Advertisement
అతడో కిరాణాషాప్ లో గుమస్తా. రోజంతా కష్టపడితే అతడికొచ్చేది 20రూపాయలు. చిన్నప్పటి నుండి అతడు అదే షాప్ లో కిరాణా సామాన్లను ప్యాక్ చేస్తూ పెరిగాడు. చాలా నిజాయితి పరుడు. ఓ రోజు ఓ యువతి ఆ షాప్ నుండి ఎగ్స్ తీసుకొని వెళ్లింది. ఇంతలో ఈ కిరాణా షాప్ కుర్రాడు పరిగెత్తుకుంటూ వెళ్లి…, మేడమ్ మీ బ్యాలెన్స్ డబ్బులు అని ఆమె చేతిలో పెట్టాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టు ఆ రోజు కలిసిన ఆ చూపులు నెలలోపే పెళ్ళిచూపులుగా మారి, మూడు నెలల్లో పెళ్లి పీటలకు చేరి, ఏడాదిలోపు వారికి ఓ కూతురు పుట్టడానికి కారణమయ్యాయి.!
ఇప్పుడు ఆ ఫ్యామిలీలో ముగ్గురు ఖర్చులు పెరిగాయ్.! వచ్చే జీతం ఏ మూలకు చాలట్లేదు. దీంతో అతడు తండ్రి నుండి తన వాటాగా వచ్చిన పొలాన్ని అమ్మి ఆ డబ్బులతో సొంతంగా కిరాణా షాప్ పెట్టుకున్నాడు. అతడి నిజాయితీ గురించి తెల్సిన గ్రామస్తులందరూ అతడి షాప్ కే వెళ్లడం ప్రారంభించారు. తమ కష్టాలు తీరాయి అనుకుంటున్న తరుణంలో సొంత అన్నపైనే కన్ను కుట్టిన తమ్ముడు ఆ షాప్ లో అన్నీ కల్తీ సరుకులే అమ్ముతున్నాడని తప్పుడు కేసు బనాయించాడు. ఇంతకు ముందు అన్న పనిచేసిన షాప్ ఓనర్ కూడా కొన్ని డబ్బులిచ్చి కేసును మరింత గట్టిగా రాయించాడు. దీంతో బాగా నడుస్తున్న షాప్ మూతపడింది.
అయినా ఏ మాత్రం ధైర్యం కోల్పోని అతను ఫ్యామిలీని తీసుకొని సొంత ఊరికి దూరంగా ఉన్న టౌన్ కు వెళ్లాడు . ఓ రిక్షాను కిరాయికి తీసుకొని నడపడం స్టార్ట్ చేశాడు.ఉదయం 5 కు స్టార్ట్ చేస్తే రాత్రి 9 వరకు రిక్షా తొక్కేవాడు. భర్త కష్టాన్ని అర్థం చేసుకున్న భార్య…”నేను కూడా రెండు మూడు ఇండ్లలో పాచి పనిచేస్తాన”ని చెబితే భర్త అందుకు ఒప్పుకోలేదు. “నేను కష్టపడుతూనే ఉన్నాను కదా.! నువ్వు పాపను , నన్ను చూసుకో చాలు” అని చాలా సున్నితంగా భార్య ప్రతిపాదనను తిరస్కరించాడు.
Advertisements
Advertisement
ఓ రోజు రాత్రి 9 గంటలకు రిక్షాపై ఇంటికొస్తున్న అతనిని లారీ ఢీ కొట్టింది, దీంతో అతని తలకు బలమైన దెబ్బ తగిలి శాశ్వతంగా చూపును కోల్పోయాడు. ఏమీ చేయలేని నిస్సాహయత అతనిది. రోజులు గడుస్తున్నాయ్ జీవనం కష్టమవుతుంది. ఈ క్రమంలో కుటుంబ బాధ్యతను భార్య తన భుజాలపై వేసుకుంది. రోజు 4-5 ఇండ్లలో పనిచేస్తూ ఆ వచ్చిన డబ్బుతో భర్తను, పాపను పోషించడం ప్రారంభించింది.
“నిన్ను చూస్తే ఇంత అందంగా ఉన్నాడు, నీ భర్తకేమో నీ అందాన్ని చూసే అవకాశం లేదు. మాకైనా చూపించొచ్చు కదా నీ అందాలు” అంటూ….పోరంబోకుల సూటిపోటి మాటలు. మింగేసేలా చూసే ఆ చూపులు..రోజూ వాటిని దాటుకుంటూనే ఆమె తన పనికి వెళుతుండేది. సహనాన్ని, ధైర్యాన్ని తోడుతీసుకొని.!
Advertisements
నీ భర్తకు కండ్లు కనిపించవు కదా…ఆ రైల్వే స్టేషన్ కు వెళ్లి అడుక్కుంటే నీకు కాస్త హెల్ప్ గా కూడా ఉంటుంది కదా..అని అపాటికే చాలా మంది ఉచిత సలహాలనేకం ఇచ్చారు. భర్త కూడా భార్యతో…”అడుక్కుంటే తప్పేంటి.. మనం నిస్సాహయ స్థితిలో ఉన్నాం కదా.! రేపటి నుండి బిక్షాటనకు వెళతాన”ని అన్నాడు…భార్య దానికి అంగీకరించలేదు . నా రెక్కాడినన్ని రోజులు మనం ఎవ్వరి ముందు చేయిచాచకుండా కష్టపడతాను..అవసరమైతే ఇంకా రెండిళ్లు మాట్లాడుకుంటానని చెప్పి భర్త ప్రయత్నాన్ని విరమించేలా చేసింది.
ఓ రోజు భార్య వచ్చే సమయానికి భర్త…తన కూతురి సహాయంతో ఓ సంచిలోని చిల్లరను లెక్కిస్తున్నాడు…రాగానే భార్య ఏంటండీ ఈ పని.? ఎవరో చెప్పిన మాటలు విని, మీ ఆత్మ గౌరవాన్ని చంపుకొని చేయి చాచి అడుక్కున్నారా..? ఈ పాపిష్టి సొమ్ము మనకొద్దని గట్టిగా ఏడుస్తుంది. ఇది గమనించిన అతను…. మేడమ్ కాస్త ఆగండి…ఇవి నేను ఈ రోజు రైల్వే స్టేషన్ లో పేపర్ అమ్మి సంపాదించిన సొమ్ము…పాపిష్టిది కాదు…కష్టానిది.! అనడంతో తన్మయంతో భర్తను కౌగిలించుకుంది. భార్య…కళ్లు లేనప్పటికీ భార్య కళ్ళల్లోని ఆనందాన్ని చూడగలిగాడు భర్త.!