Advertisement
ప్రపంచంలోని ప్రతి ఒక్క దేశం సొంతంగా కరెన్సీని కలిగి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ప్రతి ఒక్క దేశం తమ ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, జీవనశైలి, జీవవైవిధ్యం తదితర అంశాలకు అనుగుణంగా తమ కరెన్సీ నోట్లపై పలు రకాల చిత్రాలను ముద్రిస్తుంటాయి. ఇక భారత్ కూడా కరెన్సీ నోట్లపై పలు బొమ్మలను ముద్రిస్తూ వస్తోంది. అందుకనే మనకు ఒక్కో కరెన్సీ నోటు వెనుక భాగంలో ఒక్కో రకమైన చిత్రం కనిపిస్తుంది. అయితే ఆ చిత్రాలు ఏమిటో.. అవి ఏయే వివరాలను మనకు తెలియజేస్తాయో.. ఇప్పుడు తెలుసుకుందామా..!
రూ.1 నోటు :
మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మన దేశంలో మొదటగా రూ.1 నోటును ముద్రించారు. అంతకు ముందు రూ.1 కి గాను వెండి నాణేలు ఉండేవి. వాటిపై జార్జ్ V చిత్రం ఉండేది. అయితే మొదటి ప్రపంచ యుద్ధం వల్ల వెండికి కొరత ఏర్పడింది. దీంతో 1917 నవంబర్ 30వ తేదీన రూ.1 నోటును అప్పటి ప్రభుత్వం ముద్రించింది. అయితే రూ.1 నోటును ఆర్‌బీఐ కాదు, కేంద్ర ఆర్థిక శాఖ ముద్రిస్తుంది. ఇక ఈ నోటు ముందు భాగంలో రూ.1 అనే సింబల్, వెనుక వైపు సముద్రంలో ఆయిల్ వెలికితీసే రిగ్ ఉంటాయి. అప్పట్లో దేశంలో పారిశ్రామిక రంగంలో చోటు చేసుకున్న అభివృద్ధికి గుర్తుగా రూ.1 నోటుపై ఆ బొమ్మను ముద్రించారు.
రూ.2 నోటు…
Advertisements
రూ.1తోపాటు రూ.2 నోటును కూడా ఇప్పుడు చాలా మంది వాడడం లేదు. ఇక ఈ నోటుపై వెనుక భాగంలో ఆర్యభట్ట శాటిలైట్ చిత్రం ఉంటుంది. భారత్.. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో సాధిస్తున్న ప్రగతికి చిహ్నంగా ఈ బొమ్మను రూ.2 నోటుపై ముద్రించారు. అయితే ఆర్‌బీఐ రూ.2 నోట్లను ముద్రించడం మానేసింది. ప్రింటింగ్ ఖర్చు ఎక్కువవుతుందని ఈ నోటును ముద్రించం మానేశారు. అయినప్పటికీ పాత నోట్లను ఇప్పటికీ తీసుకుంటారు. ఇక ఈ నోటుకు ముందు భాగంలో అశోకుడి చిహ్నం ఉంటుంది.
రూ.5 నోటు…
రూ.5 కరెన్సీ నోటు వెనుక భాగంలో ఒక వ్యక్తి పొలం దున్నుతున్న చిత్రం ఉంటుంది. దేశంలో వ్యవసాయ రంగంలో చోటు చేసుకుంటున్న విప్లవాత్మకమైన మార్పులకు గుర్తుగా ఆ బొమ్మను ఆ నోటుపై ముద్రించారు. కాగా ఖర్చు ఎక్కువవుతుందని చెప్పి ఆర్‌బీఐ ఈ నోటును కూడా ముద్రించడం మానేసింది. అయినప్పటికీ దాదాపుగా 85వేల మిలియన్ల రూ.5 నోట్లు ఇప్పటికీ చెలామణీలో ఉన్నాయి. ఈ నోటు ముందు భాగంలో మహాత్మాగాంధీ బొమ్మ ఉంటుంది.
