Advertisement
సహాయం చేసే మనస్సు ఉండాలేగానీ మన దేశాలనే కాదు.. ఇతర దేశాలకు చెందిన వారికి కూడా సహాయం చేయవచ్చు. అవును.. సరిగ్గా ఆ వ్యక్తి కూడా ఇదే విషయాన్ని నిరూపిస్తున్నాడు. బ్రతుకు దెరువు నిమిత్తం తాను భారత్‌ను వదిలి ఆ దేశానికి వెళ్లినా.. అక్కడి వారికి సమస్య వచ్చినప్పుడు తాను కూడా ఆ దేశ వాసిలా మారి వారికి సహాయం చేస్తున్నాడు. అతనే పర్వేజ్ అలీ ఖాన్.
పర్వేజ్ అలీ ఖాన్ ది పంజాబ్‌లోని పాటియాలా. 5 ఏళ్ల కిందట భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి అర్మేనియా అనే దేశానికి వలస వెళ్లాడు. ఆ దేశ రాజధాని యెరెవన్‌లో ఇండియన్ మెహెక్ రెస్టారెంట్ అండ్ బార్ పెట్టి జీవనం సాగిస్తున్నాడు. ఈ 5 ఏళ్ల కాలంలో అక్కడి వారితో ఆ కుటుంబం ఎంతగానో కలిసి పోయింది. వారి అలవాట్లు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయలు, భాషను వారు నేర్చుకున్నారు. దీంతో ఎంతో మంది ఆ దేశస్థులు వీరికి స్నేహితులుగా కూడా మారారు.
అయితే తాజాగా సెప్టెంబర్ 27వ తేదీ నుంచి అర్మేనియాకు, అజెర్‌బైజన్‌కు మధ్య అక్కడి నగర్నో-కరాబాఖ్ అనే ప్రాంతంలో అల్లర్లు ప్రారంభమయ్యాయి. దీంతో దాదాపుగా 30వేల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. అయితే అక్కడి నుంచి శరణార్థులుగా వారు యెరెవన్‌కు రావడం మొదలు పెట్టారు. దీంతో వారికి ఉండడానికి షెల్టర్, తినేందుకు తిండి కరువైంది. అయితే పర్వేజ్ తన స్నేహితులతోపాటు, అక్కడి ఫేస్‌బుక్ పేజీలు, గ్రూప్‌ల ద్వారా తన రెస్టారెంట్ నుంచి సదరు నిరాశ్రయులకు ఉచితంగా ఆహారం అందించడం మొదలు పెట్టాడు.
Advertisements
Advertisement
పర్వేజ్‌తోపాటు తన భార్య, ఇద్దరు కుమార్తెలు, రెస్టారెంట్‌లోని స్టాఫ్ కలిసి రాత్రింబవళ్లు ఆ నిరాశ్రయలకు ఆహారాన్ని ఫుడ్ బాక్స్‌లలో నింపి అందజేస్తున్నారు. ఇక ఫుడ్ ప్రిపేర్ చేసుకునేందుకు కావల్సిన పదార్ధాల కోసం వచ్చే వారికి కూడా పర్వేజ్ ఉచితంగా సరుకులను అందజేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. దీంతో ఆ దేశ వాసులే కాదు, అక్కడి భారతీయులు కూడా పర్వేజ్‌ను అభినందిస్తున్నారు. తాను ఎన్నో ఏళ్లుగా ఆ దేశ వాసులతో కలిసిపోయానని, వారిని తన సొంత మనుషుల్లా భావిస్తున్నానని, తనకు ఆ దేశం తిండి పెడుతుందని, అందుకనే తిరిగి ఆ దేశవాసులకు తనకు చేతనైనంత సహాయం చేస్తున్నానని అంటున్నాడు.
Advertisements
నిజానికి పర్వేజ్ ప్రాగ్‌లో మరొక రెస్టారెంట్‌ను ఓపెన్ చేయాల్సి ఉంది. కానీ అందుకోసం దాచి ఉంచుకున్న డబ్బును ఇప్పుడు ఇలా ఆహారం అందజేయడం కోసం ఖర్చు చేస్తున్నాడు. అయినప్పటికీ తాను దిగులు చెందడం లేదని, తనకు ఈ అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని అతను చెబుతున్నాడు.