Advertisement
సుమారుగా 50 ఏళ్ల కిందటి టీవీలు, రేడియోలు, ఫోన్లు, కెమెరాలు, కుట్టు మిషన్లు మీ దగ్గర ఉంటే వాటిని రూ.లక్షలకు అమ్మవచ్చు.. అంటూ ప్రస్తుత తరుణంలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అందుకనే చాలా మంది వాటి కోసం తెగ వెతుకుతున్నారు. కొందరైతే ఆయా వస్తువులను సేకరించేందుకు ప్రత్యేకంగా ఏజెన్సీలనే పెట్టుకుంటున్నారు. అయితే ఇంతకీ అసలు ఆ వస్తువులకు ఎందుకంత డిమాండ్ పెరిగింది ? వాటి కోసం రూ. లక్షలు ఎందుకు ఇస్తామంటున్నారు ? అంటే…
పాత టీవీలు, రేడియోలకు రూ. 10 లక్షల వరకు ఇస్తామంటూ ఇప్పుడు అనేక మంది వాటిని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటే.. ఆయా వస్తువుల్లో రెడ్ మెర్క్యురీ అనే పదార్థం ఉంటుందని, దాన్ని రూ.కోట్లకు అమ్మవచ్చని, దాంతో అణు బాంబులు తయారు చేస్తారు కనుకనే దానికి ఇప్పుడు డిమాండ్ పెరిగిందని.. అందుకనే ఆయా వస్తువుల్లో ఉండే రెడ్ మెర్క్యురీని వెలికి తీసేందుకు అనేక మంది యత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
Advertisement
అయితే నిజానికి రెడ్ మెర్క్యురీ అనేది నిజానికి ఒక పదార్థమే కానీ.. ఒక మూలకం కాదని సైంటిస్టులు అంటున్నారు. మెర్క్యురీ (పాదరసం)తో పలు పదార్థాలను కలిపితే ఎరుపు రంగులోకి మారుతాయని దాన్నే కొందరు రెడ్ మెర్క్యురీ అని ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. అయితే పాత టీవీలు, రేడియోలు తదితర వస్తువుల్లో రెడ్ మెర్క్యురీగా పిలవబడే ఓ ద్రవం నిజానికి చిన్న ట్యూబ్‌లో ఉంటుంది. కనుక రెడ్ మెర్క్యురీ అనేది ఉంది. కానీ అందరూ అనుకుంటున్నట్లుగా దాని ధర రూ. కోట్లలో ఉండదని, మార్కెట్‌లో మనకు రెడ్ మెర్క్యురీ ఉండే కాయిల్స్ కేవలం రూ.10కే దొరుకుతాయని అంటున్నారు. అందువల్ల రెడ్ మెర్క్యురీ కోసం పాత టీవీలు, రేడియోలను కొంటామని ఎవరైనా చెబితే నమ్మి మోసపోకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు.
Advertisements
Advertisements
ఇక రెడ్ మెర్క్యురీని బాంబుల తయారీలో వాడుతారనే విషయం కూడా అవాస్తవమని సైంటిస్టులు అంటున్నారు. జనాలను తప్పుదోవ పట్టిస్తూ వారిని మోసం చేసేందుకు ఇప్పుడీ విషయాన్ని తెరపైకి తెచ్చారని, కానీ గతంలోనూ రెడ్ మెర్క్యురీ పట్ల ఇలాంటి పుకార్లు వచ్చాయని అంటున్నారు. కనుక పాత టీవీలు, రేడియోలకు రూ. లక్షలు ఇస్తామంటూ ఎవరైనా చెబితే నమ్మకూడదని హెచ్చరిస్తున్నారు. రెడ్ మెర్క్యురీ మోసాలు ప్రస్తుతం పెరిగిపోతున్న తరుణంలో ఈ విషయం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. అన్ని రసాయనాల్లాగే రెడ్ మెర్క్యురీ అనేది కూడా ఒక ప్రత్యేకమైన పదార్థమని, అంతకు మించి దానికి ఎలాంటి ప్రత్యేకతా లేదని అంటున్నారు. ఒకప్పుడు టీవీల్లో రెడ్ మెర్క్యురీ కలిగిన ట్యూబ్‌లను తరంగాల నాణ్యతను పెంచేందుకు వాడేవారని, ఇప్పుడు వాటి స్థానంలో డయోడ్స్‌ను ఉపయోగిస్తున్నారని తెలిపారు. కనుక ఈ విషయంపై అవగాహన కలిగి ఉండాలన్నారు.