Advertisement
రైళ్లలో కేవలం ప్రయాణికులను తరలించే రైళ్లు మాత్రమే కాదు.. వస్తువులను తరలించే గూడ్స్ రైళ్లు కూడా ఉంటాయి. అవి నిరంతరాయంగా నడుస్తూనే ఉంటాయి. విమానాలు, రోడ్డు రవాణా కన్నా ఎక్కువ మొత్తంలో వస్తువులను రైళ్ల ద్వారా రవాణా చేసేందుకు వీలు కలుగుతుంది. అయితే కరోనా నేపథ్యంలో మార్చి, మే నెలల్లో రైల్వే శాఖ అద్భుతమైన ప్రయోగం చేసింది. అదేమిటంటే..
సాధారణంగా ఒక గూడ్స్ రైలుకు 40 నుంచి 50 వరకు బోగీలు ఉంటాయి. ఒక్కో రైలును నడిపించాలంటే అందుకు మ్యాన్ పవర్, విద్యుత్ లేదా డీజిల్ ఖర్చు అవుతాయి. దీంతోపాటు ఒక్కో రైలు ఒక్కో సమయంలో నడుస్తుంది కనుక.. అవి భిన్న సమయాలకు గమ్యస్థానాలకు చేరుతాయి. దీంతో ఎంతో సమయం వృథా అవుతుంది. అయితే ఈ ఇబ్బందులన్నింటినీ తగ్గించేలా రైల్వే శాఖ వినూత్న ప్రయోగం చేసింది. మార్చి నెలలో ఈస్ట్ కోస్ట్ రైల్వే 3 గూడ్స్ రైళ్లను కలిపి ఒకే రైలులా మార్చి దాన్ని గోడ్‌భగ, బాలాంగిర్ రైల్వేస్టేషన్ల మధ్య నడిపింది. ఆ రైలుకు 147 బోగీలను కలపడం విశేషం. అందులో 3 బ్రేక్/గార్డ్ బోగీలు, 4 ఇంజిన్లు ఉన్నాయి.
Advertisement
ఇక ఆ ప్రయోగం విజయవంతం అయ్యే సరికి మరో రెండు నెలలకు అంటే.. మే నెలలో సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అలాంటిదే మరొక ప్రయోగం చేసింది. ఈసారి కూడా రైళ్లను కలిపారు. దీంతో ఆ రైలులో మొత్తం 177 బోగీలు అయ్యాయి. ఇక ఆ రైలు పొడవు సుమారుగా 2 కిలోమీటర్లు అయింది. దాన్ని విశాఖపట్నం పోర్టుకు తరలించారు. అలా ఆ రైలును కూడా విజయవంతంగా నడిపారు. అయితే ఆ రైలు భారీగా పొడవు ఉండడం చేత దాన్ని అనకొండ ఆన్ రైల్స్ అని పైథాన్ ట్రెయిన్ అని పిలిచారు.
Advertisements
Advertisements
అయితే రైల్వే అధికారులు విడివిడిగా 3 రైళ్లను నడిపి ఉండవచ్చు. కానీ అలా చేసి ఉంటే 3 రైళ్లు గమ్యస్థానాలకు చేరుకునేందుకు భిన్న సమయం పట్టేది. దీంతో ఎంతో సమయం వృథా అయి ఉండేది. అలాగే మ్యాన్ పవర్, ఇంధనం కూడా ఎక్కువగానే ఖర్చు అయి ఉండేవి. కానీ వాటిని ఒకే రైలుగా కలపడం వల్ల 3 రైళ్లు ఒకేసారి గమ్యస్థానానికి చేరుకున్నాయి. దీనికి తోడు ఎంతో సమయం ఆదా అవడమే కాక.. ఇతర ఖర్చులు కూడా తగ్గాయి. అందువల్లే రైల్వే శాఖ వారు ఆ ప్రయోగం చేసి.. అలా 2 భారీ అనకొండ రైళ్లను నడిపారు. అయితే కరోనా నేపథ్యంలో మార్చి నుంచి మే నెల వరకు లాక్‌డౌన్ ఉంది. ఈ క్రమంలో రైళ్లను కూడా రద్దు చేశారు. అందువల్ల రైళ్ల రద్దీ లేదు. దీంతో గూడ్స్ రైళ్లను అలా కలిపి నడిపారు. కరోనా నేపథ్యంలో ఇతర రైళ్లు లేనందువల్లే ఇలా చేయడం సాధ్యమైంది. సాధారణ సమయాల్లో రైళ్ల రద్దీ ఉంటుంది కనుక ఈ తరహా ప్రయోగాలు చేయలేరు. ఏది ఏమైనా.. రైల్వే వారు చరిత్రలోనే తొలిసారిగా ఇలాంటి ప్రయోగం చేసి రికార్డు సృష్టించారు. అందువల్ల అనకొండ రైలు అనే కొత్త పదం రైల్వే డిక్షనరీలో వచ్చి చేరింది. మరి ముందు ముందు ఇలాంటి ప్రయోగాలు చేస్తారో, లేదో చూడాలి.