకుని కృష్ణుడి పాదాలకు బాణాలు వేస్తాడు. ఆ తరువాత 2 గంటల 27 నిమిషాల 30 సెకన్లకు.. అంటే 3102 సంవత్సరం జనవరి 24న కృష్ణుడు తన భౌతిక శరీరాన్ని విడిచిపెడతాడు. అలా కృష్ణుడు చనిపోతాడు.
తరువాత రోజు శుక్రవారం చైత్రమాసం, ప్రమది నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. కానీ జూలియన్ క్యాలెండర్ ప్రకారం కృష్ణుడు చనిపోయిన రోజు క్రీస్తుపూర్వం 3102 సంవత్సరం ఫిబ్రవరి 18 అని చెబుతారు. ఇక కృష్ణుడు అలా భూమిపై 126 ఏళ్ల 8 నెలల పాటు జీవించి చనిపోయాక.. కృష్ణుడి మనవడు వజ్రనాభుడు మాత్రం జీవిస్తాడు. ఇవీ.. శ్రీకృష్ణుని జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలు.
Advertisements