Advertisement
చంద్రునిపై పరిశోధనలు చేసేందుకు గాను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2019 సెప్టెంబర్ 7న చంద్రయాన్ 2ను ప్రయోగించిన విషయం విదితమే. విక్రమ్ ల్యాండర్ ద్వారా ప్రజ్ఞాన్ రోవర్‌ను చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలనుకున్నారు. కానీ విక్రమ్ ల్యాండర్‌తో చివరి నిమిషంలో కమ్యూనికేషన్ కట్ అయింది. దీంతో విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై కూలిపోయింది. అయితే తాజాగా ప్రజ్ఞాన్ రోవర్ చంద్రునిపై ఇంకా పనిచేస్తూనే ఉన్నట్లు గుర్తించారు.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 2019 నవంబర్ నెలలో చంద్రునిపై విక్రమ్ ల్యాండర్‌కు సంబంధించిన వ్యర్థాలను ఫొటోలు తీసింది. అయితే అంత స్పష్టంగా రాలేదు. కానీ జనవరి 4న మరోమారు నాసా ఫొటోలు తీసింది. వాటిని మే నెలలో విడుదల చేసింది. ఈ క్రమంలో సదరు ఫొటోలను పరిశీలించిన చెన్నైకి చెందిన షణ్ముగ సుబ్రమణియన్ అనే టెక్కీ విక్రమ్ వ్యర్థాలను గుర్తించాడు. అలాగే విక్రమ్ ల్యాండర్ హార్డ్ ల్యాండింగ్ అయిన ప్రదేశం నుంచి ప్రజ్ఞాన్ రోవర్ కొన్ని మీటర్ల పాటు ముందుకు కదిలినట్లు కూడా గుర్తించాడు. దీంతో ఆ ఫొటోలతో సహా వివరాలను అతను ఇస్రోకు పంపాడు.
Advertisement
కాగా షణ్ముగ సుబ్రమణియన్ పంపిన చిత్రాలను ఇస్రో అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ కె.శివన్ మీడియాతో మాట్లాడుతూ.. ఇదే విషయమై నాసా నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. అయితే షణ్ముగ సుబ్రమణియన్ పంపిన చిత్రాలను ప్రస్తుతం తాము పరిశీలిస్తున్నామని అన్నారు. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ హార్డ్ ల్యాండింగ్ అయిన ప్రదేశం నుంచి ప్రజ్ఞాన్ రోవర్ కొన్ని మీటర్ల దూరం ముందుకు కదిలిందనే విషయంపై తాము ఇప్పుడే ఏమీ చెప్పలేమని, ఆ ఫోటోలను క్షుణ్ణంగా పరిశీలించాకే అసలు విషయం తెలుస్తుందని అన్నారు.
అయితే చంద్రుడిపై ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ ముందుకు కదిలేందుకు దానికి కావల్సిన శక్తి ఎక్కడి నుంచి లభించిందనే విషయంపై కూడా ప్రస్తుతం తాము పరిశోధనలు చేస్తున్నామని ఇస్రో తెలిపింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కూలిపోయే ముందు దాని నుంచి ఏమైనా శక్తి ప్రజ్ఞాన్ రోవర్‌కు అంది ఉండవచ్చని లేదా… ఇస్రో నుంచి పంపిన ఆదేశాలను స్వీకరించి ప్రజ్ఞాన్ రోవర్ దానికదే ముందుకు కదిలి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే నిజంగా ప్రజ్ఞాన్ రోవర్ గనక చంద్రుడిపై ఇంకా పనిచేస్తూ ఉంటే.. అది అద్భుతమనే చెప్పవచ్చు. దాంతో ఇస్రో మళ్లీ సంబంధాలను పునరుద్ధరించి దాంతో కమ్యూనికేట్ అయ్యేందుకు, తద్వారా చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు వీలు కలుగుతుంది. అదే జరిగితే చంద్రయాన్ 2 విఫలమై సక్సెస్ అయినట్లే అవుతుంది. మరి అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి.
Advertisements
Advertisements