రూ.10 నోటు…
ఒడిశాలోని కొనార్క్‌లో సూర్యదేవాలయం ఉంది. ఇదే దేవాలయ చిత్రాన్ని రూ.10 కరెన్సీ నోటు వెనుక భాగంలో ముద్రించారు. కాగా ఈ నోటును ముద్రించేందుకు ఆర్‌బీఐకి 96 పైసలు ఖర్చవుతోంది. ఈ నోటు ముందు భాగంలో గాంధీ బొమ్మ, అశోకుడి చిహ్నాలు ఉంటాయి.
Advertisement
రూ.20 నోటు…
రూ.20 నోటు వెనుక భాగంలో.. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్‌లో ఉన్న మౌంట్ హారియట్ లైట్‌హౌజ్ బొమ్మ ముద్రించబడి ఉంటుంది. కొబ్బరి చెట్లు, సముద్రాన్ని ఈ చిత్రంలో చూడవచ్చు. కాగా రూ.20 నోటును ముద్రించేందుకు కూడా ఆర్‌బీఐకి 96 పైసలు ఖర్చవుతుంది. దేశంలో 5000 మిలియన్ల వరకు రూ.20 నోట్లు చెలామణీలో ఉన్నాయి.
రూ.50 నోటు…
భారత్ ముద్రించిన కొత్త రూ.50 నోటుపై వెనుక భాగంలో.. హంపిలోని రథం బొమ్మ ముద్రించబడి ఉంటుంది. ఇక రూ.50 నోటు ముద్రణకు రూ.1.81 ఖర్చవుతుంది. దాదాపుగా 4000 మిలియన్ల రూ.50 నోట్లు చెలామణీలో ఉన్నాయి. వెనుక భాగంలో స్వచ్ఛ భారత్ లోగో కూడా చూడవచ్చు.
రూ.100 నోటు…
రూ.100 నోటుపై వెనుక భాగంలో భారతదేశంలోనే అత్యంత ఎత్తయిన కాంచనగంగ పర్వతం బొమ్మ ముద్రించబడి ఉంటుంది. ఈ నోటుకు రూ.1.20 ఖర్చవుతుంది. 16వేల మిలియన్ల రూ.100 నోట్లు ప్రస్తుతం చెలామణీలో ఉన్నాయి.
రూ.200 నోటు…
భారత్ కొత్తగా ముద్రించిన రూ.200 నోటు వెనుక భాగంలో సాంచీ స్థూపం బొమ్మ ముద్రించబడి ఉంటుంది. ఇక ఈ నోటు ముద్రణకు రూ.2.93 ఖర్చవుతుంది.
రూ.500 నోటు…
ఢిల్లీలోని ఎర్రకోట చిత్రం రూ.500 నోటు వెనుక వైపు ముద్రించబడి ఉంటుంది. అలాగే స్వచ్ఛభారత్ లోగోను కూడా చూడవచ్చు. నోట్ల రద్దును చేశాక 2016లో ఈ నోటును ప్రవేశపెట్టారు. ఈ నోటు ముద్రణకు ఆర్‌బీఐ రూ.2.94 ఖర్చు చేస్తోంది.
రూ.1000 నోటు…
కేంద్రం గతంలో రద్దు చేసిన రూ.1000 నోటు వెనుక భాగంలో భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన చిత్రం ముద్రించబడి ఉంటుంది.
రూ.2వేల నోటు…
భారత్ గతంలో చేపట్టిన ఓ అంతరిక్ష మిషన్‌కు సంబంధించిన మంగళయాన్ అనే శాటిలైట్ చిత్రాన్ని రూ.2వేల నోటు వెనుక భాగంలో ముద్రించారు. దేశంలో రూ.500, రూ.1000 పాత నోట్లను రద్దు చేశాక ఈ నోటును ప్రవేశపెట్టారు. దీని ముద్రణకు రూ.3.54 ఖర్చవుతోంది.
Advertisements