Advertisement
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో వారెన్ బఫెట్ కూడా ఒకరన్న సంగతి తెలిసిందే. 2020 ఫోర్బ్స్ వివరాల ప్రకారం ఆయన ఆస్తి విలువ సుమారుగా 8,840 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. బర్క్ షైర్ హాత్‌వే అనే కంపెనీకి చైర్మన్, సీఈవోగా ఈయన ఉన్నారు. ఈయన గొప్ప వ్యాపారవేత్త మాత్రమే కాదు, దాన గుణంలోనూ మేటి. ఇక ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో ఈయన 7వ స్థానంలో కొనసాగుతున్నారు.
వారెన్ బఫెట్ ఇప్పుడు అంత గొప్ప వ్యక్తిగా ఉన్నారు. కానీ ఆయన చిన్నతనంలోనూ అనేక ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. చిన్నప్పుడు ఆయన ఒకసారి స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్‌ను దొంగిలించారు. అలాగే స్కూల్‌లో గ్రేడ్లు కూడా అంత మంచిగా వచ్చేవి కాదు. ఇక ఒకసారి ఇంట్లో నుంచి పారిపోయారు. అయితే తన తండ్రి ఆయనకు జీవిత పాఠాలు నేర్పించారు. ఇకనైనా సరైన నడవడిక అలవర్చుకోకపోతే జాగ్రత్త అని భయపెట్టారు. దీంతో బఫెట్ అప్పటి నుంచి సరైన మార్గంలో నడిచారు.
వారెన్ బఫెట్ యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఆయనను ఒక పుస్తకం అమితంగా ఆకట్టుకుంది. దాన్ని ఆయన లైబ్రరీ నుంచి అద్దెకు తెచ్చుకున్నాడు. వన్ థౌజండ్ వేస్ టు మేక్ 1000 డాలర్స్ అనే పుస్తకం అది. దాన్ని చదవడం వల్లనో ఏమో ఆయన డబ్బు విలువ తెలుసుకున్నాడు. యుక్త వయస్సు నుంచే పనిచేయడం మొదలు పెట్టాడు. తన బామ్మ కిరాణా స్టోర్‌లో పనిచేసేవాడు. కోలా కోలా, గోల్ఫ్ బాల్స్, స్టాంప్‌లు, మ్యాగజైన్లను డోర్ టు డోర్ తిరిగి అమ్మాడు.
Advertisements
Advertisements
మనం ఇతరుల కన్నా స్మార్ట్‌గా ఉండాల్సిన పనిలేదు, ఇతరుల కన్నా డిసిప్లిన్‌గా ఉంటే చాలు.. అని బఫెట్ అంటారు. న్యూయార్క్‌కు ఒకసారి ఆయన తన 10వ ఏట వెళ్లినప్పుడు అక్కడి స్టాక్ ఎక్స్చేంజ్‌ను చూశారు. తనకు, తన సోదనికి చెరొక 3 స్టాక్స్ చొప్పున కొన్నారు. ఇక ఆయన తన 15వ ఏట నెలకు 2వేల డాలర్లను సంపాదించడం మొదలు పెట్టారు. న్యూస్ పేపర్లను డెలివరీ చేయడం ద్వారా ఆయన సంపాదించేవారు. అప్పట్లోనే ఆయన 40 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని కొన్నారు.
Advertisement
బఫెట్ తన హైస్కూల్ విద్య పూర్తి అయ్యే సరికి 50వేల డాలర్లను పొదుపు చేశారు. ఆయన వ్యాపారం చేయాలని అనుకునే వారు. కానీ హార్వార్డ్ బిజినెస్ స్కూల్ వారు ఆయనకు సీటు ఇవ్వలేదు. ఇక వ్యాపారం ప్రారంభించాలంటే ముందుగా మనకు మనమే పెట్టుబడిగా మారాలని ఆయన అంటుంటారు. అలాగే బఫెట్‌కు ప్రజా వేదికపై మాట్లాడాలంటే భయంగా ఉండేది. దీంతో ఆ సమస్యను అధిగమించేందుకు ఆయన ఓ కోర్సు చేశారు.
ఇక బఫెట్ తన కన్నా వయస్సు రెండింతలు ఎక్కువగా ఉన్నవారికి వ్యాపారంలో పెట్టుబడి పాఠాలు చెప్పేవారు. బఫెట్ మొదట్లో ఒక గ్యాస్ స్టేషన్‌ను ప్రారంభించారు. కానీ నష్టం వచ్చింది. అయినప్పటికీ వ్యాపారం చేయాలనే తన పట్టుదలను మాత్రం వదలలేదు. అవకాశాలు అనేవి తరచూ రావు, ఎప్పుడో ఒకసారి వస్తాయి, అవి వచ్చినప్పుడు ఆకాశం నుంచి బంగారం కురిస్తే బకెట్ పెట్టాలి కానీ.. చిన్న గ్లాస్ కాదు.. అనే సూత్రాన్ని బఫెట్ బలంగా నమ్ముతారు. అందుకనే ఆయన ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా మారారు.
కాగా బఫెట్ కు ప్రస్తుతం ఉన్న సంపదలో 99 శాతం సంపదను ఆయన తనకు 50 ఏళ్లు వచ్చిన తరువాతే సంపాదించడం విశేషం. బఫెట్ ఆన్‌లైన్‌లో బ్రిడ్జి గేమ్ ఆడుతారు. టి-బోన్ యూజర్‌నేమ్ పేరిట ఆయన ఆ గేమ్‌ను ఆడుతారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్, బఫెట్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. బఫెట్ పెద్ద ఫుట్‌బాల్ ఫ్యాన్. బర్గర్, చెర్రీ కోలా అంటే ఆయనకు చాలా ఇష్టం. చారిటీలకు ఆయన 25 బిలియన్ డాలర్లకు పైగా విరాళాలు ఇచ్చారు. తన ఆస్తిలో కేవలం 1 శాతాన్ని మాత్రమే తన వారసులకు ఇస్తానని, 99 శాతం మొత్తాన్ని దానం చేస్తానని బఫెట్ గతంలోనే ప్రకటించారు.
2017 వరకు బఫెట్‌కు వచ్చే రోజు వారీ ఆదాయం విలువ 220 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. అది ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటుందని భావిస్తున్నారు. బఫెట్ ప్రస్తుత ఆస్తి విలువ 80 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. కానీ ఆయన ఇప్పటికీ 1957లో 31,500 డాలర్లతో కొనుగోలు చేసిన ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. అంకితభావం, పట్టుదల, శ్రమ ఉంటే ఎవరైనా దేన్నయినా సాధించవచ్చని బఫెట్ చెబుతారు. జీవితంలో అత్యంత విజయవంతం అయిన వారు తాము ప్రేమించే పనినే చేస్తారని అంటారు.