Advertisement
మండోదరి నిజానికి ఒక దేవత. చాలా అందగత్తె. ఒకప్పుడు ఆమె కైలాసంలో శివపార్వతులను దర్శించుకునేందుకు వెళ్తుంది. అయితే అదే సమయానికి పార్వతీ దేవి తన కుమారులను చూసేందుకు పక్కకు వెళ్తుంది. ఈ క్రమంలో మండోదరి చూపు శివుడిపై పడుతుంది. అయితే అదే సమయానికి అటుగా వచ్చిన పార్వతీ దేవి మండోదరికి కప్పగా మారమని శాపం పెడుతుంది. అనంతరం ఆమె కప్పగా మారాక పార్వతి ఆమెను బావిలో పడేస్తుంది.
మండోదరి అసలు పేరు మధుర. కానీ శాప వశాన కప్పగా మారడం వల్ల ఆమెకు మండోదరి అనే పేరు వచ్చింది. అయితే శివుడు మండోదరికి 12 ఏళ్ల తరువాత శాప విముక్తి అవుతుందని, అనంతరం ఆమె మునుపటిలాగే అందంగా కనిపిస్తుందని చెబుతాడు. ఈ క్రమంలో 12 ఏళ్లు పూర్తవుతాయి. మండోదరికి శాప విముక్తి అవుతుంది. కానీ బావిలోనే ఉండి సహాయం కోసం పిలుస్తుంది. అదే సమయానికి అటుగా వచ్చిన మయాసురుడు, అతని భార్య హేమలు మండోదరి అరుపులు విని బావి దగ్గరకు వచ్చి చూస్తారు. అనంతరం వారు మండోదరిని బావి నుంచి రక్షిస్తారు. అయితే వారు మండోదరిని తమకు దేవుడిచ్చిన పుత్రికగా భావించి తమతో రమ్మంటారు. దీంతో ఆమె వారితో వెళ్లిపోతుంది.
Advertisement
తరువాత కొంత కాలానికి రావణుడు మండోదరిని చూసి ఆమెను పెళ్లి చేసుకుంటానని మయాసురున్ని అడుగుతాడు. అందుకు అతను ఒప్పుకోగానే ఇద్దరి పెళ్లి జరుగుతుంది. అయితే ప్రస్తుతం జోధ్‌పూర్‌లో ఉన్న మండోర్ అనే ప్రాంతాన్ని మండోదరి జన్మస్థలం అని చెబుతారు. ఇక రావణున్ని పెళ్లి చేసుకున్నాక ఆమె అతనితో కలిసి లంకకు వెళ్తుంది.
- కొన్ని పురాణాల్లో మండోదరిని సీతకు తల్లి అని చెబుతారు. కానీ వాల్మీకి రామాయణం ప్రకారం అది సరికాదు.
- రావణుడు క్రూరుడు కానీ అతని భార్య మండోదరి చాలా అణకువ కలిగిన, జాలి, దయ ఉన్న వ్యక్తి.
- సీతను అపహరించుకు వచ్చాక ఎంత చెప్పినా సీత రావణుడితో ఉండేందుకు అంగీకరించదు. దీంతో సీతను రావణుడు చంపాలని చూస్తాడు. కానీ మండోదరి వద్దని వారిస్తుంది.
- సీత కోసం హనుమంతుడు లంకకు వచ్చినప్పుడు మండోదరిని చూసి సీత అని భ్రమిస్తాడు. కానీ సీత అయితే అంతఃపురంలో సంతోషంగా ఎందుకు ఉంటుంది ? అని అనుమానం వచ్చి లంకంతా గాలించి సీతను వెదికి పట్టుకుంటాడు.
- మండోదరికి ముగ్గురు కుమారులు. మేఘనాథుడు, అక్షయ కుమారుడు, అతికాయుడు.
- సీతను వదిలేయమని రాముడికి అప్పగించమని మండోదరి చెబుతుంది. అయినప్పటికీ రావణుడు వినిపించుకోడు.
- రావణుడు చనిపోయాక మండోదరి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. కానీ రాముడు వారిస్తాడు. రావణుడి తమ్ముడు విభీషణున్ని పెళ్లి చేసుకోవాల్సిందిగా సూచిస్తాడు.
- పాపాలను హరించే పంచకన్యలలో మండోదరి ఒక కన్య అని చెబుతారు.
Advertisements