Advertisement
7 గురు…80 రూపాయలు లోన్ తీసుకొని స్టార్ట్ చేసిన కంపెనీ…ఇప్పడు 1600 కోట్ల రూపాయల కంపెనీ అయ్యింది! ఆ కంపెనీ పేరు లిజ్జత్ పాపడ్…. అసలు లిజ్జత్ పాపడ్ ఎలా ప్రారంభమైందంటే…
1959లలో బాంబే (ఇప్పుడు ముంబై)లో జశ్వంతిబెన్ పోపట్, జయాబెన్ విధలాని, పార్వతి బెన్ తోడని, ఉజమ్‌బెన్ కుందాలియా, బనుబెన్ తన్నా, చుతద్‌బెన్ గవాడె, లగుబెన్ గోకని అనే ఏడుగురు గుజరాతీ మహిళలు కలిసి తమ ఇండ్లలో బంగళాలపై అప్పడాలను తయారు చేసి వాటిని స్థానికంగా ఉన్న మార్కెట్లకు వెళ్లి అమ్మడం మొదలు పెట్టారు. తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో వారు తమ కుటుంబాలకు తమకు తోచినంత అండగా నిలబడేందుకు డబ్బులు సంపాదించాలని చెప్పి అలా అప్పడాలను తయారు చేసి అమ్మడం మొదలు పెట్టారు. వారికి చదువు పెద్దగా రాదు.. అందువల్ల ఉద్యోగాలకు వెళ్లే అవకాశం లేదు. కనుక వారు ఈ విధంగా పనిచేయడం మొదలు పెట్టారు.
ఇక ఆ ఏడుమందికి పురుషోత్తం దామోదర్ దత్తాని అనే వ్యక్తి సహాయం చేశాడు. దీంతో వారు తమ అప్పడాలను లోకల్ స్టోర్లకు పంపేవారు. అలాగే ఆనంద్‌జీ ప్రేమ్‌జీ అండ్ కంపెనీకి తమ అప్పడాలను సరఫరా చేసే వారు. ఈ క్రమంలో దినదిన ప్రవర్ధమానం అన్నట్లుగా వారి అప్పడాలకు మరింత గిరాకీ పెరిగింది. తొలి రోజు వారు ఒక కిలో అప్పడాలను అమ్మగా 8 అణాలు వచ్చాయి. తరువాతి రోజు 2 కిలోల అప్పడాలను అమ్మారు. రూ.1 వచ్చింది. దీంతో వారు ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని మరిన్ని అప్పడాలను తయారు చేసి అమ్మడం మొదలు పెట్టారు. తరువాత 3, 4 నెలలకు వారి బృందం 200కు పెరిగింది. వాడాలాలో రెండో బ్రాంచ్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఏడాదికి రూ.6వేల దాకా అమ్మకాలు జరిగాయి. అప్పట్లో అంత మొత్తం సంపాదించడం అంటే మాటలు కాదు.
Advertisements
తరువాత వారి బృందంలో చేరుతున్న మహిళల సంఖ్య పెరుగుతుండడంతో వారు ఛగన్‌లాల్ కారామ్సీ పరేఖ్ అనే సామాజిక కార్యకర్త నుంచి కొంత డబ్బును అప్పుగా తీసుకున్నారు. తరువాత వారు తమ కార్యకలాపాలను పెంచారు. కానీ ఎక్కడా వారు తమ డబ్బును పబ్లిసిటీ కోసం, మార్కెటింగ్ కోసం ఖర్చు చేయలేదు. వారికి లభించిన పాపులారిటీ అంతా.. మౌత్ పబ్లిసిటీ ద్వారా వచ్చిందే కావడం విశేషం. ఈ క్రమంలో వారు 1966లో తమ కంపెనీని రిజిస్టర్ చేయించారు. ఇక అదే ఏడాది వీరి పరిశ్రమకు విలేజ్ ఇండస్ట్రీగా గుర్తింపు లభించింది. అదే వారి కంపెనీకి టర్నింగ్ పాయింట్ అయింది.
అలా లిజ్జత్ కంపెనీ ప్రారంభమయ్యాక 62 ఏళ్లకు వారి కంపెనీ 45వేల మహిళా సిబ్బందితో అతి పెద్ద కోఆపరేటివ్ పరిశ్రమగా ఆవిర్భవించింది. 1968లో గుజరాత్‌లోని వలోడ్‌లో లిజ్జత్ మహారాష్ట్ర అవతల తమ మొదటి బ్రాంచ్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ పరిశ్రమకు దేశవ్యాప్తంగా 82 బ్రాంచులు ఉన్నాయి. 15 దేశాలకు వీరు అప్పడాలను ఎగుమతి చేస్తారు. అయితే తరాలు మారినా లిజ్జత్ పాపడ్ రుచి, నాణ్యత ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అదీ వారి గొప్పతనం.
