Advertisement
అనుకోకుండా అదృష్టం కలిసి వస్తే బాగానే ఉంటుంది. కానీ అలా కలసి వచ్చిన అదృష్టాన్ని నిలబెట్టుకోగలగాలి. మంచి కోసం దాన్ని వినియోగించాలి. లేదంటే జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. అవును.. సరిగ్గా ఆ కేబీసీ విన్నర్ జీవితం కూడా ఇలాగే మారింది. కానీ ఎట్టకేలకు అతను దాని నుంచి పూర్తిగా బయటపడ్డాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
2011లో కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ) 5వ సీజన్ లో సుశీల్ కుమార్ అనే వ్యక్తి విన్నర్‌గా నిలిచి ఏకంగా రూ.5 కోట్లను గెలుచుకున్నాడు. అయితే అంత భారీ మొత్తంలో డబ్బు వచ్చినా అతని జీవితం మాత్రం అస్తవ్యస్తంగా మారింది. మొదట్లో బీహార్‌లో టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు. దీంతో చదువు అటకెక్కింది. కేబీసీ విన్నర్ కావడంతో అతను సెలబ్రిటీ అయ్యాడు. టీవీ చానల్ వారు అతన్ని ఎప్పుడూ వెంబడిస్తూ ఏం చేస్తున్నావని అడిగే వారు. అతని ఇంటర్వ్యూలు తీసుకున్నాడు. తరువాత పలు బిజినెస్‌లలో డబ్బు పెట్టుబడి పెట్టాడు. కానీ వాటిల్లో నష్టాలు వచ్చాయి. కొంత కాలం పాటు నెలకు రూ.50వేల చొప్పున డబ్బును సామాజిక సేవా కార్యక్రమాల కోసం విరాళంగా ఇచ్చాడు.
Advertisement
ఇక సుశీల్‌కు అతని భార్యతోనూ మనస్ఫర్థలు వచ్చాయి. ఆమెతో విడిపోయేదాకా పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో అతను ఢిల్లీకి మకాం మార్చాడు. కానీ అక్కడ అతను మద్యపానం, ధూమపానం వంటి చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. అయితే కొందరి సలహాతో అతను సినిమా తీద్దామని ముంబైకి వచ్చాడు. అక్కడ అతని పరిస్థితి మరింత దిగజారిపోయింది. టీవీ షోలకు స్క్రిప్ట్‌లు రాసుకుంటూ బతికాడు.
అయితే సుశీల్ 2016 తరువాత మద్యపానానికి గుడ్ బై చెప్పాడు. గతేడాది నుంచి స్మోకింగ్ మానేశాడు. టీచర్‌గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. కేబీసీ విన్నర్ అయినప్పటి నుంచి 2016 వరకు.. అంటే దాదాపుగా 5 ఏళ్ల పాటు అతని జీవితం అస్తవ్యస్తంగా మారింది. అయితే ఇప్పుడే మళ్లీ కొత్త జీవితం ప్రారంభించాడు. ఈ విషయాలన్నంటినీ అతనే స్వయంగా తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వెల్లడించాడు. అయితే తనకు కేబీసీ షో ద్వారా భారీగా వచ్చిన డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో తెలియకపోవడం వల్లే అతని పరిస్థితి అలా మారిందని మనకు అర్థమవుతుంది.
Advertisements
Advertisements