Advertisement
అది 1983వ సంవత్సరం. ఇంగ్లండ్‌లో టీమిండియా వరల్డ్ కప్ ఆడుతోంది. అప్పట్లో ఇండియన్ టీంపై పెద్దగా ఎవరిలోనూ అంచనాలు లేవు. బుకీలు కూడా 66-1 తో ఇండియాకు బెట్టింగ్ నిర్వహించారంటే.. ఇండియా జట్టు పరిస్థితి అప్పుడు ఏమిటో అర్థం చేసుకోవచ్చు. వరల్డ్ కప్‌లోకి అసలు ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగింది. ఈ క్రమంలోనే జింబాబ్వేతో మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ సందర్భంగా స్కోరు బోర్డుపై 9/4 అని కనిపించింది.
భారత జట్టు అప్పటికే గవాస్కర్, శ్రీకాంత్, అమర్‌నాథ్, సందీప్ పాటిల్ వికెట్లను కోల్పోయింది. ఆ మ్యాచ్‌కు అయాజ్ మెమాన్ ఆలస్యంగా వచ్చాడు. ఏం జరుగుతుంది అని గుండప్ప విశ్వనాథ్‌ను అడిగాడు. అందుకు ఆయన బదులిస్తూ.. మరేం ఫర్లేదు, కంగారు పడాల్సిన పనిలేదు అని సమాధానం ఇచ్చాడు. అయితే అదే సమయంలో భారత ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ బరిలోకి దిగాడు. యశ్‌పాల్ శర్మతో కలిసి కొన్ని పరుగులు చేశాడు. కానీ యశ్‌పాల్ అవుట్ అవడంతో స్కోరు బోర్డు 17/5 కు మారింది. భారత జట్టు పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. జింబాబ్వే విజయం ఇక సునాయాసమే అని అంతా భావించారు. కానీ కపిల్ దేవ్ మిగిలిన బ్యాట్స్ మెన్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు.
Advertisement
రోజర్ బిన్నీ (22)తో కలిసి 60 పరుగులు, మదన్‌లాల్ (17)తో కలిసి 62 పరుగుల భాగస్వామ్యాలను నెలకొల్పాడు. వారి తరువాత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సయ్యద్ కిర్మాణీతో కలిసి 9వ వికెట్‌కు ఏకంగా కపిల్ 126 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో కపిల్ దేవ్ వ్యక్తిగత స్కోరు 100 నుంచి 175కు చేరుకునేందుకు కేవలం 38 బంతులు మాత్రమే అవసరం అయ్యాయి.
అప్పట్లో వన్డే క్రికెట్‌లో 65 నుంచి 70 స్ట్రైక్ రేట్ ఉంటే గొప్ప. 80 ఉంటే అద్భుతంగా ఆడినట్లు లెక్క. కానీ కపిల్ 200 స్ట్రైక్ రేట్‌తో రన్స్ సాధించాడు. అంటే అతను ఏ విధంగా విజృంభించాడో మనకు ఇట్టే అర్థమవుతుంది. ఈ క్రమంలోనే కపిల్ దేవ్ వీరోచిత ఇన్నింగ్స్ తో భారత్ 8 వికెట్లకు 266 పరుగులు చేసింది. 17/5 ఉన్న స్కోరు అంత వరకు వచ్చిందంటే అది కపిల్ చలవే. దీంతో ఆ మ్యాచ్‌లో భారత్ జింబాబ్వేపై 34 పరుగుల తేడాతో గెలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. తరువాత భారత్ ఇంగ్లండ్‌తో సెమీస్ లో తలపడి గెలిచింది. అనంతరం ఫైనల్‌లో అప్పటి మేటి జట్టు వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించి వన్డే వరల్డ్ కప్‌ను తొలిసారి అందుకుంది. ఆ తరువాత పరిమితి ఓవర్ల క్రికెట్ దశను, భారత్ లో క్రికెట్ రంగాన్ని కపిల్ ఇన్నింగ్స్ పూర్తిగా మార్చేసింది. అప్పటి నుంచి భారత్‌లో క్రికెట్ ఫ్యాన్స్ పెరిగిపోయారు.
Advertisements
Advertisements
కాగా ఈ విషయాలను అయాజ్ మెమాన్ ఇటీవల ప్రేక్షకులతో పంచుకున్నారు. గౌరవ్ కపూర్ అనే క్రికెట్ వ్యాఖ్యాతకు చెందిన 22 యార్డ్స్ అనే పాడ్‌కాస్ట్‌లో మెమాన్ ప్రేక్షకులతో మాట్లాడుతూ అప్పటి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.