Advertisement
చరిత్రలో నిజంగా ఒక్కోసారి కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటప్పుడు మనం ఆశ్చర్యచకితులవుతుంటాం. అయితే సరిగ్గా అలాంటి అనుభవమే ఆ బ్రిటిష్ జంటకు ఎదురైంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే… అది 1879వ సంవత్సరం. అప్పుడు మన దేశాన్ని బ్రిటిష్ వారు పాలిస్తున్నారు. ఆఫ్గనిస్థాన్‌లో బ్రిటిష్ లెఫ్టినెంట్ కల్నల్ మార్టిన్ ఆఫ్ అగర్ మల్వా తన సైనిక బృందంతో కలిసి ఆఫ్గన్ పఠాన్లతో యుద్ధం చేస్తున్నాడు.
అయితే కల్నల్ మార్టిన్ తరచూ ఇండియాలో ఉన్న తన భార్యకు ఉత్తరాలు పంపేవాడు. యుద్ధం కొనసాగుతుందని, తాను క్షేమంగా ఉన్నానని తరచూ ఉత్తరాల్లో రాసేవాడు. అయితే ఒకసారి అతని నుంచి ఉత్తరాలు రావడం పూర్తిగా ఆగిపోతుంది. దీంతో మార్టిన్ భార్య దుఃఖానికి లోనవుతుంది. యుద్ధంలో తన భర్తకు ఏం జరిగిందోనని ఆమె ఆందోళన చెందుతుంటుంది. ఈ క్రమంలో ఆమె ఒకసారి గుర్రంపై వెళ్తూ దారిలో ఉన్న బైజ్‌నాథ్ మహాదేవ్ ఆలయం వద్ద ఆగుతుంది.
ఆలయంలో పండితులు శివుడికి పూజలు చేస్తుంటారు. అక్కడ ఆమె దుఃఖ వదనంతో నిలుచుని ఉంటుంది. ఆమెను గమనించిన ఓ పండితుడు దగ్గరికి వచ్చి.. ఏం జరిగిందని అడుగుతాడు. అందుకు ఆమె బదులిస్తూ.. తన భర్త యుద్ధంలో ఉన్నాడని, అతని నుంచి ఎప్పుడూ ఉత్తరాలు వచ్చేవని.. కొద్దిరోజులుగా అవి రావడం లేదని చెబుతుంది. అయితే పండితుడు శివున్ని పూజించాలని అంతా మంచే జరుగుతుందని చెప్పి.. ఆమెకు ఓం నమఃశివాయ మంత్రాన్ని 11 రోజుల పాటు పఠించమని చెబుతాడు.
Advertisement
మార్టిన్ భార్య 11 రోజుల పాటు ఆ మంత్రాన్ని పఠిస్తూ శివుడికి పూజ చేస్తుంది. 11వ రోజు ఆమెకు తన భర్త నుంచి ఉత్తరం వస్తుంది. ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. యుద్ధం ముగిసిందని, తాము విజయం సాధించామని మార్టిన్ అందులో రాస్తాడు. తాము యుద్ధంలో ఉన్నప్పుడు పఠాన్లందరూ ఒక్కసారిగా తమను చుట్టుముట్టారని, తాము కొంచెం ఉంటే చనిపోయేవారమని, అంతలో జటాజూటాలు కలిగిన ఓ యోగి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ.. తమ ఎదుటకు వచ్చే సరికి పఠాన్లందరూ ఆయనను చూసి పారిపోయారని, దీంతో తాము విజయం సాధించామని.. ఉత్తరంలో ఉంటుంది. తరువాత కొద్ది రోజులకు మార్టిన్ ఇంటికి వస్తాడు.
Advertisements
ఇంటికి వచ్చాక మార్టిన్ జరిగిన విషయం తెలుసుకుంటాడు. దీంతో తనను యుద్ధంలో కాపాడింది సాక్షాత్తూ శివుడేనని గ్రహిస్తాడు. తన భార్య తన కోసం చేసిన పూజల వల్లే శివుడు ఆ రూపంలో వచ్చి తనను కాపాడాడని ఆ ఇద్దరు దంపతులూ గ్రహిస్తారు. దీంతో వారు మళ్లీ ఆలయానికి వెళ్లి శివున్ని దర్శించుకుంటారు. అయితే మార్టిన్ భార్య మొదట్లో ఆ ఆలయానికి వచ్చినప్పుడు పండితుడికి తన గోడు చెప్పి దుఃఖించాక.. తన భర్త యుద్ధం నుంచి క్షేమంగా ఇంటికి తిరిగివస్తే ఆలయానికి మరమ్మత్తులు చేసి, పునర్నిర్మిస్తానని మొక్కుకుంటుంది. ఈ క్రమంలో తన భర్త ఇంటికి క్షేమంగా వచ్చాడు కనుక.. ఆమె ఆలయాన్ని మళ్లీ భర్తతో కలిసి దర్శించుకుంటుంది. దీంతో ఆ ఇద్దరూ గుడిని పునర్నిర్మిస్తారు.
ఆలయంలో గోడలపై ఇప్పటికే ఆ కల్నల్ దంపతుల పేర్లు చెక్కబడి ఉంటాయి. ప్రపంచంలో బ్రిటిష్ వారిచే నిర్మింపబడ్డ ఏకైక ఆలయం కూడా ఇదే కావడం విశేషం. ఏది ఏమైనా.. ఇలా జరగడం అద్భుతమనే చెప్పాలి.
Advertisements