Advertisement
ప్రపంచమంతా కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ రష్యా దేశం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్‌ను ఆ దేశం విడుదల చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన ఇద్దరు కుమార్తెల్లో ఒక కుమార్తెకు ఆ వ్యాక్సిన్‌ను ఇప్పించారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని పుతిన్ తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌ను ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు.
రష్యా దేశ రక్షణ విభాగం, అక్కడి గమలియా రీసెర్చి ఇనిస్టిట్యూట్‌లు సంయుక్తంగా కలిసి కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి. ఈ వ్యాక్సిన్‌కు గాను జూన్ 18న క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. మొత్తం 38 వాలంటీర్లకు టీకా ఇచ్చారు. వారందరిలోనూ కరోనా వైరస్ పట్ల రోగ నిరోధకత పెరిగిందని గుర్తించారు. ఈ క్రమంలో వారిలో మొదటి గ్రూప్‌ను జూలై 15న, రెండో గ్రూప్‌ను జూలై 20న డిశ్చార్జి చేశారు. అనంతరం ఫేజ్ 2 ట్రయల్స్ చేపట్టారు. అయితే ఫేజ్ 3 ట్రయల్స్ ప్రారంభంలో ఉండగానే రష్యా కోవిడ్ వ్యాక్సిన్‌ను విడుదల చేసింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా సైంటిస్టులు, వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
రష్యా ప్రభుత్వం ఫేజ్ 3 ట్రయల్స్ ముగియకుండానే వ్యాక్సిన్‌ను పంపిణీకి సిద్ధం చేయడం సరికాదన్నారు. పూర్తిగా అన్ని ట్రయల్స్ ముగిశాకే వ్యాక్సిన్‌ను అందించాలని అన్నారు. ఇలా చేయడం వల్ల వ్యాక్సిన్ తీసుకున్న వారిలో అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయన్నారు. కాగా వ్యాక్సిన్ పట్ల ఎప్పటికప్పుడు సమాచారాన్ని, ట్రయల్స్ డెవలప్‌మెంట్‌ను గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలుసుకున్నారు. అక్కడి ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్ మురాష్కో వ్యాక్సిన్ పట్ల ప్రత్యేక చొరవ తీసుకుని దాన్ని వేగంగా అందుబాటులోకి వచ్చేలా చేశారు.
అయితే రష్యాలో సాధారణ ప్రజలకు అక్టోబర్ నుంచి వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. ప్రస్తుతం అక్కడ అత్యవసర సేవలు అందిస్తున్న సిబ్బందితోపాటు.. కోవిడ్ కాకుండా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి.. కరోనా వచ్చే రిస్క్ ఎక్కువగా ఉన్నవారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే మరోవైపు ఫ్లూ వ్యాధికి కూడా రష్యా ఇప్పుడే వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనుంది. ఇందుకు గాను వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని ఆ దేశం అక్కడి డ్రగ్ మానుఫాక్చరింగ్ సంస్థలకు సూచించింది. అందుకు పెద్ద ఎత్తున నిధులను కూడా రష్యా వారికి అందించనుంది.
Advertisements
Advertisements