Advertisement
వీరు ప్రస్తుతం కేవలం అప్పడాలు మాత్రమే కాకుండా.. గోధుమపిండి, మసాలాలు, డిటర్జెంట్ పౌడర్, లాండ్రీ సోప్ తదితర ఉత్పత్తులను కూడా తయారు చేస్తున్నారు. అయితే లిజ్జత్ పాపడ్ అంత పెద్ద పరిశ్రమగా ఆవిర్భవించేందుకు గల కారణం అందులో 1959 నుంచి మెయింటెయిన్ చేస్తున్న రుచి, నాణ్యతేనని చెప్పుకోవచ్చు. అలా మెయింటెయిన్ చేశారు కాబట్టే.. ఇప్పటికీ లిజ్జత్ పాపడ్‌కు ఏమాత్రం ఆదరణ తగ్గలేదు.
లిజ్జత్ పాపడ్ తయారీకి మినుములు, ఇంగువ, నల్ల మిరియాలు తదితర పదార్థాలను వాడుతారు. రుచి చక్కగా ఉండేందుకు గాను అన్ని పదార్థాలను ఎంపిక చేసిన ప్రదేశాల నుంచి తెప్పిస్తారు. ఇక వాటిని పూర్తిగా పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తారు. అన్ని అప్పడాలు ఒకే సైజులో వచ్చేందుకు వర్కర్లకు ఒకే సైజు ఉన్న అచ్చులను అందిస్తారు. ఇక అప్పడాలను శుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తున్నారా.. లేదా.. అనే వివరాలను తెలుసుకునేందుకు పరిశ్రమ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు భిన్న బ్రాంచులకు వెళ్లి ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తారు. అందుకనే లిజ్జత్ పాపడ్ ఇప్పటికీ రుచికి రుచి, నాణ్యతకు నాణ్యతను కలిగి ఉంటాయి.
Advertisements
ఇక లిజ్జత్ పరిశ్రమలో పనిచేసే మహిళలు అవసరం అనుకుంటే ఇంటి వద్దే పనిచేసే వెసులుబాటు కల్పిస్తారు. ఇంటి వద్ద పనిచేసే వారు ఉదయం 4.30 గంటలకే పని ప్రారంభిస్తారు. బ్రాంచిల వద్ద పనిచేసే వారి కోసం ప్రత్యేక రవాణా సదుపాయం ఉంటుంది. అందువల్లే శ్రీ మహిళా గృహ ఉద్యోగ్ లిజ్జత్ పాపడ్ (ఎస్ఎంజీయూఎల్‌పీ) దేశంలోనే అతి పెద్ద స్వయం సహాయక, స్వయం సాధికారత సాధించిన మహిళా సంస్థగా ఆవర్భవించింది. ఇందులో మహిళలు తాము కావాలనుకుంటే ఏ విభాగంలోనైనా పనిచేయవచ్చు. ఇక మహిళలు అందరికీ సమానమైన బెనిఫిట్స్ లభిస్తాయి.
కంపెనీ నుంచి మహిళలు రుణం పొందవచ్చు. పిల్లలకు చదువులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తారు. అలాగే చదువుకోని మహిళలను అక్షరాస్యులుగా మార్చే కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇక మహిళలకు ఎప్పటికప్పుడు తమ పనికి లభించే వేతనంతోపాటు అదనంగా ఇన్సెంటివ్‌లను కూడా ఇస్తారు. అవి నగదు లేదా బంగారం రూపంలో వారికి లభిస్తాయి.
ఇక దేశంలో ప్రస్తుతం అప్పడాలకు గాను అనేక కంపెనీలు పుట్టుకొచ్చాయి. అయినా లిజ్జత్ పాపడ్‌కు ఏవీ పోటీనివ్వలేకపోయాయి. ఎందుకంటే ఇతర కంపెనీల్లో లేనిది.. లిజ్జత్ మాత్రమే ఇచ్చేది.. నమ్మకం.. లిజ్జత్ అంటే తరతరాలుగా పెనవేసుకున్న బంధం అని వినియోగదారులు నమ్ముతారు. అందుకనే ఆ అప్పడాలకు ఇప్పటికీ ఆదరణ లభిస్తోంది.