Advertisement
ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భిన్న రకాల జాతులు, తెగలకు చెందిన వారు జీవిస్తున్నారు. వారిలో కొందరు అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటుంటే.. కొందరు జనావాసాల మధ్యే ఉంటున్నారు. ఈ క్రమంలోనే మన దేశంలోనూ ఇలాంటి భిన్నమైన తెగలకు చెందిన పలువురు జీవిస్తున్నారు. కొందరు ఇతర దేశాల నుంచి క్రీస్తుపూర్వమే మన దేశానికి వలస వచ్చారు. వారి గురించిన పలు ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. బ్రొప్కా తెగ – అలెగ్జాండర్ సైనికుల వారసులు
క్రీస్తు పూర్వం 327వ సంవత్సరంలో వీరు భారత్‌కు వచ్చినట్లు చెబుతారు. అలెగ్జాండర్ సైనికుల వారసులమని వీరు చెప్పుకుంటారు. మన దేశంలోని లడఖ్ ప్రాంతంలో వీరు నివసిస్తారు. వీరు పొడవుగా, నీలి కళ్లు కలిగి ప్రత్యేకమైన శరీర సౌష్టవంతో ఉంటారు. ఈ తెగకు చెందిన వారు సుమారుగా 4వేల మంది వరకు ఉంటారని అంచనా. వీరు తమ తెగకు చెందిన వారిని తప్ప ఇతరులను పెళ్లి చేసుకోరు. వీరు పూర్తిగా శాకాహారులు. కనీసం పాలు, పాల ఉత్పత్తులను కూడా తీసుకోరు.
2. బ్నెయి మెనాషె – ఇజ్రాయెల్‌కు చెందిన తెగ
Advertisements
వీరు ఎక్కువగా మణిపూర్, మిజోరంలలో ఉంటారు. ఇజ్రాయిల్ నుంచి వీరు భారత్‌కు వలస వచ్చారు. క్రీస్తు పూర్వం 721వ సంవత్సరంలోనే వీరు భారత్‌కు వచ్చి ఉంటారని చరిత్ర చెబుతోంది. మయన్మార్ మీదుగా వీరు భారత్‌కు చేరుకుని ఉంటారని తెలిసింది.
3. అండమాన్ అండ్ నికోబార్ దీవుల తెగలు
ఈ దీవుల్లో మొత్తం నాలుగు తెగల వారు నివాసం ఉంటారు. వీరిని ది గ్రేట్ అండమానీస్, ఓంగె, జరావా, సెంటినలీస్ తెగలకు చెందినవారుగా వ్యవహరిస్తారు. సుమారుగా 60వేల ఏళ్ల కిందట వీరు ఆఫ్రికా నుంచి ఈ దీవులకు వలస వచ్చి ఉంటారని చెబుతారు. వీరిని రాతియుగం నాటి తెగలుగా భావిస్తారు. బయటి వ్యక్తులను వీరు తమ దగ్గరకు రానివ్వరు. బయటి వారు కనిపిస్తే వీరు బాణాలు వేసి ముందుగా హెచ్చరిస్తారు. వీరు కేవలం వేటాడడం, చేపలు పట్టడం వంటి పనులు చేసి జీవిస్తుంటారు. వ్యవసాయం చేయరు. కాగా బ్రిటిష్ వారి సమయంలో ఈ తెగలకు చెందిన వారు దాదాపుగా అంతరించిపోయారు. ప్రస్తుతం చాలా తక్కువ మంది మాత్రమే ఈ దీవుల్లో మనకు కనిపిస్తారు.
4. బిష్ణోయ్ తెగ
ఉత్తర భారత రాష్ట్రాలతోపాటు రాజస్థాన్‌లోని థార్ ఎడారి పశ్చిమ ప్రాంతంలో ఈ తెగల వారు ఎక్కువగా నివసిస్తారు. బిష్ణోయ్ అంటే 29 అని అర్థం వస్తుంది. అంటే వీరు 29 రకాల నియమ, నిబంధలను పాటిస్తూ జీవిస్తారు. వాటిని వారి గురువు జాంబేశ్వర్ చెప్పారు. ఆ 29 నియమాలలో.. శుభ్రత పాటించడం, ఆరోగ్యంగా ఉండడం, సామాజికంగా చక్కని ప్రవర్తన కలిగి ఉండడం, దేవున్ని ఆరాధించడం, జంతువులను చంపడాన్ని మానుకోవడం, చెట్లను నరికివేయకుండా ఉండడం వంటివి ఉన్నాయి. 1730వ సంవత్సరంలో ఖేజ్రిలో ఉన్న చెట్లను నరకాల్సిందిగా అప్పటి జోధ్‌పూర్ రాజు ఆదేశిస్తే ఈ తెగకు చెందిన 363 మంది చెట్లను నరికివేయకుండా వాటిని హత్తుకుని మద్దతు తెలిపారు. ఆ ఘటనలో వారు ప్రాణాలను సైతం త్యాగం చేశారు. అయితే ఇదే ఘటన 1970లలో ఉత్తరాఖండ్‌లో చిప్కో ఉద్యమానికి ప్రేరణగా నిలిచింది.
