Advertisement
భారత రైల్వే 92 ఏళ్ల కిందటి పురాతనమైన రైలును ఇటీవలే పూర్తిగా అప్‌గ్రేడ్ చేసింది. మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా ఆ రైలును అప్‌గ్రేడ్ చేసి అందుబాటులోకి తెచ్చింది. ముంబై సెంట్రల్ నుంచి అమృతసర్ గోల్డెన్ టెంపుల్‌కు నడిచే మెయిల్‌ను అధునాతన LHB రేక్‌లతో అప్‌గ్రేడ్ చేశారు. కోవిడ్ నేపథ్యంలోనూ చకచకా పనులు పూర్తి చేసి ఈ రైలును అధునాతనంగా తీర్చిదిద్దారు. దీనికి 92 ఏళ్ల చరిత్ర ఉంది. మహాత్మాగాంధీ సహా పలువురితో ఈ రైలు ప్రత్యేక అనుబంధాలను కలిగి ఉంది. అలాగే పలు చారిత్రక కార్యక్రమాలకు ఈ రైలుకు సంబంధాలు ఉన్నాయి. అందుకనే దీన్ని అధునాతనంగా అప్‌గ్రేడ్ చేశారు.
బ్రిటిష్ వారి కాలంలో.. అంటే.. 1928లో దీన్ని అప్పట్లో ముంబై నుంచి పెషావర్‌కు నడిపేవారు. పెషావర్ పాకిస్థాన్‌లో చేరాక 1947 నుంచి ఈ రైలును ముంబై నుంచి అమృతసర్‌కు నడపడం మొదలు పెట్టారు. 1934లో ఈ రైలుతో ఏసీ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. అప్పట్లో ఈ రైలును ఫ్రాంటియర్ మెయిల్ అని పిలిచేవారు. ఏసీ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన మొదటి రైలు కూడా ఇదే కావడం విశేషం. ఇక ఈ రైలుకు 1996లో ఫ్రాంటియర్ మెయిల్ పేరుకు బదులుగా గోల్డెన్ టెంపుల్ మెయిల్ అని పేరు పెట్టారు. అప్పటి నుంచి అదే పేరుతో ఈ రైలును నడుపుతున్నారు.
Advertisement
కాగా 1928లో పృథ్వీరాజ్ కపూర్ సినిమాల్లో నటించేందుకు ముంబై నుంచి పెషావర్‌కు ఫ్రాంటియర్ మెయిల్‌లో వెళ్లేవారు. అలాగే మహాత్మా గాంధీ నిర్వహించిన దండి మార్చ్‌కు, ఈ రైలుకు సంబంధం ఉంది. అప్పట్లో వారు ఈ రైలులోనే ప్రయాణించారు. అయితే దీన్ని ప్రస్తుతం LHB రేక్‌లతో అత్యంత అధునాతనంగా తీర్చిదిద్ది అక్టోబర్ 3, 2020వ తేదీ నుంచి నడిపిస్తున్నారు. దీన్ని గతంలో 12903 / 12904 అనే నంబర్ పేరిట నడిపేవారు. కోవిడ్ నేపథ్యంలో 02903/ 02904 నంబర్ పేరిట ముంబై – అమృతసర్ స్పెషల్ ట్రెయిన్ గా నడిపిస్తున్నారు.
Advertisements
Advertisements
ఈ ట్రెయిన్‌లో మొత్తం 22 కోచ్‌లు ఉంటాయి. ఫస్ట్ క్లాస్, ఏసీ 2 టైర్, 3 టైర్, స్లీపర్, సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉన్నాయి. ఒక ప్యాంట్రీ కార్ కూడా ఉంది. కాగా LHB రేక్‌ల వల్ల ప్రయాణికులకు మరింత భద్రత లభిస్తుంది. ట్రెయిన్ ప్రమాదాం బారిన పడ్డా కోచ్‌లు ఒకదానిపై మరొకటి పడకుండా ఉంటాయి. అలాగే ఇవి అత్యంత తేలిగ్గా ఉంటాయి. దృఢంగా ఉంటాయి. ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కువ వేగంతో తీసుకెళ్లగలవు. అందుకనే LHB రేక్‌లతో ఈ ట్రెయిన్‌ను అప్‌గ్రేడ్ చేశారు. దీనికి 92 ఏళ్ల చరిత్ర ఉండడం, చారిత్రాత్మక ఘటనలతో సంబంధం ఉండడం వల్లే దీన్ని అప్‌గ్రేడ్ చేసి నడిపిస్తున్నారు.