Advertisement
ఊపిరి ఉనికిని ఏ అంతు చిక్కని తెగులో తొలిచివేయడానికి
విశ్వప్రయత్నం చేస్తున్న వేళ……
దారులన్నీ మూసేసిన నిర్భంధ స్వేచ్ఛా నీడలో
ప్రపంచమంతా శూన్యం మేటలేసుకున్న ఎడారి డేరాలా అనిపిస్తోంటే……
రిక్తహస్తాల లోగిళ్ళల్లో దేశాలకు దేశాలే
న్మాశాన వైరాగ్యాల్ని ఎలిజీల్లా తలపోస్తున్న వేళ….నిన్ను కట్టేసిన అంక్షలకంచెలు నిన్ను చేష్టలుడిగినవాడిలా చేస్తుంటే…
నిన్ను నువ్వు నాటుకున్న ఇంటరి ద్వీపంలోనే
ఊపిరిపూల పంటలు పండించే కొత్త ఋతువై నువ్ మొలకెత్తాలి.
ఇంకిపోయిన ఆశల చెలమల్లో ప్రాణధారా నీటి ఊటై ఉబకాలి.అయినా నీకిదేం కొత్త కాదుగా?!
ఎన్ని ఉపద్రవాల ఉప్పెనలు నీ బ్రతుకు వాకిలిని శోకసంద్రాలుగా చేసిపోలేదూ?!
ఎన్ని చీడపీడలు నీ కలల పంటల్ని నిలువునా నాకేసి నష్టాలపాల్జేసి పోలేదూ?
కాలం కొమ్మకు ప్రేమగా పూసిన ఊపిరి మొగ్గలు కళ్ళెదుటే రాలిపోతున్నా..
చెదరని గుండె నిబ్బరమై ఎన్నిసార్లు కన్నీటి వాగుల్ని నువ్ దాటిపోలేదూ..?!
ఇప్పుడు…….
కనిపించని కరోనా మేఘమేదో అకస్మాత్తుగా కమ్ముకున్న వేళ
గాలిపటమై స్వేఛ్చగా ఎగిరిన ప్రపంచపటం క్వారంటైన్ ఖైదై మాయమైన వేళ
దిశను మార్చుకుని మనిషి ఊపిరితీరం మీదకు ఒక్కసారిగా విరుచుకుపడ్డ ప్రాకృతిక విపత్తు
నిన్ను దిగులు గూడు చేసినా, ఇంట్లోనే ఖైదు చేసినా
సడలని ధూర్యపు గింజయి నువ్ మొలకెత్తాలి
మొక్కవోని ఆత్మవిశ్వాసం నీ ఊపిరి చిరునామా కావాలి
నువ్వో నడుస్తున్న సైన్యానివి……
———————దాకరపు బాబూ రావు ( తిరువూరు)
పై కవిత…భారతీయ జనతా యువమోర్చ నిర్వహించిన కవితల పోటీల్లో ప్రథమ బహుమతి గెలుపొంది 20,000 రూపాయల ప్రైజ్ మనీని గెలుపొందింది.
Advertisement
Advertisements
కరోనా నేపథ్యంలో….మానవజాతి ఎదుర్కొన్న అంశాలపై, మానసిక స్థితిపై BJYM కవితలు , కథల పోటీ నిర్వహించింది. వీటిలో ఎంపిక చేసిన వాటిని AP BJP రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ఊపిరిపూలు పేరుతో ఓ సంకలనంగా తీసుకొచ్చారు. ఈ పుస్తకాన్ని BJP జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ ఆవిష్కరించారు.
పుస్తకావిష్కరణ సందర్భంగా సునీల్ దియోధర్ మాట్లాడుతూ….. ఈ పుస్తకం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కరోనా గురించి ప్రజలు మర్చిపోవొచ్చు కానీ ఈ సమయంలో ప్రజల భావోద్వేగాలను ఒడిసి పట్టేలా కవులూ రచయితలు చేసిన ఈ రచనలు చిరకాలం నిలిచుంటాయని అన్నారు.
AP BJP రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు మాట్లాడుతూ….. కరోనా కష్టకాలంలో ప్రజల కడగండ్లు గ్రంధస్తం చేయాలన్న సంకల్పంతోనే ఈ పుస్తకాన్ని తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ పుస్తకంలోని కథలు, కవితలను ఇంగ్లీష్, హిందీ భాషల్లోకి అనువదించి అచ్చు వేపిస్తామన్నారు.
బహుమతులు గెల్చుకున్న కథలు, కవితలు
కథల విభాగం
- మొదటి బహుమతి- 20వేలు- వెంట వచ్చునది- రచయిత్రి: శేషారత్నం
- రెండవ బహుమతి- 10వేలు- వారియర్- రచయిత: శరత్ చంద్ర
Advertisements
కవితల విభాగం
- మొదటి బహుమతి- 20వేలు- కొత్త ఋతువు- దాకారపు బాబురావు
- రెండవ బహుమతి- 10వేలు- మహా నిష్క్రమణం- చొక్కారపు తాతారావు