Advertisement
5. సిద్దిస్ తెగ – ఆఫ్రికా
తూర్పు ఆఫ్రికా దేశాలకు చెందిన సిద్దిస్ అనే ఈ తెగ వారిని అప్పట్లో అరబ్బులు, యురోపియన్లు బానిసలుగా చేసుకుని మన దేశానికి తీసుకువచ్చారు. కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, ఏపీలలో ఈ తెగల వారు నివాసం ఉంటున్నారు. వీరు హిందీ, గుజరాతీ, కన్నడ వంటి భారతీయ భాషలను మాట్లాడగలరు. అయినప్పటికీ తమ సాంప్రదాయ ధమల్ నృత్యాన్ని ఇప్పటికీ వీరు ప్రదర్శిస్తారు. వీరిలో ఎక్కువగా ముస్లిం మతానికి చెందిన వారు కాగా.. మిగిలిన వారిలో హిందువులు, క్రైస్తవులు కూడా ఉన్నారు. వీరు చక్కని శారీరక దారుఢ్యాన్ని కలిగి ఉంటారు.
6. అపటని తెగ – అరుణాచల్ ప్రదేశ్
అరుణాచల్ ప్రదేశ్‌లోని జిరో అనే ప్రాంతంలో వీరు నివాసం ఉంటారు. వీరు ప్రకృతిని ఎక్కువగా పూజిస్తారు. వీరి సుస్థిరమైన వ్యవసాయ విధానాలు, అడవులను కాపాడుకోవాలనే తపన వీరికి ప్రాధాన్యతను, గుర్తింపును తీసుకువచ్చాయి. అందుకే ఈ తెగ వారు ఇతర తెగల కన్నా భిన్నంగా కనిపిస్తారు. ఈ తెగకు చెందిన మహిళలు చాలా అందంగా ఉంటారట. అయితే అలా అందంగా కనిపించకుండా ఉండేందుకు గాను వీరు ముఖంపై పెద్ద పెద్ద టాటూలను, భారీ ముక్కు పుడకలను ధరిస్తారు.
7. మేఘాలయ ఈల వేసే తెగ
మేఘాలయలోని షిల్లాంగ్‌కు 56 కిలోమీటర్ల దూరంలో ఉండే కాంగ్‌థాంగ్ అనే గ్రామంలో ఈ తెగ వారు నివాసం ఉంటారు. వీరు పేర్లు పెట్టి పిలుచుకునేందుకు బదులుగా ఈల వేసి పిలుచుకుంటారు. ఒక్కొక్కరిని పిలిచేందుకు వీరు వారికి నిర్దేశించబడిన భిన్న రకాల ఈలలు వేస్తారు. అలా వీరు పేర్లకు బదులుగా ఈలలు వేస్తూ ఒకర్నొకరు పిలుచుకుంటారు. ఇక మనం మనకు పిల్లలు పుడితే పేర్లు పెడతాం. కానీ ఈ తెగ వారు తమకు పిల్లలు పుట్టగానే వారికి ఓ భిన్నమైన ఈలను నిర్దారిస్తారు. దీంతో ఆ ఈలతోనే వారిని పిలవాల్సి ఉంటుంది. ఒక్కో వ్యక్తికి ఒక్కో విధంగా చేతివేళ్ల ముద్రలు ఉన్నట్లే.. వీరు ఒక్కో వ్యక్తికి ఒక్కో విధంగా ఈలను నిర్దారిస్తారు. ఇక ఒక్కో ఈల నిడివి 5 నుంచి 6 సెకన్లు ఉంటుంది. దాన్ని ఆ వ్యక్తి కుటుంబ సభ్యులందరూ కచ్చితంగా గుర్తుంచుకోవాలి. దానికి పదాలు, అర్థాలు ఏమీ ఉండవు. ఇక ఒక వ్యక్తి చనిపోతే అతని ఈల కూడా అతనితోనే కనుమరుగవుతుంది. దాన్ని మరొకరికి ఇవ్వరు.
Advertisements