Advertisement
మన దేశంలోని అనేక పురాతనమైన, చారిత్రక ఆలయాల్లో ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం కూడా ఒకటి. ఈ దేవాలయం అనేక వింతలు, విశేషాలను కలిగి ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణశైలి చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మనం నిత్యం అనుసరించే సమయానికి, ఈ ఆలయానికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. అందుకు అనుగుణంగా ఈ ఆలయంలో పలు నిర్మాణాలు ఉంటాయి.
ఆలయంలో 24 చక్రాలు, 7 గుర్రాలతో ఓ రథం లాగుతున్నట్లు నిర్మాణం ఉంటుంది. ఆ చక్రాల్లో రోజులోని 8 భాగాలను సూచించే విధంగా 8 రేఖల లాంటి నిర్మాణాలు ఉంటాయి. మన పూర్వీకులు ఒక రోజును 8 భాగాలుగా విభజించారు. దాన్ని ప్రతిబింబించేలా ఆ 8 పుల్లలు (రేఖలు) ఉంటాయి.
Advertisements
కోణార్క్ సూర్య దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఒడిశాలోని పూరీ నుంచి 35 కిలోమీటర్లు, భువనేశ్వర్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణం ఏకీకృతంగా ఉంటుంది. ఇలాంటి నిర్మాణం ప్రపంచంలోని ఇతర ఏ ఆలయంలోనూ మనకు కనిపించదు. దీన్ని పూర్తిగా రాళ్లతోనే నిర్మించారు. అలాగే రాళ్లపై అద్భుతమైన డిజైన్లను తీర్చిదిద్దారు.
Advertisement
ఈ ఆలయంలో ఉండే 12 జతల రథ చక్రాలు (మొత్తం 24 చక్రాలు) ఏడాదిలో 12 రాశులను, 12 నెలలను సూచిస్తాయి. అలాగే 7 గుర్రాలు వారంలో 7 రోజులను సూచిస్తాయి. ఉదయాన్నే ముందుగా సూర్యుని వచ్చే కిరణాలు ఈ ఆలయ ప్రధాన ద్వారం వద్ద పడతాయి.
ఇక ఈ ఆలయంలోని రథానికి ఉండే చక్రాలు సన్ డయల్‌లా పనిచేస్తాయి. అంటే.. వాటిని చూసి సరిగ్గా అప్పుడు టైం ఎంతవుతుందో సులభంగా చెప్పేయవచ్చన్నమాట. ఈ ఆలయాన్ని మాగ్నటైట్ (సూదంటురాయి) రాళ్లతో నిర్మించారు. అందువల్ల సూర్యదేవుని విగ్రహం గాలిలో తేలుతుంది.
ఈ ఆలయంలో పలు నిర్మాణాల్లో అయస్కాంత రాళ్లను ఎక్కువగా వాడడం వల్ల సమీపంలోని సముద్రంలో ప్రయాణించే ఓడలకు దిశ గుర్తించడం కష్టతరమవుతుందని అప్పట్లో పోర్చుగీసు వారు భావించారు. దీంతో ఆలయ నిర్మాణంలో అక్కడక్కడా ఉన్న సదరు రాళ్లను వారు తొలగించారు. అయితే ఆలయంలో ఇతర ప్రదేశాల్లో నిర్మాణాలు క్రమంగా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.
పరిశోధకులకు గతంలో ఈ ఆలయానికి సంబంధించిన వివరాలతో కూడిన 23 తాళపత్రాలు దొరికాయి. వాటిని బట్టి ఈ ఆలయం 16వ శతాబ్దంలో అసలైన స్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది. దాన్ని అంతకు ముందే నిర్మించి ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఈ ఆలయం క్రమంగా శిథిలావస్థకు చేరుకుంటోంది.
ఆలయ ప్రాకారం ఎత్తు 30 మీటర్లు ఉంటుంది. ఆలయంపై ఉండే అనేక శిల్పాలు మనల్ని ఆకట్టుకుంటాయి. కాగా ఈ ఆలయాన్ని నిర్మించేందుకు 16 సంవత్సరాలు పట్టిందని చెబుతారు. ఇందుకుగాను సుమారుగా 1200 మంది శిల్పులు పనిచేశారట. నిత్యం ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు కోణార్క్ సూర్య దేవాలయాన్ని తెరిచి ఉంచుతారు. ఆలయానికి సమీపంలో పురావస్తు శాఖ వారి మ్యూజియం ఉంది. ఆలయానికి సంబంధించిన పలు శిథిలమైన నిర్మాణాలు, ఇతర ముఖ్యమైన వస్తువులను ఇందులో మనం చూడవచ్చు. దీన్ని నిత్యం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంచుతారు.
Advertisements